నల్లగొండ: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని ముఖ్య నాయకులు ఏకమవుతున్నారు. మొన్నటి వరకు అంటీముట్టనట్టుగా ఉన్న నేతలు ఐక్యతా రాగం ఆలపిస్తున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి తన పుట్టిన రోజును పురస్కరించుకొని సోమవారం రాత్రి ఇచ్చిన విందుకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు అంతా హాజరయ్యారు.
ముఖ్యంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లి మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా.. తామంతా కలిసే ఉన్నామనే సంకేతాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనూ నేతలు అదే ఐక్యతా రాగాన్ని అందుకున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారారు. బుధవారం కోమటిరెడ్డి ఇంట్లో రాష్ట్ర నేతలు లంచ్ మీటింగ్‌కు హాజరై ఐక్యతను చాటారు.
ఇన్నాళ్లు ఎవరికి వారుగానే..
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన నాటి నుంచి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆయన పెద్దగా కలిసి పాల్గొన్న సమావేశాలు లేవు. మంత్రి, గుత్తా మధ్య ఎలాంటి వివాదం లేకపోయినా పెద్దగా కలిసేవారు కాదు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటం.. ఇదే సమయంలో మంత్రి తన పుట్టిన రోజు వేడుకలకు రావాలని ఆహ్వానించడంతో గుత్తా కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో తామే గెలుస్తామని ఇప్పటికే చెబుతున్న నేతలు ఈ కలయిక ద్వారా తాము కలిసి పనిచేస్తామనే సంకేతాన్ని పార్టీ కేడర్‌కు పంపే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి పోటీ చేయాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి కలయికకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఒక్కటవుతున్న ముఖ్య నేతలు
కాంగ్రెస్ పార్టీలో నేతలు అంతా ఒక్కటవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలను తాము గెలిచి తీరుతామన్న సంకేతాన్ని కేడర్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇదివరకే స్పష్టం చేసిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తామంతా కలిసే ఉన్నామనే విషయాన్ని రుజువు చేసే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం, ఆ మీటింగ్‌కు రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఇతర రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.
కోమటిరెడ్డి సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. అందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులతోపాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ పర్యటించడం ద్వారా పార్టీని గెలిపించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి ఈ భేటీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒక్క తాటిపైకి వచ్చారన్న సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది.
నియోజకవర్గ స్థాయిలో చెక్ పెట్టేదెలా..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కిందిస్థాయిలో మాత్రం లుకలుకలు అలాగే కొనసాగుతున్నాయి. కోదాడ, నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయి నాయకులు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీ టికెట్ ఇస్తే కోదాడలో కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, నాగార్జునసాగర్‌లో బుసిరెడ్డి పాండురంగారెడ్డి, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మన్యం రంజిత్ యాదవ్, మునుగోడులో గుత్తా అమిత్, నల్లగొండలో పిల్లి రామరాజు యాదవ్, చాడా కిషన్‌రెడ్డి, నకిరేకల్‌లో వేముల వీరేశం బీఆర్‌ఎస్ నుంచి పోటీచేసేందుకు సిద్ధమై తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
ఇందులో కొందరు తమకు అవకాశం ఇస్తే పోటీ చేస్తామంటుండగా, మరికొందరు సిట్టింగ్‌లకు ఇవ్వకుండా, తమకే టికెట్ ఇవ్వాలని కోరుతున్న వారు ఉన్నారు. మరోవైపు వేముల వీరేశం, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటారనే ప్రచారంపైనా బుధవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరోక్షంగా వివరణ ఇచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీకి అభ్యర్థులున్నారని, ఓవర్ లోడ్ అయిందని, ఇతర పార్టీల నుంచి చేరికలు అవసరం లేదని స్పష్టం చేశారు.
అయితే అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయిలో నెలకొన్న అసమ్మతిని ఎలా చల్లార్చుతారు? టికెట్లు ఆశిస్తున్న వారిని ఎలా బుజ్జగిస్తారు? అన్నది ముఖ్య నేతలకు సవాల్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment