టీఆర్‌ఎస్‌ దెబ్బకు ప్రతిపక్షాలు మటాష్‌..! | TRS Leaders Campaign in Nalgonda Municipal Elections | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ దెబ్బకు ప్రతిపక్షాలు మటాష్‌..!

Published Tue, Jan 21 2020 1:03 PM | Last Updated on Tue, Jan 21 2020 1:03 PM

TRS Leaders Campaign in Nalgonda Municipal Elections - Sakshi

మాట్లాడుతున్న నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నల్లగొండ, చిట్యాల(నకిరేకల్‌) : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ దెబ్బకు ప్రతిపక్షాలు కోలుకోలేకపోతున్నాయని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇప్పటికీ తేరుకోలేక ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతో కలిసి మంత్రి సోమవారం చిట్యాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మున్సిపాలిటీలకు రూ.వందల కోట్ల నిధులు మంజూరు చేస్తామని “ఉత్త’కోతలు కోస్తున్నారని అన్నారు. ఏ పార్టీలో ఉన్నారో గట్టిగా అడిగితే చెప్పకోలేని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ ఓ ఎండిపోయిన చెట్టని, ఆ పార్టీకి ఓటెస్తే ఎలాంటి ఫలితం ఉండదన్నారు. ఫలాలున్న టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తే అభివృద్ధి సాధ్యమన్నారు. చిట్యాలలోని హైవేపై అండర్‌పాస్‌తో పాటు అధిక నిధులు కేటాయించి వసతులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఓటు విలువ తెలుసుకుని ప్రజలంతా మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు పలకాలని కోరారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళల, పేదల ఆత్మగౌరవం దెబ్బతినకుండా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. 

ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే : బడుగుల
అన్ని వర్గాల ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపు ఉన్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. మతిభ్రమించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

ప్రజల ఆత్మగౌరవం కాపాడుతా :చిరుమర్తి
నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవం కాపాడేలా నిజాయితీగా పనిచేస్తానని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిల అండదండలతో అధిక ని«ధులు మంజూరు చేయించి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానన్నారు. గులాబీ ముసుగులో తిరుగుతున్న దొంగలను తరిమికొట్టాలన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జడల ఆదిమల్లయ్య, పాటి నర్సిరెడ్డి, కర్నాటి ఉప్పల వెంకట్‌రెడ్డి, పిశాటి భీష్మారెడ్డి, గుండెబోయిన సైదులు, రెగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య యాదవ్, బెల్లి సత్తయ్య, మెండె సైదులు, జనగాం నర్సింహగౌడ్, ఆవుల అయిలయ్య, సాగర్ల గోవర్ధన్, బొబ్బలి శివశంకర్‌రెడ్డి, జిట్ట చంద్రకాంత్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement