సాక్షి, నల్లగొండ: నల్లగొండలో నేను చేసిన అభివృద్ధే కనిపిస్తుందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని ఆయన క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాదరి మారయ్య పుణ్యామని నల్లగొండ రోడ్లు బాగుపడుతున్నాయి. రూ.వంద కోట్లు తెచ్చి అక్కడక్కడా కుక్కల బొమ్మలు, గాడ్దుల బొమ్మలు పెట్టి అభివృద్ధి అంటున్నారు.
పట్టణంలో రోడ్ల వెడల్పులో ఇళ్ల కూలగొట్టారు, రేపు పండ్ల బండ్లవాళ్లనీ అక్కడ ఉండనివ్వరు.. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి పోయేకాలం దగ్గర పడిందని అన్నారు. రూ.వంద కోట్లు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి పెట్టిన అది పూర్తి చేస్తే పాత బస్తీలో వాసన పోయేదని పేర్కొన్నారు. నల్లగొండలో మీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారని ఒక విలేకరి ప్రశ్నించగా అభివృద్ధి చేయలేదని అంటే ప్రజలు చెప్పుతో కొడతారన్నారు. ఆనాడు వైఎస్ సహకారంతో కేంద్రాన్ని ఒప్పించి రైల్వే ప్లైఓవల్ నిర్మించాను. దాని విలువ ఇప్పుడు రూ.270 కోట్లు, సొరంగమార్గం, బ్రాహ్మణవెల్లంల, ఉదయసముద్రం ప్రాజెక్టు, పట్టణంలో రోడ్లు, మహాత్మాగాంధీ యునివర్సిటీ అన్నీ నేను మంజూరు చేయించినవేనని, అవి వారికి కనిపించడం లేదని అన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా బీబీనగర్ ఎయిమ్స్ కూడా అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. నకిరేకల్ నుంచి పానగల్ రోడ్డు విస్తరణ ఆనాడు ఇద్దరు ఎంపీలైన గుత్తా, బూర నర్సయ్య ఉండి ఏమి చేయలేదు.. నేను ఎంపీ అయిన తర్వాతే మంజూరు చేయించానన్నారు. నడి సెంటర్‌లో రూ.వంద కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిలో బుద్ధి ఉన్న వాళ్లు ఎవరైనా బీఆర్‌ఎస్ పార్టీ భవనం కట్టుకుంటారా అని ప్రశ్నించారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ దాన్ని తీసి వేసి ఆ స్థలంలో పేదలకు, జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, లేదా హాస్టళ్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment