‘మెదక్‌ను హరితవనం చేయాలి’ | TRS MLA Bhupal Reddy Plant Trees In Medak | Sakshi
Sakshi News home page

‘మెదక్‌ను హరితవనం చేయాలి’

Published Sat, Aug 3 2019 10:19 AM | Last Updated on Sat, Aug 3 2019 10:20 AM

TRS MLA Bhupal Reddy Plant Trees In Medak - Sakshi

కమలాపూర్‌లో మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మూడు కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట మండలం కమలాపూర్, జంబికుంట గ్రామాల్లో నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీఆర్‌డీఏ ఏపీడీ సీతారామారావులతో కలిసి వర్షంలోనే మొక్కలు నాటారు. మెగా ప్లాంటేషన్‌ కార్యక్రమంలో భాగంగా జంబికుంట ప్రధాన రహదారి నుంచి గ్రామం వరకు ఇరువైపులా జూనియర్‌ కళాశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జంబికుంట, పేటలోని స్త్రీశక్తి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహించిన హరితహారంలో మొక్కలను నాటి పట్టించుకోలేదన్నారు.

ఈ సారి నూతన పంచాయితీరాజ్‌ చట్టం ప్రకారం ప్రతీ మొక్కకు పక్కా లెక్కతో పాటు ప్రతీ గ్రామంలో 47 వేల మొక్కలను నాటడంతో సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. 85 శాతం మొక్కలను కాపాడకపోతే సర్పంచ్, గ్రామ కార్యదర్శిపై వేటు తప్పదన్నారు. గ్రామ సభలు క్రమం తప్పకుండానిర్వహించుకొని ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. కర్ణాటక, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి 15 నుంచి 20 రకాల పండ్ల మొక్కలను తెప్పించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతీ యేటా 100 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళిక చేపట్టినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా అధికారులు జిల్లాలో మొక్కలను పెంచాలన్నారు. దీంతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా మారేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఇంకుడుగుంతలు చేపట్టడంతో పాటు నీటిని వృథా చేయకూడదని కోరారు. ఎస్‌బీఎం ద్వారా నిర్మించిన టాయిలెట్స్‌ను వినియోగించుకొని అంటురోగాలకు దూరంగా ఉండాలన్నారు.

ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలి.. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. ప్రతీ గ్రామం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. చెట్లు నాటడమే కాకుండా సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. ఇథియోఫియా దేశాన్ని ఆదర్శంగా తీసుకొని హరితహారం విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యులు విజయరామరాజు, ఎంపీడీఓ బన్సీలాల్, తహసీల్దార్‌ కిష్టానాయక్, సర్పంచ్‌లు కుంట్ల రాములు, మామిడి సాయమ్మ, ఎంపీటీసీ స్వప్నరాజేశ్, రైతు సమితి అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, ఏపీఓ సుధాకర్, ఏపీఎం గోపాల్, పీఆర్‌ ఏఈ రత్నం, ఏఓ రత్న, నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

అల్లాదుర్గంలో మొక్కలు నాటిన కలెక్టర్‌
అల్లాదుర్గం(మెదక్‌): అల్లాదుర్గం రేణుకా ఎల్లమ్మ ఆలయం ఆవరణలో శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ ధర్మారెడ్డి మొక్కలు నాటారు. అంతకుముందు రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కలెక్టర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షం పడుతున్నా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడి టీచర్లు, డ్వాక్రా గ్రూపు మహిళలు, ఈజీఎస్‌ సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ పీడీ సీతరామారావ్, అడిషనల్‌ పీడీ, ఐసీడీఎస్‌ పీడీ రసూల్‌బీ, మండల ప్రత్యేక అధికారి సుధాకర్‌ ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సౌందర్య, సర్పంచ్‌ అంజయ్య యాదవ్, సీడీపీఓ సోమశేఖరమ్మ, ఎంపీడీఓ రాజమల్లయ్య, మాజీ ఎంపీపీ కాశీనాథ్, ఏపీఎం అశోక్, సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ మహ్మద్‌గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

చెత్త రహిత జిల్లాగా మార్చేద్దాం

మెదక్‌ జోన్‌: మెదక్‌ జిల్లాను సంపూర్ణ ఆరోగ్యం, చెత్త రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా విద్యార్థులను చైతన్యం చేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్‌ ధర్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరెట్‌లో ప్రధానోపాధ్యాయులతో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి నర్సరీని ఏర్పాటు చేసి అందులో పలు రకాల పండ్లు, పూల మొక్కలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. పాఠశాలల్లో అన్ని రకాల మొక్కలు నాటాలన్నారు. ఉపాధి హామీ కూలీలతో పాఠశాల ప్రాంగణంలో వందకుపైగా గుంతలు తీయిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈనెల 7న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో హరితహారం కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో 50 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి హైదరాబాద్‌కు రిసైక్లింగ్‌ కోసం పంపించినట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గిస్తే చెత్త రహిత గ్రామాలుగా రూపు దిద్దుకుంటాయన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలని ఎంపీడీఓలకు ఆదేశాలు జారిచేసినట్లు తెలిపారు. అనంతరం ఐలవ్‌ మై జాబ్‌ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో జిల్లా స్థాయిలో నిలిచిన విజేతలను కలెక్టర్‌ సన్మానించారు. వహిదుల్లా షరీఫ్‌(బాలుర ఉన్నత పాఠశాల, మెదక్‌), సుకన్య(జెడ్పీహెచ్‌ఎస్, పాపన్నపేట), సమీర్‌(జెడ్పీహెచ్‌ఎస్‌ కుసంగి), సాజిద్‌ పాషా(ప్రాథమిక పాఠశాల బొడ్మట్‌పల్లి)లను కలెక్టర్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రవికాంత్‌రావు, నోడల్‌ అధికా>రి మధుమోహన్, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, సెక్టోరియల్‌ అధికారులు నాగేశ్వర్, సుభాష్, ఏడీ భాస్కర్‌తోపాటు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement