సాక్షి, నల్లగొండ : అధికార టీఆర్‌ఎస్‌లో టికెట్ల లొల్లి షురూ అయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటున్న ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది. ఒక్కో వార్డులో కనీసం ఇద్దరినుంచి ముగ్గురు దాకా టికెట్ల కోసం పోటీ పడుతున్నా రు. అందరికీ టికెట్ కేటాయించడం సాధ్యం కాని పనికావడంతో స్థానిక నాయకులు సైతం బుజ్జగించే పనిలో పడ్డారు.
ఇప్పటికే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావడం, మున్సిపల్ ఎన్నికలు మినహా మరో ఐదేళ్ల దాకా ఎలాంటి ఎన్నికలూ లేకపోవడంతో ఇదే చివరి అవకాశంగా భావిస్తున్నారు. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో కొన్ని పల్లెలూ వార్డులుగా మారిపోవడంతో కౌన్సిలర్ పదవుల కోసం పోటీ ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా ఏడు మున్సిపాలిటీల్లో 162 వార్డులు ఉన్నాయి. దీంతో టికెట్ దక్కకుంటే రెబల్‌గా బరిలోకి దిగాలని భావిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకుల సంఖ్య కూడా పెరిగిపోతోంది.
ప్రత్యేక ప్యానెల్‌తో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
టికెట్ దక్కదని టీఆర్‌ఎస్ కేడర్ భావిస్తున్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల నాటినుంచి ఈ సమస్య ముదిరిపోయింది. ఈ నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతున్న చిట్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను తమకు ఒక్క టికెట్ కూడా దక్కే అవకాశం లేదని భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గం ఒక విధంగా స్థానిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిందని చెబుతున్నారు.
మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రవీందర్ నాయకత్వంలో మంగళవారం చిట్యాలలో అసంతృప్తుల సమావేశం జరిగింది. కాంగ్రెస్, సీపీఎంలతో కలిసి టీఆర్‌ఎస్ పాత నాయకులు ప్రత్యేకంగా ప్యానెల్ ఏర్పాటు చేసుకుని పోటీకి దిగాలని నిర్ణయించుకున్నారు.
ఈ మండలంనుంచే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడి టికెట్ల కేటాయింపులో వీరి ప్రభావం కొంత ఉండే అవకాశం ఉన్నా.. మున్సిపాలిటీల గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలకే అప్పజెప్పినందున, చిట్యాల గెలుపు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తికి సవాల్‌గా మారింది. వీరేశం వర్గానికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరన్న ముందస్తు అంచనాతో ప్రత్యేక ప్యానెల్‌గా పోటీకి దిగాలని భావిస్తున్నారని చెబుతున్నారు.
రెబల్స్ బెడద
ఎన్నాళ్లనుంచో పార్టీలో పనిచేస్తున్న వారికీ టికెట్లు దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న అంచనాతో వారిలో అత్యధికులు రెబల్స్‌గా బరిలోకి దిగాలని చూస్తున్నారని టీఆర్‌ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే జిల్లాలో టీఆర్‌ఎస్ మున్సిపల్ అభ్యర్థుల ప్రకటన మొదలైంది. జిల్లా కేంద్ర మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోమవారమే 18 వార్డులకు అభ్యర్థులను ప్రకటించారు. మరికొన్ని కూడా ప్రకటించాల్సి ఉన్నా.. అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నిలిపివేశారని సమాచారం. గత మున్సిపల్ ఎన్నికల్లో (2014) ఆయా వార్డులనుంచి పోటీ చేసి ఓడిపోయిన వారు ఈసారి మళ్లీ టికెట్లు ఆశిస్తున్నారు.
అయితే, ఇక్కడ కాంగ్రెస్, ఇతర పార్టీలనుంచి గెలిచిన వారు టీఆర్‌ఎస్‌లో చేరారు. సిట్టింగ్‌లను పక్కన పెట్టే పరిస్థితి లేకపోవడంతో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన పార్టీ కేడర్ తమకే ఇవ్వాలని పట్టుబడుతోంది. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందంటున్నారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలు టీఆర్‌ఎస్ రాజకీయాలను వేడెక్కించాయి. టీ ఆర్‌ఎస్‌లో టికెట్ దక్కని వారు బయటకు వచ్చి రెబల్స్ పోటీ చేస్తే తమ పార్టీలోకి ఆహ్వానించాలని కాంగ్రెస్, బీజేపీలు ఎదురు చూస్తున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది.
అత్యధిక వార్డుల్లో విజయం సాధిస్తాం
మున్సిపల్ ఎన్నికల్లో చిట్యాలలో అత్యధిక వార్డుల్లో విజయం సాధిస్తామని చిట్యాల మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుడు శేపూరి రవీందర్ అన్నారు. చిట్యాలలో మంగళవారం ఆయన తన వర్గీయులతో కలిసి సమావేశం నిర్వహించారు. తను వీరేశంవర్గం కావడంతో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోటీకి అవకాశం ఇవ్వరనే ఆలోచనతోనే ముందస్తుగానే కలిసి వచ్చే పార్టీలతోపాటు తన వర్గానికి చెందిన పలువురు నాయకులతో కలిసి బరిలో దిగాలని ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో తనతో కలిసి వచ్చే నాయకులతోపాటు వివిధ పార్టీలతో పొత్తులతో ఓ ప్యానెల్‌గా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఆ నాయకులు శేపూరి జయమ్మ, తాడూరి చంద్రం, కుక్కల మోహన్, మన్నెం సైదులు, దామానూరి అశోక్, కోనేటి కృష్ణయ్య, పల్లపు వెంకటయ్య, వావిళ్ళ భారతమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment