సాక్షి, నల్లగొండ : నీలగిరి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహ, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను గెలిచి తీరాలనే లక్ష్యంతో అభ్యర్థులు రేయింబవళ్లు ఎన్నికల వ్యూహాలను రచిస్తూ ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులు వారి గెలుపును చాలెంజ్‌గా తీసుకొని ప్రత్యర్థి వైపు ఉన్న ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వశక్తులా పోరాడుతున్న అభ్యర్థులు నీలగిరి మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇరు పార్టీల ముఖ్య నాయకులు మున్సిపల్ ఎన్నికల భారం తమ మీద వేసుకొని అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా రెండు ప్రధాన పార్టీల మధ్య రసవత్తర రాజకీయమే నడుస్తోందని చెప్పవచ్చు. అభ్యర్థి తమ గెలుపు కోసం ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎక్కువగా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు.
మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని నీలగిరి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ నాయకులు భావిస్తుంటే, కాంగ్రెస్ తమ స్థానం నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. వార్డుల్లోని ప్రజలను తమ తరపున ప్రచారానికి రావాలని ఖర్చు ఎంతైనా భరిస్తున్నారు. ఎదుటి పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం కోసం వెళ్లే వారిని ఎలాగైనా నివారించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓ వార్డులో 1000 మందికి పైగా భోజనాలు ..
పట్టణంలోని వన్‌టౌన్ ప్రాంతంలో గల ఓ వార్డు అభ్యర్థి వార్డు ఓటర్లందరు తమ వెంటే ఉన్నారని అనిపించుకునేందుకు భారీ ర్యాలీ నిర్వహించి 1000 మందికి పైగా భోజనాలు పెట్టారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే వారందరికి ఓ చోట టెంట్ వేసి భోజనాలు వండించి పెట్టి ఓటర్లను తమ వైపు తిప్పకుంటున్నారు. ఇలా ఒక అభ్యర్థి చేస్తే మరుసటి రోజు మరో అభ్యర్థి తామేమన్న తక్కువ ఉన్నామా అన్నట్లు ప్రజలను భారీగా రప్పించి బలప్రదర్శనకు దిగుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment