tree plantation
-
అడవులను సరిగ్గానే పెంచుతున్నామా?
దాదాపు 200 సంవత్సరాలకు పైగా భారతదేశం చెట్ల పెంపకంపై ప్రయోగాలు చేసింది. అడవులను పునరుద్ధరించే వివిధ విధానాలు... అవి స్థానిక సమాజాలపై, విస్తృత పర్యావరణంపై చూపే పరిణామాల గురించి మన దేశం ముఖ్యమైన పాఠాలను అందిస్తోంది. అందుకే గత తప్పిదాలు పునరావృతం కాకుండా అటవీశాఖాధికారులు చూసుకోవాలి. చెట్లను నాటడం అనగానే కచ్చితంగా అడవిని పునరుద్ధరించినట్టు అర్థం కాదు. చెట్ల కొరత ఉన్న పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం కూడా ముఖ్యం. పై నుండి అటవీ పందిరిని చూసి మురవడం కంటే కూడా దానివల్ల పర్యావరణం, స్థానిక ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలను నిర్ణయించడం విజయానికి మరింత సహాయ ప్రమాణంగా ఉంటుంది. అడవులను తమకు తాముగా పునరుత్పత్తి చేసుకునేలా చేయడం అనేది, వాతావరణంలో భూమిని వేడెక్కించే కార్బన్ ను తగ్గించడం కోసం చేసే ఒక వ్యూహంగా ఉంటోంది. అదే సమయంలో జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలు అందించే ప్రయోజనాలతోపాటు జీవనోపాధికి చెందిన ఫలవంతమైనదాన్ని కూడా అవి పెంచుతూ వచ్చాయి. కానీ వాతావరణ మార్పును పరిమితం చేసే ఉద్దేశంతో చెట్ల విస్తృతిని పెంచే ప్రయత్నాలు చివరకు వేగంగా పెరిగే ఉద్యానవనాలను నిర్మించడం వైపు మొగ్గు చూపాయి. పొలాలు, బంజరు భూముల్లో తోటలను పెంచితే అవి కలపను, వంటచెరుకును అందించగలవు. ఇవి సహజ అడవులపై ఒత్తిడిని తగ్గించి, వాటి పునరుత్పత్తికి సహాయపడతాయి. కానీ సరైన రీతిలో జరగని చెట్ల పెంపకం తొలగించలేని జాతులను పెంచుతుంది. అవి ప్రజలను తమ భూమికి దూరమయ్యేట్టు చేస్తాయి. దాదాపు 200 సంవత్సరాలకు పైగా భారతదేశం చెట్ల పెంపకంపై ప్రయోగాలు చేసింది. అడవులను పునరుద్ధరించడంలో వివిధ విధా నాలు... అవి స్థానిక సమాజాలపై, విస్తృత పర్యావరణంపై చూపే పరిణామాల గురించి మన దేశం ముఖ్యమైన పాఠాలను అందిస్తోంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి, ఈ అరుదైన దీర్ఘకాలిక దృక్పథాన్ని నేడు అటవీశాఖాధికారులు గమనించాలి. దురాక్రమణ చెట్లు 18వ శతాబ్దం మధ్యకాలం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన దేశానికి చెందిన అనేక వ్యవహారాలను బ్రిటన్ నియంత్రించింది. 1857 నుండి 1947 మధ్య బ్రిటిష్ రాణి నేరుగా దేశాన్ని పాలించింది. భారతదేశం నుండి కొల్లగొట్టిన పత్తి, రబ్బరు, తేయాకును రవాణా చేయడం కోసం, బ్రిటన్ కు రైల్వే స్లీపర్లను వేయడానికి, ఓడ లను నిర్మించడానికి పెద్ద మొత్తంలో కలప అవసరమైంది. 1865 భారత అటవీ చట్టం ద్వారా, టేకు, సాల్, దేవదారు వంటి అధిక దిగుబడినిచ్చే కలప చెట్లతో కూడిన అడవులను ప్రభుత్వం ఆస్తిగా మార్చుకొంది. ఈ అడవుల్లో ఈ కలప దిగుబడిని అధికం చేసేందుకు బ్రిటిష్ వలసపాలనాధికారులు గడ్డి, వెదురు కంటే మించిన రకాలను వేయకుండా స్థానిక ప్రజల హక్కులపై పరిమితులను విధించారు. ఆఖరికి పశువుల మేతపై కూడా ఆంక్షలు విధించారు. దీంతో భార తీయ సమాజాలు కొన్నిసార్లు అడవులను తగలబెట్టడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాయి. ఈలోగా వేడి, తేమతో కూడిన భారతదేశ వాతావరణానికి బాగా అలవాటుపడిన, మన్నికైన, ఆకర్షణీయమైన కలపకు మూలమైన టేకు తోటలు (టెక్టోనా గ్రాండిస్) దూకుడుగా వ్యాపించాయి. దాంతో సహజమైన గడ్డి భూములు, పొదలతో కూడిన అడవులు ఏకరూప టేకు పంటలకు దారితీశాయి. భారతదేశంలో లేని యూకలిప్టస్, ఇతర అన్యదేశ చెట్లను సుమారు 1790 నుండి బ్రిటిష్‌వాళ్లు పరిచయం చేశారు. ఐరోపా, ఉత్తర అమెరికా నుండి తెచ్చిన దేవదారు చెట్లను హిమాలయ ప్రాంతంలో జిగురు కోసం; ఆస్ట్రేలియా నుండి తెచ్చిన అకేసియా చెట్లను కలప, మేత కోసం నాటారు. ఈ జాతులలో ఒకటైన, ‘వాటిల్’ (అకే సియా మియర్న్సి– ఒక తుమ్మ రకం)ని 1861లో కొన్ని లక్షల మొక్కలతో పశ్చిమ కనుమలలోని నీలగిరి జిల్లాలో ప్రవేశపెట్టారు. వాటిల్ అప్పటి నుండి ఆక్రమించే మొక్కగా మారి, ఈ ప్రాంతంలోని గడ్డి భూములను స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా, దేవదారు హిమాలయాలలో చాలావరకు వ్యాపించి, స్థానిక ఓక్(సిందూర) చెట్లను స్థానభ్రంశం చేసింది. మధ్య భారతదేశంలోని స్థానిక గట్టి చెక్క అయిన సాల్ స్థానంలోకి టేకు వచ్చింది. ఓక్, సాల్ రెండూ ఇంధనం, మేత, ఎరువులు, ఔషధం, నూనె కోసం విలువైనవి. వీటినీ, మేత భూమినీ కోల్పోవడం చాలా మందిని పేదలుగా మార్చింది. ఏవి పనికొస్తాయి? ‘బాన్ ఛాలెంజ్’ కింద 2030 నాటికి సుమారు 2.1 కోట్ల హెక్టార్ల అడవులను పునరుద్ధరిస్తామని భారతదేశం ప్రతిజ్ఞ చేసింది. భారత ప్రభుత్వం, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) 2018లో విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్టులో దాదాపు ఒక కోటి హెక్టార్ల మేరకు అడవులు పునరుద్ధరణలో ఉన్నాయని పేర్కొన్నారు. చెట్లతో కప్పబడిన భూమి విస్తీర్ణాన్ని పెంచడంపై పెడుతున్న ఈ దృష్టి, భారత జాతీయ అటవీ విధానంలో ప్రతిఫలిస్తోంది. ఇది దేశంలోని 33 శాతం విస్తీర్ణంలో చెట్లను పెంచడాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ విధానంలోని పథకాలలో యూకలిప్టస్ లేదా వెదురు వంటి ఒకే జాతితో కూడిన తోటలు ఉంటాయి. ఇవి వేగంగా పెరుగుతాయి, చెట్లు కప్పే స్థలాన్ని త్వరగా పెంచుతాయి. కొన్నిసార్లు ఈ చెట్లను గడ్డి భూములు, చెట్ల వ్యాప్తి సహజంగా తక్కువగా ఉన్న ప్రాంతాలలో నాటారు. ఫలితంగా మేతకోసం, ఇతర ఉత్పత్తుల కోసం ఈ పర్యావ రణ వ్యవస్థలపై ఆధారపడిన గ్రామీణ, స్థానిక ప్రజలకు హాని కలుగు తోంది. అన్యదేశ చెట్లను నిరంతరం నాటడం వల్ల 200 ఏళ్ల క్రితం వాటిల్ మాదిరిగానే కొత్త ఆక్రమణ జాతులు వచ్చే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి సానుకూల కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. 2006 అటవీ హక్కుల చట్టం ఒకప్పుడు సాంప్రదాయ వినియోగంలో ఉన్న అటవీ ప్రాంతాలను నిర్వహించేందుకు గ్రామసభలకు అధికారం ఇచ్చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో అనేక గ్రామసభలు క్షీణించిన అడవులను పునరుద్ధరించాయి. పైగా వాటిని బీడీలు చుట్టడానికి ఉపయోగించే తునికి ఆకులకు స్థిరమైన వనరుగా మార్చాయి. అలాగే గుజరాత్ కbŒ∙గడ్డి భూముల్లో, 19వ శతాబ్దం చివరలో బ్రిటిష్ అటవీ అధికారులు ప్రవేశపెట్టిన ‘పిచ్చి చెట్లను’ తొలగించడం ద్వారా అక్కడి సమాజాలు గడ్డి భూములను పునరుద్ధరించగలిగాయి. ప్రయోజనాలూ ముఖ్యమే! అటవీ పునరుద్ధరణ ప్రయత్నాల విజయాన్ని చెట్ల విస్తృతితో మాత్రమే కొలవలేము. ‘అడవి’ గురించిన భారత ప్రభుత్వ నిర్వచనం ఇప్పటికీ ఏకరూప చెట్టు జాతులు, çపళ్ల తోటలు, ఆఖరికి వెదురు (నిజానికి ఇది గడ్డి కుటుంబానికి చెందినది) లాంటిదానికి మాత్రమే పరిమితమై ఉంది. దీనర్థం ద్వైవార్షిక అటవీ సర్వేలు ఎంత సహజ అడవులను పునరుద్ధరించారో లెక్కించలేవు; స్థానిక చెట్లను పోటీ జాతులతో స్థానభ్రంశం చేయడం వల్ల కలిగిన పరిణామాలను తెలియజేయలేవు; అన్యదేశ చెట్లు మన సహజమైన గడ్డి భూములను ఎంత ఆక్రమించాయో గుర్తించలేవు. పైగా అవి పునరుద్ధరించిన అడ వులుగా తప్పుగా నమోదు అవుతాయి. సహజ అటవీ పునరుత్పత్తిని, అలాగే కలప, ఇంధనం కోసం చెట్ల పెంపకాన్ని రెండింటినీ ప్రోత్సహించాలి. అయితే ఇతర పర్యావరణ వ్యవస్థలు, ప్రజల మీద వీటి ప్రభావాన్ని తప్పక పరిశీలించాలి. నాటు తున్న రకాలు దురాక్రమించేవిగా మారకుండా జాగ్రత్తగా ఎంచు కోవడం దీంట్లో భాగం. అటవీ హక్కులు, స్థానిక జీవనోపాధి, జీవ వైవిధ్యం, కర్బన నిల్వలపై దాని ప్రభావాల పరంగా చెట్ల కవరేజిని పెంచడానికి సంబంధించిన లక్ష్యాన్ని అంచనా వేయాలి. చెట్లను నాటడం అనగానే కచ్చితంగా అడవిని పునరుద్ధరించి నట్టు అర్థం కాదు. చెట్ల కొరత ఉన్న పర్యావరణ వ్యవస్థలను పున రుద్ధరించడం కూడా ముఖ్యం. పై నుండి అటవీ పందిరిని చూసి మురవడం కంటే దానివల్ల పర్యావరణం, స్థానిక ప్రజలకు జరుగు తున్న ప్రయోజనాలను నిర్ణయించడం విజయానికి మరింత సహాయ ప్రమాణంగా ఉంటుంది. ధనపాల్ గోవిందరాజులు వ్యాసకర్త పరిశోధకుడు, మాంచెస్టర్ యూనివర్సిటీ (‘ది కాన్వర్జేషన్’ సౌజన్యంతో) -
ఏసీ అక్కర్లేదు, ఒక చెట్టున్నా చాలు
న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ఏసీ గదుల్లోంచి బయటకు రావడానికే జనం ఇష్టం పడడం లేదు. సుభాషిణి చంద్రమణి అనే మహిళ మాత్రం ఎండ నుంచి రక్షణకి ఏసీ గదులు అక్కర్లేదని ఒక చెట్టు చాలని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఆమె మండుటెండలో నిల్చొని ఉష్ణోగ్రతని రికార్డు చేస్తే 40 డిగ్రీల సెల్సియస్ చూపించింది. అలా నడుచుకుంటూ పక్కనే ఉన్న చెట్టు నీడలోకి వెళితే ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయి 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంటే ఏకంగా 13 డిగ్రీలు తేడా ఉందన్న మాట. ఆమె ఈ ప్రయోగం చేసి దానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్టు చేస్తే అది వైరల్‌గా మారింది. -
వయసు 9.. మొక్కలు నాటడంలో సు'ప్రసిద్ధి'
తొమ్మిదేళ్ల ప్రసిద్ధి సింగ్‌కి ‘డయానా అవార్డ్ 2022’ దక్కింది. ఆ అమ్మాయిని అంతా ‘ఎకో వారియర్’ అంటారు. ‘క్లయిమేట్ ఛాంపియన్’ అని కూడా. ఎందుకు? మొక్కలు నాటుతుంది. చెట్లను పెంచుతుంది. అడవులను నిర్మించాలనుకుంటోంది. ఇప్పటికి 28 పండ్లతోటలు ప్రసిద్ధి ప్రోత్సాహంతో ఊపిరి పోసుకున్నాయి. పచ్చగా లేని ప్రపంచంలో జీవించలేము అంటుంది ప్రసిద్ధి. ఈ వానాకాలంలో ప్రసిద్ధిలా ఆలోచిస్తే నాలుగు మొక్కలు కనీసం కుండీల్లో అయినా పడతాయి. మూడేళ్ల పిల్లలు మట్టితో ఆడుకుంటారు. కాని ప్రసిద్ధి సింగ్ మొక్కలతో ఆడుకుంది. వాళ్ల నాన్న ప్రవీణ్ సింగ్ ఆ పాపను మూడేళ్ల వయసు నుంచే మొక్కలతో పరిచయం చేయించాడు. పాప చేత మొదటగా పెరట్లో నాటించింది ‘మిరప గింజల’ని. అవి మొక్కలుగా ఎదగడం చూసి ఆశ్చర్యపోయింది ప్రసిద్ధి. తండ్రి, కూతురు కలిసి దక్షిణ చెన్నై శివార్లలో ఉండే ‘మహేంద్ర వరల్డ్ సిటీ’లో ఉంటారు. దానికదే ఒక ప్రపంచం. పచ్చగా ఉండేది. అయితే 2016లో అంటే ప్రసిద్ధికి మూడేళ్ల వయసులో వచ్చిన వర్ధా తుఫాను ఆ పచ్చదనాన్ని ధ్వంసం చేసింది. చిన్నారి ప్రసిద్ధి మీద ఆ విధ్వంసం ముద్ర వేసింది. ‘నువ్వు మొక్కలు పెంచాలి. చూడు ఎలా నాశనం అయ్యాయో’ అని తండ్రి చెప్పిన మాట పని చేసింది. అంత చిన్న వయసులో అందరు పిల్లలూ ఆడుకుంటుంటే తనకు చేతనైన మొక్కలు నాటడం మొదలెట్టింది ప్రసిద్ధి. అది మొదలు. ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ప్రసిద్ధి ఫౌండేషన్ ‘నాకు చెట్లన్నా, తేనెటీగలన్నా, సముద్రమన్నా చాలా ఇష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా ఓటమిని అంగీకరించకు అని చెప్తాయి చెట్లు. నలుగురిని కలుపుకుని పని చెయ్ అంటాయి తేనెటీగలు. జీవితాన్ని సెలబ్రేట్ చేసుకో అని చెబుతుంది సముద్రం. అందుకే అవి నాకు స్ఫూర్తి’ అంటుంది ప్రసిద్ధి. చెట్లమీద ప్రేమతో 6 ఏళ్ల వయసులోనే ‘ప్రసిద్ధి ఫౌండేషన్’ను స్థాపించింది. ‘నా చేతుల మీదుగా లక్ష మొక్కలు నాటాలని సంకల్పించాను’ అంటుంది ప్రసిద్ధి. ఇప్పటికి ఎన్ని నాటిందో తెలుసా? 46,000. అవును... అన్ని వేల మొక్కలు ప్రసిద్ధి పూనిక వల్లే పచ్చగా తలలు ఎత్తాయి. అందుకే అందరూ ప్రసిద్ధి క్లయిమేట్ ఛాంపియన్ అంటున్నారు. పండ్ల మొక్కలే లక్ష్యం జపాన్‌కు చెందిన ‘అకిర మియావకి’ గొప్ప పర్యావరణవేత్త. 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సహజ అడవులను తలపించే ‘మియావకి ఫారెస్ట్’ను అతడు వృద్ధి చేశాడు. అంటే ఇందులో అన్నిరకాల చెట్లు, మొక్కలు, తీగలు ఉండి దానికదే ఒక అడవిగా మారుతుంది. దీని నుంచి స్ఫూర్తి పొందిన తాను ‘ఫూట్ ఫారెస్ట్’లను చెన్నై చుట్టుపక్కల వృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. అయితే తాను పెంచదలుచుకున్నవన్నీ స్థానిక (భారతీయ) పండ్ల మొక్కలే. ‘నాకు ఫ్రూట్ ఫారెస్ట్లు పెంచాలని ఎందుకు అనిపించిందంటే పండ్లు జనానికి అందుతాయి, తింటారు అని. ఇవాళ అన్ని రసాయనాల పండ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. రసాయనాలు లేని పండ్లు అందించాలి’ అంటుంది ప్రసిద్ధి. మామిడి, జామ, సపోట, నారింజ, నిమ్మ, రేగు, తాటి, సీమచింత ఇలా దేశీయంగా ఉండే పండ్ల మొక్కలు, చెట్లను పెంచడం ప్రసిద్ధి లక్ష్యం. 28 పండ్ల తోటలు ప్రసిద్ధి పెంచుతున్న ఫ్రూట్ ఫారెస్ట్‌లను మనం పండ్ల తోటలు అనవచ్చు. ఈ తోటలు ఎలా పెంచుతుంది? ‘భాగస్వామ్యం వల్ల’ అంటుంది ప్రసిద్ధి. స్కూళ్లలో ఉన్న ఖాళీ స్థలాలు, పారిశ్రామిక సంస్థలకు ఉన్న ఖాళీ స్థలాలు, ప్రయివేటు వ్యక్తుల దగ్గర ఉన్న ఖాళీ స్థలాలు వీటిని పండ్లతోటలకు ఇమ్మని అభ్యర్థిస్తుంది. ఫౌండేషన్‌లో స్వచ్ఛందంగా పని చేయడానికి వచ్చిన కార్యకర్తలు కూడా ఈ స్థలాలను గుర్తిస్తారు. ప్రసిద్ధి ఆ యాజమాన్యాలకు లేఖలు రాస్తుంది. ‘వారిని ఒప్పించడం కష్టమే గాని పరిస్థితి వివరిస్తే ఒప్పుకుంటారు’ అంటుంది నవ్వుతూ. అంతెందుకు? ప్రసిద్ధి తాను చదువుతున్న మహేంద్ర వరల్డ్ స్కూల్లో వంద పండ్ల మొక్కలు నాటింది. అవి ఎదుగుతున్నాయి. ఒకసారి స్థలం దొరికాక తన కార్యకర్తలు వెళ్లి ఫౌండేషన్ ద్వారా సేకరించిన మొక్కల్ని, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీలోని మొక్కల్ని తీసుకెళ్లి ప్రసిద్ధి ఆధ్వర్యంలో నాటుతారు. ‘మేము నాటుతాం సరే. కొందరు నీళ్లు పోయరు. కొన్నిచోట్ల నీళ్లు ఉండవు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. కొన్నిచోట్ల తోటమాలిని పెడతాం. 2021లో నాకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ దక్కితే ఆ డబ్బుతో ఒక తోటకు కంచె వేయించి బావి తవ్వించాను’ అంటుంది ప్రసిద్ధి. ప్రసిద్ధి చేస్తున్న పనికి చాలా మంది మద్దతు ఇస్తున్నారు. సహకరిస్తున్నారు. అలాగని చదువును నిర్లక్ష్యం చేయడం లేదు. ప్రసిద్ధి అనేక నగరాలకు తిరుగుతూ పర్యావరణ రంగంలో పని చేస్తున్న సంస్థలతో కలిసి ప్రకృతిని ఏదో ఒక స్థాయిలో కాపాడాలని చూస్తోంది. ఇది చదివాక మన వంతు. మేము నాటుతాం సరే. కొందరు నీళ్లు పోయరు. కొన్నిచోట్ల నీళ్లు ఉండవు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. కొన్నిచోట్ల తోటమాలిని పెడతాం. 2021లో నాకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ దక్కితే ఆ డబ్బుతో ఒక తోటకు కంచె వేయించి బావి తవ్వించాను. – ప్రసిద్ధి సింగ్ -
మొక్కలు నాటిన ఎస్ఐ
కాశినాయన : మండలంలోని ఓబుళాపురం సమీపంలోని సగిలేరు ఒడ్డున ఉన్న వివేకానంద సేవాశ్రమంలో ఆదివారం ఆశ్రమ నిర్వాహకులు రామకృష్ణారెడ్డి, రామతులసిలు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ హాజరై పలు రకాల మొక్కలు నాటారు. ఎస్ఐ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. డాక్టర్ పీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష మొక్కల నోము
‘రోజూ ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత నువ్వు ఒక గ్లాసు నీళ్లు తాగు, ఒక గ్లాసు మొక్కకు తాగించు’ ఈ మాట పిల్లల మెదళ్ల మీద ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో... ఆ మాట చెప్పినప్పుడు ఊహించలేం. కానీ పిల్లలు తప్పకుండా ప్రభావితం అయి తీరుతారు. ‘నువ్వు నాటేది ఒక్క మొక్క అయినా చాలు, దానిని బతికించి తీరాలి’ అని చెబితే పిల్లలు చాలెంజ్‌గా తీసుకుని తీరతారు. తోటి పిల్లల మొక్కల కంటే తన మొక్కను ఇంకా బాగా పెంచాలని తాపత్రయపడతారు. పిల్లలను ఈ రకంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి స్వయంగా మొక్కలు నాటుతుంటే, నాటిన మొక్కల బాగోగులు స్వయంగా పట్టించుకుంటూ ఉంటే పిల్లలు రోల్‌మోడల్‌గా తీసుకోకుండా ఉంటారా? అలా పిల్లలకు మొక్కల రోల్ మోడల్‌గా మారారు బొల్లంపల్లి జ్యోతిరెడ్డి. పదివేలకు పైగా మొక్కలు నాటి పుడమిని పచ్చగా మార్చడంలో తనవంతు భాగస్వామ్యం అందిస్తున్న ఈ పర్యావరణ కార్యకర్త సాక్షితో పంచుకున్న అనుభవాలివి. బొల్లంపల్లి జ్యోతిరెడ్డి పూర్వీకులది రంగారెడ్డి జిల్లా పడకల్. యాభై ఐదేళ్ల కిందట తాతగారు హైదరాబాద్ ఓల్డ్‌సిటీకి వచ్చి స్థిరపడడంతో జ్యోతిరెడ్డి తన పుట్టిల్లు ‘పాతబస్తీ’ అంటారు. పర్యావరణ కార్యకర్తగా మారడానికి ముందు తన జీవితాన్ని క్లుప్తంగా వివరించారామె. ‘‘పుట్టింది, పెరిగింది హైదరాబాద్ పాతబస్తీలో. అక్కడి ఆర్య హైస్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత మలక్‌పేటలోని శ్రీవాణి కాలేజ్. ఇంటర్ తర్వాత పెళ్లి, మెడిసిన్‌లో సీటు వచ్చింది. కానీ కుటుంబ బాధ్యతల రీత్యా సీటు వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ చేశాను. ముగ్గురు పిల్లలతో రామంతపూర్‌లో అత్తగారింట్లో గృహిణిగా జీవితం సాఫీగానే సాగుతూ ఉండేది. కానీ ఏదో వెలితి మాత్రం ఉండేది. అయితే మనిషిని సామాజిక జీవిగా మలచడంలో నేను చదువుకున్న ఆర్య స్కూల్‌ది చాలా కీలకమైన పాత్ర. నా సోషల్ యాక్టివిటీస్‌కి మూలం కూడా అదే. మేము ఉప్పల్‌కి మారాం. అక్కడ కూడా కాలనీలో పిల్లల కోసం సమ్మర్ క్యాంప్‌లు ఏర్పాటు చేయడం, క్రాఫ్ట్ క్లాసులు నిర్వహించడం వంటి ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నమయ్యేదాన్ని. వీటితోపాటు బ్యూటీపార్లర్లు నిర్వహిస్తూ కొంతకాలం నన్ను నేను బిజీగా ఉంచుకున్నాను. అప్పుడు ఉప్పల్ మెయిన్‌రోడ్ పొల్యూషన్ ఎంత తీవ్రంగా ఉందనేది నాకు అనుభవంలోకి వచ్చింది.ఒకసారి బయటకు వెళ్తే చాలు వాహనాల కాలుష్యం కారణంగా ముక్కు కారడం, దగ్గు, రకరకాల అలర్జీలు వచ్చేవి. భూమాత ఎదుర్కొంటున్న పరీక్షలు అర్థమయ్యాయి. పచ్చదనం లోపించిన పుడమి చల్లగా ఉండాలంటే ఎలా ఉంటుంది? అనిపించింది. నన్ను నేను పనిలో నిమగ్నం చేసుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటున్నాను, ఆ చేసే పని భూమాతకు పనికి వచ్చేదే అయితే బావుంటుంది కదా... అనుకున్నాను. అలా రూపుదిద్దుకున్నదే ‘గ్రీన్ ఇండియన్ సొసైటీ’ నారు... నీరు! ‘మొక్కలు నాటడం’ అనే మాట వినగానే ‘మరి వాటిని బతికించడం?’ అనే కౌంటర్ కూడా వినిపిస్తుంటుంది. నేను మొక్కలు నాటుతున్నాను, అలాగే వాటిని బతికించే బాధ్యత కూడా తీసుకున్నాను. నేను చేస్తున్నది మొక్కుబడిగా మొక్కలు నాటడం కాదు, బాధ్యతగా పచ్చదనాన్ని పెంపొందించడం. నేను మొక్క నాటుతున్నది భూమాతకు చల్లదనాన్నివ్వడం కోసం, కాబట్టి మొక్కను బతికించి చిగురు తొడిగితే మురిసిపోవడం కూడా నా సంతోషాల్లో భాగమే. అందుకే ఎవరి ఇంటి ముందు నాటుతున్నానో ఆ ఇంటి వాళ్ల నుంచి ‘మొక్కను బతికిస్తాం’ అనే మాట తీసుకుంటాను. పబ్లిక్ ప్రదేశాల్లో నాటే మొక్కలకు మనుషులను పెట్టి నీళ్లు పోయిస్తున్నాను. నా బాధ్యతలో స్కూల్ టీచర్లు బాగా సహకరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని స్కూళ్లతోపాటు జిల్లాల్లో విశాలమైన ఆవరణ ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎంచుకుంటున్నాను. మొక్క నాటి ట్రీ గార్డు పెట్టిన తర్వాత ఆ ట్రీ గార్డుకు నంబరు ఇస్తాం. పెద్ద క్లాసుల పిల్లలకు ఒక్కో చెట్టు బాధ్యత ఒక్కొక్కరికి అప్పగిస్తాం. ఆ మొక్కలు చిగురించినప్పుడు ఫొటో తీసి వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తారు టీచర్లు. స్కూళ్లలో మొక్కలు నాటడానికంటే ముందు పిల్లలకు చెట్లు ఎంత అవసరమో, చెట్లు లేకపోతే ఎదురయ్యే పరిణామాలెలా ఉంటాయో... వివరించి చెబుతాను. అలాగే ఇంట్లో మొక్కలు నాటి పెంచమని కూడా చెబుతాను. ‘మనకు దాహమైతే గ్లాసుతో నీళ్లు తీసుకుని తాగుతాం. మొక్కలకు దాహమైతే మరి? అవి కదలలేవు కాబట్టి వాటికి మనమే నీళ్లు తాగించాలి. మీరు అన్నం తినే ముందు మొక్కకు నీళ్లు పోస్తారా లేక నీళ్లు తాగిన తర్వాత మొక్క దాహం తీరుస్తారా? అదేదీ కాకపోతే ఉదయం నిద్ర లేచిన వెంటనే నీళ్లు పోస్తారా? అని పిల్లల డైలీ రొటీన్లో మొక్కకు నీళ్లు పోయడాన్ని ఒక తప్పనిసరి పనిగా చెప్తాను. బాల్యంలో మెదడు మీద పడిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. అందుకే నా గ్రీన్ ఇండియన్ సొసైటీ నిర్మాణానికి బాలయోధులను తయారు చేసుకుంటున్నాను. లక్ష మొక్కలు నాటాలనే నా లక్ష్యసాధనకు బ్రాండ్ అంబాసిడర్లు పిల్లలే అవుతారు’’ అని చెప్పారామె. కరోనా కారణంగా ఆమె మొక్కల నోముకు కొంత విరామం వచ్చింది. ఇప్పుడు మళ్లీ మొదలవుతోంది. లక్ష మొక్కల టార్గెట్‌ని చేరే వరకు ఇక విరామం తీసుకునేది లేదంటున్నారు జ్యోతిరెడ్డి. తొలి మొక్క వేప! మొక్కల ఎంపికలో కొన్ని నియమాలు పాటిస్తున్నాను. నిమ్మ, కలబంద, వేప, సపోట, నారింజ, తులసి, యూకలిప్టస్, గన్నేరు మొక్కలు ప్రధానంగా ఉంటాయి. నా తొలి మొక్క వేప. ఆలయాల్లో పండ్లు, పూల మొక్కలు. పబ్లిక్ ప్రదేశాల్లో గాలిని శుద్ధి చేయడమే ప్రధానమైన ఔషధ మొక్కలు, త్వరగా పెరిగే వృక్షజాతులను ఎంచుకుంటున్నాను. మొదట్లో అన్ని మొక్కలనూ నర్సరీ నుంచి కొనేదాన్ని. తర్వాత ప్రభుత్వ అధికారులు సంబంధిత డిపార్ట్మెంట్ల నుంచి కొన్ని రకాల మొక్కలు ఇచ్చి సహకరిస్తున్నారు. – జ్యోతిరెడ్డి, పర్యావరణ కార్యకర్త – వాకా మంజులారెడ్డి -
బర్త్‌డే: మొక్క నాటిన సీఎం కేసీఆర్
-
బర్త్‌డే: మొక్క నాటిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా హరిత విప్లవంలో మరో అపూర్వ ఘట్టానికి నాంది పలికారు. ‘కోటి వృక్షార్చన’ పేరిట గంట వ్యవధిలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఉద్యమ స్ఫూర్తితో సాగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం గ్రేటర్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. లైవ్ అప్డేట్స్ : ► కోటి వృక్షార్చన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా రుద్రాక్ష మొక్కను నాటారు. సీఎం వెంట ఎంపీ జోగినపల్లి సంతోష్ ఇతర నేతలు ఉన్నారు ►మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జలవిహార్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్పూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీలు కేకే, సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక కోటి వృక్షార్చన లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. ► కేసీఆర్ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ ప్రదర్శన ►సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బల్కంపేట ఆలయంలో ఎల్లమ్మ తల్లికి రెండున్నర కిలోల బంగారు చీరను బహుకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కూన వెంకటేష్ గౌడ్, ఆలయ ఈవో అన్నపూర్ణ. ► సిద్ధిపేట: సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా నర్సాపూర్ రోడ్డులో మొక్కలు నాటిన మంత్రి హరీష్ రావు. ►కరీంనగర్ జిల్లా: సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, కోటి వృక్షార్చనలో భాగంగా నగరంలో పలు చోట్ల మొక్కలు నాటిన మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై. సునీల్ రావు. ♦ తన క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ►సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్ మండలంలోని కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్యరావు. ♦సంగారెడ్డి కంది జిల్లా కేంద్ర జైలు వద్ద మొక్కలు నాటిన హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి నగరంలో ఇవీ కార్యక్రమాలు ►అమీర్‌పేటలోని గురుద్వారలో గురుగ్రంధ్ సాహెబ్‌కు ప్రత్యేక పూజలు ►బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయంలో రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన చీర అమ్మవారికి సమర్పణ ►సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కోటి కుంకుమార్చన ►సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయంలో గణపతి కల్యాణం, విశేష అభిషేకాలు ►క్లాక్ టవర్ వద్ద గల వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, నాంపల్లి లోని హజ్రత్ యుసిఫెన్ దర్గాలో చాదర్ సమర్పణ ►జలవిహార్‌లో 10.30 గంటలకు జన్మదిన వేడుకలు ప్రారంభం.. 10.30 గంటలకు త్రీ డీ డాక్యుమెంటరీ.. 11.00 గంటలకు కేక్ కటింగ్. -
ఆకుపచ్చని బర్త్‌డే: కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన
రాష్ట్రంలో బృహత్ కార్యానికి తెరలేవనుంది.. ఏటేటా పచ్చదనాన్ని సింగారించుకుంటున్న తెలంగాణకు ‘కోటి వృక్షార్చన’ జరగనుంది.. కొత్త ఆశలు ప్రతిఫలించేలా కోటి మొక్కలు వేళ్లూనుకోనున్నాయి.. సాక్షి, హైదరాబాద్: గంట వ్యవధిలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా కోటి మొక్కలు నాటనున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఈ మహత్తర కార్యక్రమం చేపట్టనున్నారు. హరితహారంలో భాగమైన ఈ మహత్కార్యం ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘కోటి వృక్షార్చన’పేరిట హరిత విప్లవంలో మరో అంకం తీసుకురానున్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సరిగ్గా గంట సమయంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కోటి మొక్కలు నాటి రాష్ట్రాన్ని ఆకుపచ్చని వనం చేయనున్నారు. ఉద్యమ స్ఫూర్తితో సాగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు ఇందులో భాగస్వాములు కానున్నారు. ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపుతో.. ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా బుధవారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటాలని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆకు పచ్చని తివాచీ పరిచేందుకు ఆయన నడుం బిగించారు. ఇందులో మరింత మందిని భాగస్వామ్యం చేసేందుకు కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్కు సంస్థాగతంగా ఉన్న దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలు ఇందులో పాలుపంచుకోనున్నారు. పెరిగిన గ్రీన్ కవర్ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో గ్రీన్‌కవర్ 24 శాతం ఉండేది. దీంతో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రాధాన్యమిచ్చిన సీఎం కేసీఆర్.. ‘హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు వివిధ వర్గాలను భాగస్వాములను చేస్తూ ఆరేళ్లలో 211 కోట్ల మొక్కలు నాటింది. దీంతో గతంతో పోలిస్తే రాష్ట్రంలో 3.67 శాతం గ్రీన్ కవర్ పెరిగినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మేమూ నాటుతాం..! ప్రముఖ నటులు చిరంజీవి, సంజయ్‌దత్, నాగార్జున, మహేశ్‌బాబుతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ‘కోటి వక్షార్చన’కు మద్దతు పలకడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ నలుమూలలా ఉన్న కేసీఆర్ అభిమానులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ‘వృక్షార్చన’ కోటి వృక్షార్చనలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, పారిశ్రామికవాడలు, విద్యా సంస్థలు తదితర ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు టీఆర్ఎస్ నేతలు, వివిధ వర్గాలకు చెందిన వారు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ ఎన్నారై సెల్‌కు చెందిన 50 దేశాల ప్రతినిధులతో మంగళవారం ఎంపీ సంతోష్‌కుమార్ సమావేశమయ్యారు. మొక్కలు నాటే వారు వాట్సాప్ ద్వారా 9000365000 నంబర్‌కు ఫొటోలు పంపితే.. వారికి ‘వనమాలి’బిరుదు ప్రదానం చేస్తామని తెలిపారు. కాగా, కోటి వృక్షార్చనలో భాగంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్‌లు తదితరులు బుధవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో మొక్కలు నాటనున్నారు. మెగా రక్తదాన శిబిరానికి కేటీఆర్ తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం తెలంగాణభవన్‌లో జరిగే మెగా రక్తదాన కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మెగా రక్తదాన శిబిరంలో పార్టీ శ్రేణులు పాల్గొనాల్సిందిగా టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అన్ని దేశాల్లో మొక్కలు నాటాల్సిందిగా టీఆర్ఎస్ ఎన్నారై విభాగం సమన్వయకర్త మహేశ్ బిగాల, ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి కోరారు. బల్కంపేట ఎల్లమ్మకు 2 కేజీల బంగారు చీర సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి 2 కిలోల బంగారంతో తయారు చేసిన పట్టుచీరను సమర్పించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో జలవిహార్‌లో జరిగే జన్మదిన వేడుకల్లో కేసీఆర్ జీవన ప్రస్థానంపై రూపొందించిన త్రీడీ డాక్యుమెంటరీతో పాటు ఐదు ప్రత్యేక గీతాలను కేటీఆర్ విడుదల చేస్తారు., తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ విజేతలకు ఎమ్మెల్సీ కవిత మంగళవారం రాత్రి బహమతులు అందజేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలు, హోమాలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. -
తెలంగాణకి హరిత తిలకం కోటి వృక్షార్చన
భరతమాత నుదిటిపై సస్య తిలకం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఆకు పచ్చని తెలంగాణ సంకల్పం.. హరిత హారం. ఈ హరితహార సాధన పథ క్రమంలో తలపెట్టిన మహా యజ్ఞం.. కోటి వృక్షార్చన. ఒకేరోజు ఒకే గంటలో.. కోటి మొక్కలు నాటి సీఎం కె. చంద్రశేఖర రావుకి ఘన వన కానుకనందించేందుకు యావత్ తెలంగాణ పచ్చని మొక్కలు చేబూనింది. పల్లెపట్నాన మొక్కల పండుగతో వన హారతి పట్టేందుకు సన్నద్ధమైంది. వన విస్తరణలో సరికొత్త రికార్డులు బద్ధలుకొట్టేందుకు కోటి వృక్షార్చన వేదిక కాబోతోంది. మొక్కలే మన శ్వాస. వృక్షాలే మన ఊపిరి. జలజీవాలకి మూలం అడవులే. మొక్కలు లేనిదే మనుగడ లేదు. పచ్చదనం లేనిదే పురోగమనం లేదు. కానీ నేడు ఆ పచ్చదనమే కరువై ప్రపంచం అల్లాడుతోంది. శ్రుతి మించిన శిలాజ ఇంధనాల వాడకం, విచక్షణ రహిత వనరుల వినియోగం కారణంగా ప్రకృతిలో సమతౌల్యం దెబ్బతిని... భూతాపం భూమండలాన్ని కబళించే దుస్థితి దాపురించింది. పర్యావరణ మార్పులకి అడ్డుకట్ట పడకపోతే... జీవ ఉనికి, మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన నేటి సాంకేతిక యుగంలో తలసరి మొక్కలు, అంతి మంగా హరిత సాంద్రత పెంచడమే లక్ష్యంగా భారతరత్న, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలకి ప్రతిరూపంగా ప్రాణం పోసుకున్న సామాజిక వన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్. మొక్కలు నాటడంలో సరికొత్త సంచలనం, వనాల విస్తరణలో వినూత్న మంత్రం ఈ హరిత సవాలు. ఇది ప్రప్రథమంగా మొదలైన తెలంగాణతోపాటు దేశమంతటా నేడు ఉద్యమంలా విస్తరించింది. ఎంపీ సంతోష్ చొరవ, సెలబ్రిటీల హంగులు వెరసి మూడు మొక్కలు ఆరు చెట్లతో ఘనంగా సాగుతోంది. సామాజిక ట్రెండ్‌గా మారిన గ్రీన్ ఛాలెంజ్.. మరో దశని అందుకోబోతోంది. ముఖ్యంగా తెలం గాణ గడ్డ మరోసారి హరిత రికార్డులకి సిద్ధమైంది. ఫిబ్రవరి 17 సీఎం పుట్టినరోజు సందర్భంగా... తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. 3 మొక్కలు నాటిన పౌరులు... ఆన్లైన్ యాప్, వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఇప్పటికే వాట్సప్ నంబర్ 9000365000, ఇగ్నైటింగ్ మైండ్స్ మొబైల్ యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు. ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటిన వ్యక్తులు, సంస్థలకి అవార్డులు ఇవ్వనున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి వివిధ రంగాలకి చెందిన సెలబ్రిటీలు నూతన శోభని తీసుకువచ్చారు. ఈ ఛాలెంజ్ నిరంతరం సజీవంగా ఉండేలా, వార్తల్లో నిలిచేలా వెలుగు తెచ్చారు. సచిన్, అమితాబచ్చన్, చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్ ఇలా ఎందరెందరో మొక్కలు నాటి అభిమానుల్లో స్ఫూర్తి నింపారు. ఫలితంగా నేడు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరణ వార్తలు, మొక్కలు నాటుతున్న ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి. ఎందరో బుల్లితెర, వెండితెర నటీనటులు, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఇప్పటికే మొక్కలు నాటిన వారంతా తాజాగా కోటి వృక్షార్చనలో పాల్గొనాలంటూ పిలుపునిస్తున్నారు. ప్రకృతి విపత్తుల నుంచి భారతావనిని కాపాడుకుందామంటూ యూట్యూబ్, ట్విట్టర్లలో వీడియో సందేశాలు పెడుతున్నారు. సీఎం పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలంటూ ఆహ్వానిస్తున్నారు. కోటి రత్నాల తెలంగాణ గడ్డకు.. వన తిలకం.. హరిత హారం. ఈ హరిత యజ్ఞానికి.. పచ్చని పావడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్. సీఎం స్వప్నమైన ఆకుపచ్చని తెలంగాణ సాధనలో.. హరిత సవాలు చిరునిచ్చెన. హరిత భారత స్వప్నంతో ప్రతిఒక్కరికీ చేరువైన గ్రీన్ ఛాలెంజ్.. కోటి వృక్షార్చన ద్వారా వనాల విస్తరణ, కాలుష్య నివారణకి దోహదపడనుంది. కోటి మొక్కలతో సీఎంకి మరపురాని బహుమతి ఇవ్వాలని తెలంగాణ సమాజం ఎదురుచూస్తోంది. ఇప్పటికే హరితహారం పుణ్యమాని రాష్ట్రంలో పచ్చదనం 4 శాతం వృద్ధి చెందింది. ఇక ఈ సామాజిక వన విప్లవం ఇదే స్థాయిలో దేశమంతటా కొనసాగితే... 28 చెట్లతో తలసరి మొక్కల లెక్కల్లో అట్టడుగున ఉన్న భారత్‌లో పచ్చదనం పరిఢవిల్లుతుంది. చెట్టు–పుట్ట, పశువులు–పక్షులు, నదులని పూజించే దేశంలో జన చైతన్యం వెల్లివిరిస్తే.. భారత్‌లో హరిత సాంద్రత పెంచడం అసాధ్యం కాదు. ఉత్తరాఖండ్ మంచు సరస్సు విధ్వంసం వంటి ఘటనలకి ఆస్కారం ఉండదు. నిర్జీవమవుతున్న అడవులు కొత్త చిగుళ్లు వేస్తాయి. వనాల వైశాల్యం పెరిగితే... తద్వారా వర్షాలు, భూగర్భ జలాలు మెరుగుపడి కరవుల ప్రభావం తగ్గుతుంది. అంతిమంగా దేశానికి ఆహార, జల భద్రత లభిస్తుంది. ఇందుకు కోటి వృక్షార్చన ద్వారా తెలంగాణ రాష్ట్రమే పునాది కావాలని ఆశిద్దాం. రాష్ట్రంలో హరిత వనాలు గగన సీమలని అందుకోవాలని కోరుకుందాం. (నేడు సీఎం కేసీఆర్ జన్మదినం) వ్యాసకర్త ఇగ్నైటింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు ఎం. కరుణాకర్‌రెడ్డి మొబైల్ : 98494 33311 -
నోటు కొట్టి... నాటుకోండి
సాక్షి, హైదరాబాద్: మీకు చెట్టు నాటేంత ఖాళీ స్థలం ఉందా.. అయితే ఏకంగా దశాబ్దాల వయసున్న చెట్టు అక్కడ ప్రత్యక్షం అయ్యేందుకు సిద్ధం. మొక్క తెచ్చి పెంచాలంటే ఎన్నో ఏళ్ల సమయం పడుతుంది. అదే ఏళ్ల వయసున్న చెట్టును నాటుకుంటే.. వింటుంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఒకటి, రెండు కాదు దాదాపు వంద చెట్లను ఇలా ట్రాన్స్‌లొకేషన్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వేరేచోటికి తరలించి బతికించాల్సిన చెట్లకు ‘ధర’కట్టాలనడమే విడ్డూరంగా ఉంది. ఆసక్తి ఉంటే తీసుకెళ్లండి.. కొత్త సచివాలయం నిర్మిస్తున్న ప్రాంగణంలో వందల సంఖ్యలో చెట్లు ఉన్నాయి. నిర్మాణానికి అడ్డుగా వేప, రావి, మర్రి, పొగడ, మరికొన్ని వృక్షాలు ఉన్నాయి. వాటిని కొట్టేయటం కంటే ట్రాన్స్ లొకేషన్ ద్వారా వేరే చోట నాటించి పెం చాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 40 చెట్లను తరలించారు. మరో వంద చెట్లను ఆసక్తి ఉన్నవారు ట్రాన్స్‌లొకేషన్ చేయడానికి తీసుకెళ్లవచ్చంటూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. మరో 250 వరకు కొట్టేసేందుకు మార్క్ చేసినట్టు తెలిసింది. సంరక్షించాల్సిన చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు అవకాశం కల్పిస్తున్నారు. ధర చెల్లించాల్సిందే.. ట్రాన్స్‌లొకేషన్‌కు నిర్ధారించిన చెట్లే కాకుండా ఇతర చెట్లను సంరక్షి స్తామని తీసుకెళ్లి అమ్మేసుకుంటారన్న అనుమానాలను కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని నివారించేందుకే వాటికి ధర నిర్ధారించామని చెబుతున్నారు. చెట్టు ఆకృతిని బట్టి ధరలున్నాయి. దీనివల్ల నిజంగా పెంచుకోవాలనుకునే వారే ట్రాన్స్‌లొకేషన్‌కు ముందుకొస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రకృతి ప్రేమి కులకు మాత్రం ట్రాన్స్‌లోకేషన్ చెట్లకు ధరను నిర్ణయించడం రుచించడం లేదు. పెంచుకుంటామని అండర్‌టేకింగ్ ఇస్తే ఉచితంగానే ఇస్తామంటున్నారు. ఓ సంస్థ ఆరోపణలతో వివాదం తొలుత ఓ సంస్థ చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు ముందుకొచ్చింది. 18 చెట్లను తీసుకెళ్లి శంషాబాద్ పరిసరాల్లో నాటింది. కొట్టేసేందుకు ఖరారు చేసిన చెట్లను కూడా ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు ఆసక్తి చూపింది. ఇక్కడే వివాదం మొదలైంది. ఒక్కో చెట్టుకు రూ.8 వేల చొప్పున చెల్లించాలని అధికారులు అడిగారని, చెట్లను సంరక్షించేందుకు ముందుకొస్తే ధర అడగటమేమిటని ప్రశ్నిస్తే... అధికారులు దురుసుగా ప్రవర్తించారని, దీంతో ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియ నుంచి తప్పుకున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. దీంతో ఈ ప్రక్రియపై విమర్శలు వచ్చాయి. ఆ సంస్థను కాదని అధికారులు ఇతరులను ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చారు. ఆ మేరకు మరో రెండు సంస్థలు 40 చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేశాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే తాము రూ.8 వేల చొప్పున కోరలేదని, చెట్లను తీసుకెళ్లి పెంచకపోతే తాము విమర్శల పాలు కావాల్సి వస్తుందని, అందుకే కొంత రుసుము ఖరారు చేశామని చెప్పారు. -
చెట్లు నరకాలంటే అనుమతి తప్పనిసరి: అవంతి
సాక్షి, విశాఖపట్న: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీ) ఆధ్వర్యంలో మదురవాడ న్యాయ కళాశాల పనొరమ హిల్స్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, మంత్రి అవంతిశ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం జిల్లాలో సుమారు 25 కోట్ల మొక్కలు నాటాలని ఆదేశించారని తెలిపారు. వాహనాలు, జనాభా పెరుగుదలతో గ్రీన్ బెల్ట్ తగ్గుతోందని, మొక్కలు నాటి గ్రీన్ బెల్ట్‌ను 2021 నాటికి పెంచుతామని తెలిపారు. విశాఖ రాజధాని ప్రాంతం ఏర్పాటు అవడంతో పట్టణాభివృద్ధికి ఈ మొక్కలు నాటడం ఎంతో అవసరమని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి చెట్లు నరకాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో సుమారు 1000 పార్కులో మొక్కలు నాటాలని, ఫెన్సింగ్ వేయాలని పేర్కొన్నారు. రోడ్డుకు ఇరు వైపుల మొక్కలు నాటితే బడ్డీల పేరుతో ఆక్రమణలు జరగవని తెలిపారు. -
రాజమౌళి చాలెంజ్ స్వీకరించారు
ఇటీవలే రామ్‌చరణ్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మొక్కలు నాటి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందాన్ని కూడా మొక్కలు నాటమంటూ ఈ చాలెంజ్‌కు ఎంపిక చేశారు. చరణ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం మొక్కలను నాటారు. దర్శకులు రాజమౌళి, కెమెరామేన్ సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, దర్శకత్వ శాఖ ఇలా అందరూ మొక్కలు నాటుతున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లమంటూ ‘ఆచార్య, రాధేశ్యామ్, పుష్ప’ చిత్రబృందాలను ఎంపిక చేసింది ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్. దర్శకులు రామ్‌గోపాల్ వర్మ, వీవీ వినాయక్, పూరి జగన్నాథ్‌లను గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు ఎంపిక చేశారు రాజమౌళి. మీకో దండం రాజమౌళి విసిరిన ఈ చాలెంజ్‌కు ట్విట్టర్లో సరదాగా కామెంట్ చేశారు రామ్‌గోపాల్ వర్మ. ‘రాజమౌళిగారూ.. నేను చాలెంజ్‌లు, పచ్చదనం వంటి విషయాల మీద పెద్దగా ఆసక్తి లేనివాణ్ణి. అలాగే చేతికి మట్టి అంటుకుంటే మహా చిరాకు నాకు. నాలాంటి స్వార్థపరుడు మొక్కలు నాటడం కంటే వేరెవరైనా ఆ పని చేయడం మంచిదని నా అభిప్రాయం. మీకూ మీ మొక్కలకూ ఓ దండం’ అని ట్వీట్ చేశారు వర్మ. -
అన్ని జీవజాతుల్ని సమానంగా చూడాలి
మెడపై రూపాయి కాయిన్ ట్యాటూ, చేతికి కట్టుకున్న తాడులో ఓమ్ లాకెట్, ఇయర్ రింగ్.. ఇలా ‘సర్కారువారి పాట’లో మహేశ్‌బాబు చాలా స్టయిలిష్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఆదివారం ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన సినిమా మోషన్ పోస్టర్ టీజర్ అంచనాలు పెంచే విధంగా ఉంది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్, 14రీల్స్ ఎంటర్టైన్మెంట్, జి. మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్ ప్రై లిమిటెడ్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది. తన పుట్టినరోజుని పురస్కరించుకుని గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో మహేశ్‌బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకు ఎంత ఉందో మొక్కలకీ, జంతువులకీ అంతే ఉంది. అన్ని జీవజాతుల్ని సమానంగా చూడటమే నాగరికత. అభివృద్ధి అంటే మనుషులతో పాటు వృక్షాల ఎదుగుదల కూడా. అందుకే జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా కార్యక్రమంలో అందరూ భాగమవ్వాలి’’ అన్నారు. అలాVó యన్టీఆర్, విజయ్, శ్రుతీహాసన్‌లకు గ్రీన్ఇండియా చాలెంజ్‌ను విసిరారు మహేశ్‌బాబు. -
మన సరిహద్దులు ఆర్మీ చేతుల్లో భద్రం
న్యూఢిల్లీ/గుర్గావ్: దేశానికి చెందిన భూభాగం యావత్తూ మన భద్రతా బలగాల పూర్తి రక్షణలోనే ఉందని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఎస్.ఎస్.దేశ్వాల్ స్పష్టం చేశారు. ఆదివారం గుర్గావ్లో బీఎస్ఎఫ్ ఆధ్వ ర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా జనరల్ దేశ్వాల్ మాట్లాడు తూ..‘మన దేశ భూభాగమంతా మన చేతుల్లోనే ఉంది. పూర్తిగా మన భద్రతా బలగాల అధీనంలోనే ఉంది. మన సరి హద్దులన్నీ సురక్షితంగా ఉన్నాయి. మన బలగాలు చురుగ్గా, సమర్ధంగా, అం కితభావంతో పనిచేస్తున్నాయి. సరిహ ద్దుల్లో ఎలాంటి శత్రువునైనా ఎదు ర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి’అని తెలిపారు. కాగా, ఫింగర్ –4 వద్ద మోహ రించిన బలగాల్లో మరికొన్నిటినీ, పాంగాం గ్ సో సరస్సులో ఉన్న కొన్ని గస్తీ పడవలను చైనా ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ పూర్తిగా చేపట్టేందుకు అవసరమైన మార్గదర్శకాలకు తుదిరూపం ఇచ్చేందుకు భారత, చైనా బలగాల మధ్య మరో విడత చర్చలు జరగనున్న నేప థ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
బొండాంతో భలే ఐడియా!
కొబ్బరిబొండాం.. ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ తాగి పడేసే బొండాంలో నీరు చేరి దోమలు పెరుగుతున్నాయి. మొక్కల పెంపకం.. పర్యావరణానికి ఎంతో మేలు. కానీ వాటిని పెంచడానికి ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ సంచులతో అన్నీ సమస్యలే. ఈ రెండు సమస్యలకూ ఒకే ఒక్క చిన్న ఐడియాతో చెక్ పెట్టేశారు. తాగి పడేసిన కొబ్బరిబొండాల్లో మొక్కల పెంపకం ద్వారా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇదంతాఎక్కడో కాదు..మన తెలంగాణలోనే! దుగ్గొండి: సాధారణంగా ప్లాస్టిక్ సంచుల్లో మట్టి నింపి, అందులో విత్తనాలు వేసి మొక్కలు పెంచుతారు. ఇందుకోసం 250 నుంచి 300 గేజ్ ఉన్న ప్లాస్టిక్ సంచులను ఉపయోగిస్తారు. మొక్క పెరిగిన తర్వాత దానిని భూమిలో నాటినప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ తీసి పారేస్తారు. అది భూమిలో కలసిపోదు. ఒకవేళ దానిని కాల్చివేస్తే, అప్పుడు వచ్చే పొగ వల్ల కేన్సర్‌తోపాటు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధానికి భారీగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాగి పడేసే కొబ్బరిబొండాలతోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. బొండాం తాగిన తర్వాత దానిని అలాగే పడేస్తుండటంతో వాటిలోకి నీరు చేరి దోమలు పెరుగుతున్నాయి. ఫలితంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాస్తవానికి ముదిరిన కొబ్బరిబొండాల తొక్కల నుంచి కోకోఫిట్, తాళ్లు తయారు చేస్తారు. అయితే, లేత కొబ్బరిబొండాలు అందుకు పనికిరావు. దీంతో వాటిని అలాగే పడేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిష్కారమేంటి? తాగి పడేసే కొబ్బరిబొండాల్లో మట్టి నింపి అందులో మొక్కలు పెంచడం ద్వారా అటు ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట వేయడంతోపాటు ఇటు కొబ్బరిబొండాల ద్వారా తలెత్తుతున్న సమస్యల నుంచీ తప్పించుకోవచ్చు. పైగా మొక్కను బొండాంతో సహా భూమిలో నాటుకోవచ్చు. తద్వారా బొండాం భూమిలో కలిసిపోతుంది. ఎవరిదీ ఆలోచన? వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండల ఎంపీడీఓ గుంటి పల్లవికి ఈ వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఓ వైపు ప్లాస్టిక్ భూతం.. మరోవైపు వాడి పడేసే బొండాలతో ఎదురవుతున్న సమస్యలు చూసిన ఆమె మొక్కల పెంపకానికి బొండాలను వినియోగించాలనే తలంపు వచ్చింది. దీనిని రాష్ట్రంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావించారు. కేరళలో కొబ్బరిబొండాల్లో మొక్కల పెంపకంపై అధ్యయనం చేసిన తర్వాత శుక్రవారం మండలంలోని నాచినపల్లి గ్రామ నర్సరీలో ఇందుకు శ్రీకారం చుట్టారు. వెయ్యి కొబ్బరి బొండాల్లో మట్టి నింపి చింత గింజలను నాటారు. తొగర్రాయి, గిర్నిబావి, శివాజినగర్, తిమ్మంపేట, దుగ్గొండి గ్రామ నర్సరీల్లో ఇలా దాదాపు 5వేల కొబ్బరిబొండాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందుకు వరంగల్, హన్మకొండ పట్టణాల్లో వాడిపడేసిన బొండాలను సేకరించారు. ఎంతో పర్యవరణ హితం వాడిపడేసిన కొబ్బరి బొండాల్లో మొక్కలు పెంచడం పర్యావరణ హితంగా ఉంటాయి. కేరళలో బొండాల్లో మొక్కలు పెంచుతున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆ పద్ధతిలో మొక్కలు నాటి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలనుకుంటున్నాం. కొబ్బరి బొండాల్లో పెరిగిన మొక్కను బొండాంతో సహా అలాగే భూమిలో పాతిపెట్టొచ్చు. ఆ బొండాం రెండు, మూడు నెలల్లోనే భూమిలో కరిగిపోతుంది. పైగా మొక్కకు ఎరువుగానూ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ విధానం ప్లాస్టిక్ నివారణకు కొంత మేరకు దోహదపడుతుంది. – గుంటి పల్లవి, ఎంపీడీవో ఎంపీడీఓ గుంటి పల్లవి -
‘మొక్క’ తొడిగిన ‘పచ్చని’ ఆశయం
పచ్చదనం పెంపుదలే ధ్యేయంగా వనమహోత్సవ యజ్ఞంలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు వద్ద జరిగిన 70వ వనమహోత్సవ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ యజ్ఞంలో పాల్గొని వేప మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన జీవ వైవిధ్యం, వన్యప్రాణి సంరక్షణ ప్రదర్శనశాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 25 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా అన్ని శాఖల సహకారంతో కృషిచేయనున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు మూడు మొక్కలు నాటితే భవిష్యత్తు తరాలు భద్రమైన జీవితాన్ని గడపగలుగుతాయని అన్నారు. ఈ మేరకు సభాప్రాంగణంలో ఉన్న వారందరితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. సాక్షి, తాడికొండ(గుంటూరు) : జాతీయ అటవీ చట్టం ప్రకారం రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం మొక్కలు పెంచడమే లక్ష్యంగా పచ్చదనం పెంపొందించడానికి అన్ని శాఖల సహకారంతో ఈ ఏడాది రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. 70వ వన మహోత్సవంలో భాగంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో శనివారం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ భూమి మీద పచ్చదనం లేకపోతే భవిష్యత్తులో అంతా ఎడారిగా మారిపోతుందని, పంచభూతాలను మనం పరిరక్షించుకోవాలని అన్నారు. ఏలిన వారు మంచివారైతే...: మంత్రి బాలినేని రాష్ట్రాన్ని పచ్చదనం చేసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో వరుణుడు కూడా కరుణించాడని, గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో వర్షాలు లేవని, పెద్దలు అన్న రీతిలో ఏలిన వారు మంచివారైతే వర్షాలు పడతాయని జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి సాగర్, శ్రీశైలం ఇతర ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయని రాష్ట్ర ఇంధన వనరులు, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక రంగ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హరితాంధ్రప్రదేశ్ చేయాలని కలలు కన్నారని, నేడు జగన్ మోహన్‌రెడ్డి హయాంలో ఆ కల నెరవేరనుందన్నారు. అటవీ శాఖకు సంబంధించి ఎర్ర చందనం నిల్వలు కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే ఉన్నాయని, అక్కడ స్మగ్లింగ్ చేసి దోచుకున్న పరిస్థితులు గతంలో ఉన్నందున ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహనరెడ్డి వచ్చిన తరువాత ఎర్ర చందనం కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారన్నారన్నారు. ఎర్రచందనం అమ్మేందుకు అనుమతివ్వాలని కేంద్ర మంత్రిని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కంఫా నిధులు రూ.1734 కోట్లు అందుబాటులోకి వచ్చాయని వాటిని సద్వినియోగం చేసి రాష్ట్రంలో విస్తారంగా పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తానన్నారు. శ్రామికుల కష్టాలు, కన్నీళ్లు, తుడిచే నాయకుడు జగనన్న శ్రామికుల కష్టాలు, కన్నీళ్లు తుడిచే నాయకుడు వైఎస్ జగనన్న అని, వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని నిరూపిస్తూ అభివృద్ధిని పరుగులెత్తిస్తున్న ముఖ్యమంత్రికి పాదాభివందనమని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రాజధానిలో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు తాడికొండ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. అధికారులకు ఆయుధాలు, పురస్కారాల పంపిణీ అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు ఆయుధాలు పంపిణీ చేశారు. చిత్తూరు ఈస్ట్ డివిజన్ ఎఫ్ఎస్వో చినబాబు, ఆర్.సలాఉద్దీన్, ఎఫ్‌డీవో లక్ష్మీ ప్రసాద్, పి.కామేశ్వరరావు, ఎస్.రవిశంకర్ తదితరులకు ఆయుధాలను పంపిణీ చేశారు. విధుల్లో నైపుణ్యాలు ప్రదర్శించిన 80 మంది అటవీ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు, ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకరరావు, విడదల రజని, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కిలారి వెంకట రోశయ్య, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు. సామినేని ఉదయభాను వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, గుంటూరు–2 సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీ, పార్టీ నాయకులు నూతలపాటి హనుమయ్య, కావటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సీఎంకు బోన్సాయ్ మొక్కను బహూకరిస్తున్న మంత్రి బాలినేని సభ కొనసాగిందిలా... • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికి మొక్కలనే పుష్పగుచ్ఛంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఐఏఎస్ అందజేశారు. • సీఎం ప్రసంగం ప్రారంభించే సమయంలో మహిళలు, విద్యార్థులు సీఎం, సీఎం అంటూ ఉత్సాహభరితంగా చేతులు పైకెత్తి కేరింతలు కొట్టడంతో ఆయన ఉత్సాహంగా నవ్వుతూ ప్రసంగం ప్రారంభించారు. • ప్రసంగం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సభా ప్రాంగణంలో ఉన్నవారందరితో ప్రతిజ్ఞ చేయించారు. • అటవీ శాఖ తరఫున ముఖ్యమంత్రికి మంత్రి బాలినేని చేతుల మీదుగా పలువురు అధికారులు బోన్సాయ్ ప్లాంట్‌ను బహుమతిగా అందజేశారు. • కార్యక్రమం చివరిలో జనగణమన జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. -
వన మహోత్సవంలో సీఎం జగన్
-
అందరూ తోడుగా నిలవాలి : సీఎం జగన్
సాక్షి, గుంటూరు : పర్యావరణ రక్షణ కోసం ప్రభుత్వంతో పాటు అదరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. నీరు, నేల, నింగి, గాలి వీటంన్నిటిని కూడా కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిది అని పిలుపునిచ్చారు. విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని కోరారు. అడవుల సంఖ్య ఏటేటా తగ్గిపోతుందని, వీటిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం జగన్ శనివారం గుంటూరు జిల్లా డోకిపర్రు గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాలుపంచుకొని ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. సీఎం జగన్ ఇంకా ఎమన్నారంటే.. (చదవండి : వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్) అందుకే అశోకుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు ‘మనం నాటే ప్రతి మొక్కభూమాతకు మేలు చేస్తుంది. మనం పెంచే ప్రతి చెట్టు తరువాతి తరానికి కూడా వీటి ఫలాలను ఇస్తుంది. మాములుగా మనిషి బతకాలంటే ఆక్సిజన్ కావాలి. అటువంటి ఆక్సిజన్ ఇచ్చే ఏకైక ప్రాణి ఒక్క చెట్టు మాత్రమే. ఈ సృష్టిలో బ్యాలెన్స్‌గా ఉండాలంటే చెట్లు బలంగా ఎదగాలి. రాష్ట్ర భూభాగంలో 37,258 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో 23 శాతం మాత్రమే అడువులు ఉన్నాయి. ఇందులో 13 శాంక్షరీలు, మూడు నేషనల్ పార్కులు, రెండు జులాజికల్ పార్కులు, ఒక టైగర్ రిజర్వ్, ఒక ఎనుగు రిజర్వ్ అడవులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ మన రాష్ట్రంలో ఉన్నాయి కదా అని గొప్పగా ఫీల్ కావాలా? లేక మొత్తం భూభాగంలో మూడింతల్లో ఒక భాగం అడవులు ఉండాలని జాతీయ అడవుల విధానం చెబుతున్నప్పుడు 33 శాతం ఉండాల్సిన అడవుల్లో మన రాష్ట్రంలో కేవలం 23 శాతం మాత్రమే ఉన్నాయని భాధపడాలో ఆలోచించుకోవాలి.అశోకుడి గురించి మనం వింటుంటాం. ఆయన గొప్ప చక్రవర్తి అని విన్నాం. రోడ్డుకు ఇరువైపు చెట్లను నాటించాడు కాబట్టే అశోకుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఆయన నాటించిన చెట్లు వందల సంవత్సరాలు బతికాయి, తరువాత తరాలకు మేలు చేశాయి. 25 కోట్ల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం పర్యావరణం బాగుంటేనే మనమంతా కూడా బాగుంటాం. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రంలో 2351 వృక్షజాతులు, 1461 జంతు జాతులు ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని జంతువులు, మొక్కలు అంతరించి పోతున్నాయి. మనం డైనోసార్స్ గురించి వింటుంటాం. ఇవి ఇప్పుడు కనిపించడం లేదు. ప్రపంచంలో ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే..పులులు అంతరించిపోతున్నాయి. పులుల సంఖ్య రాష్ట్రంలో కేవలం 48 మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఆరు పెరిగాయని సంబరాలు చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. వీటిని గురించి మనం పట్టించుకోవడం మానేస్తే పులులు, సింహాలు ఏవి కూడా ఉండవు. మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తూ..రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటిదాకా నాలుగు కోట్ల మొక్కలు నాటాం. ఈ ఒక్క రోజు కోటి మొక్కలు నాటబోతున్నాం. ప్రతి ఒక్కరు ఒక్క మొక్క నాటడం కాదు. ప్రతి ఒక్కరు మూడు, నాలుగు మొక్కలు నాటాలి. అప్పుడే మన రాష్ట్రాన్ని కాపాడుకోగలుతామని గుర్తు ఎరగాలి. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. గ్రామ వాలంటీర్ల చేత మొక్కల పెంపకం నాటే కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నాను. నీడనిచ్చే మొక్కలు, టేకు మొక్కలు, ఎర్రచందనం మొక్కలు 12 కోట్లు మొక్కలు నాటేందుకు అటవీ శాఖ సిద్దంగా ఉంది. దశల వారిగా 10వేల ఎలక్ట్రిక్ బస్సులు తెస్తాం ఇవాళ ఫార్మా పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాం. పరిశ్రమలు వచ్చేసమయంలో పర్యావరణానికి మేలు చేస్తుందా? అన్నది ఆలోచన చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ప్రక్షళన చేయబోతున్నామని చెబుతున్నాను. ఫార్మా రంగంలో లక్ష టన్నుల కాలుష్యం వస్తుందని నా దృష్టికి వచ్చింది. కేవలం 30 వేల టన్నులు మాత్రమే ఆడిట్ జరుగుతుందని, మిగతాది కాల్చివేయడం, లేదా సముద్రంలో వేయడం జరుగుతుంది. పరిశ్రమల్లో ఎంత కాలుష్యం వస్తుంది. ఏ రకంగా మనం డిస్పోజ్ చేయాలో ఆలోచన చేయాలి. ప్రభుత్వమే బాధ్యత తీసుకోబోతోంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం. ఈ ఏడాది అక్షరాల ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 100 ఎలక్ట్రసిటీ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. దశల వారిగా 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తాం. నీరు, నేల, నింగి, గాలి వీటంన్నిటిని కూడా కాలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వీటిని కాపాడుకుందాం’ అని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. -
వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్
-
వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అడవుల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 70వ వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో విద్యార్థులతో కలిసి సీఎం జగన్ మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వన మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. శని వారం నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. -
‘మెదక్‌ను హరితవనం చేయాలి’
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మూడు కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట మండలం కమలాపూర్, జంబికుంట గ్రామాల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీఆర్డీఏ ఏపీడీ సీతారామారావులతో కలిసి వర్షంలోనే మొక్కలు నాటారు. మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా జంబికుంట ప్రధాన రహదారి నుంచి గ్రామం వరకు ఇరువైపులా జూనియర్ కళాశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జంబికుంట, పేటలోని స్త్రీశక్తి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహించిన హరితహారంలో మొక్కలను నాటి పట్టించుకోలేదన్నారు. ఈ సారి నూతన పంచాయితీరాజ్ చట్టం ప్రకారం ప్రతీ మొక్కకు పక్కా లెక్కతో పాటు ప్రతీ గ్రామంలో 47 వేల మొక్కలను నాటడంతో సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. 85 శాతం మొక్కలను కాపాడకపోతే సర్పంచ్, గ్రామ కార్యదర్శిపై వేటు తప్పదన్నారు. గ్రామ సభలు క్రమం తప్పకుండానిర్వహించుకొని ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. కర్ణాటక, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి 15 నుంచి 20 రకాల పండ్ల మొక్కలను తెప్పించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతీ యేటా 100 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళిక చేపట్టినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా అధికారులు జిల్లాలో మొక్కలను పెంచాలన్నారు. దీంతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా మారేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఇంకుడుగుంతలు చేపట్టడంతో పాటు నీటిని వృథా చేయకూడదని కోరారు. ఎస్బీఎం ద్వారా నిర్మించిన టాయిలెట్స్‌ను వినియోగించుకొని అంటురోగాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలి.. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. ప్రతీ గ్రామం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. చెట్లు నాటడమే కాకుండా సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. ఇథియోఫియా దేశాన్ని ఆదర్శంగా తీసుకొని హరితహారం విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యులు విజయరామరాజు, ఎంపీడీఓ బన్సీలాల్, తహసీల్దార్ కిష్టానాయక్, సర్పంచ్‌లు కుంట్ల రాములు, మామిడి సాయమ్మ, ఎంపీటీసీ స్వప్నరాజేశ్, రైతు సమితి అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, ఏపీఓ సుధాకర్, ఏపీఎం గోపాల్, పీఆర్ ఏఈ రత్నం, ఏఓ రత్న, నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అల్లాదుర్గంలో మొక్కలు నాటిన కలెక్టర్ అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం రేణుకా ఎల్లమ్మ ఆలయం ఆవరణలో శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ధర్మారెడ్డి మొక్కలు నాటారు. అంతకుముందు రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షం పడుతున్నా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడి టీచర్లు, డ్వాక్రా గ్రూపు మహిళలు, ఈజీఎస్ సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ సీతరామారావ్, అడిషనల్ పీడీ, ఐసీడీఎస్ పీడీ రసూల్‌బీ, మండల ప్రత్యేక అధికారి సుధాకర్ ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సౌందర్య, సర్పంచ్ అంజయ్య యాదవ్, సీడీపీఓ సోమశేఖరమ్మ, ఎంపీడీఓ రాజమల్లయ్య, మాజీ ఎంపీపీ కాశీనాథ్, ఏపీఎం అశోక్, సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్ఐ మహ్మద్‌గౌస్ తదితరులు పాల్గొన్నారు. చెత్త రహిత జిల్లాగా మార్చేద్దాం మెదక్ జోన్: మెదక్ జిల్లాను సంపూర్ణ ఆరోగ్యం, చెత్త రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా విద్యార్థులను చైతన్యం చేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరెట్లో ప్రధానోపాధ్యాయులతో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి నర్సరీని ఏర్పాటు చేసి అందులో పలు రకాల పండ్లు, పూల మొక్కలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. పాఠశాలల్లో అన్ని రకాల మొక్కలు నాటాలన్నారు. ఉపాధి హామీ కూలీలతో పాఠశాల ప్రాంగణంలో వందకుపైగా గుంతలు తీయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 7న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో హరితహారం కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో 50 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి హైదరాబాద్‌కు రిసైక్లింగ్ కోసం పంపించినట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే చెత్త రహిత గ్రామాలుగా రూపు దిద్దుకుంటాయన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలని ఎంపీడీఓలకు ఆదేశాలు జారిచేసినట్లు తెలిపారు. అనంతరం ఐలవ్ మై జాబ్ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో జిల్లా స్థాయిలో నిలిచిన విజేతలను కలెక్టర్ సన్మానించారు. వహిదుల్లా షరీఫ్(బాలుర ఉన్నత పాఠశాల, మెదక్), సుకన్య(జెడ్పీహెచ్ఎస్, పాపన్నపేట), సమీర్(జెడ్పీహెచ్ఎస్ కుసంగి), సాజిద్ పాషా(ప్రాథమిక పాఠశాల బొడ్మట్‌పల్లి)లను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రవికాంత్‌రావు, నోడల్ అధికా>రి మధుమోహన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సెక్టోరియల్ అధికారులు నాగేశ్వర్, సుభాష్, ఏడీ భాస్కర్‌తోపాటు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
చిత్తశుద్ధితో చెట్లు పెంచాలి
‘‘రాష్ట్రంలో అడవులను సంరక్షించుకోవాలి. దీనికి సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి’’ అని సీఎం చంద్రశేఖర్‌రావు అన్నారు. సీఎం ప్రకటన అమలు కావాలని కోరుకుందాం. తెలంగాణ రాష్ట్రం అడవులకు ప్రసిద్ధి. వందల ఏళ్ల వయసు కలిగిన అడవులలో అనేక రకాల చెట్లు ఉన్నాయి. అయితే, యథేచ్ఛగా సాగిన స్మగ్లింగ్ కారణంగా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, చెన్నైలకు వేల టన్నుల కలప తరలి పోయింది. అటవీశాఖ అధికారులు కొన్ని కేసులు పెట్టినా, ఏ ఒక్క స్మగ్లర్‌కూ శిక్ష పడలేదు. నేడు అడవులలో 20 శాతం మాత్రమే చెట్లు ఉన్నాయి. అవి కూడా 20, 30 సంవత్సరాల వయసు కలిగినవి మాత్రమే. పరిశోధనలకు ఉపయోగపడటానికి వందల వయసు కలిగిన చెట్లు కానరావు. రాష్ట్రంలో 70.18 లక్షల ఎకరాల అడవులు ఉన్నాయి. ఇందులో 50,45,760 ఎకరాలలో రిజర్వు ఫారెస్టు, 17,92,320 ఎకరాల్లో రక్షిత భూమి , 1.80 లక్షల ఎకరాలు నిర్ధారించని భూమి. ఈ రిజర్వు ఫారెస్టులో కొంతమేర అడవులున్నప్పటికీ మిగిలిన 20 లక్షల ఎకరాలలో ఎలాంటి అడవులు లేవు. రిజర్వు ఫారెస్టులో 20 శాతం కూడా అడవులు లేవని శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించారు. అడవులు లేకపోవడంతో జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయి. లక్షల ఎకరాలలో పంటలను నాశనం చేస్తున్నాయి. నేడు కోతుల బెడద లేని గ్రామం లేదు. చిరుతలు, ఎలుగుబంట్లు కూడా గ్రామాలకు వస్తున్నాయి. వనమహోత్సవాలలో మైదాన భూములలో చెట్లు నాటడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారే తప్ప, అడవులలో చెట్లు పెంచడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. 2016 జూలై నుండి రాష్ట్రంలో రానున్న మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 శాతం నిధులతోపాటు ఉపాధిహామీ పథకం 100 శాతం, 50 లక్షల ఎకరాలలో గ్రీన్ ఇండియా వారు 75 శాతం, గ్రామీణాభివృద్ధి శాఖ నిధులు సమకూర్చాలి. సామాజిక అడవులపై చూపిన శ్రద్ధలో సగం సాంప్రదాయ అడవుల పెంపకంలో చూపలేకపోయారు. చివరకు పాలకులు అడవులను నేటికీ రక్షిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి, వారి పంటలను నాశనం చేసి, వారి నుండి అక్రమంగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. గిరిజనులను అడవుల నుండి మైదానాలకు పంపించే ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అడవులలో గిరిజనులను లేకుండా చేస్తే 2, 3 సంవత్సరాలలోనే అడవులు అదృశ్యం కావడం ఖాయం. రాష్ట్రంలో 14 లక్షల ఎకరాల భూమిలో వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్ అడవిలో 2.20 లక్షల ఎకరాలు, ప్రాణ హితలో 34 వేల ఎకరాలు, శివ్వారం అభయారణ్యం పేరుతో 7,500 ఎకరాలు సేకరిస్తున్నారు. ఇదికాక ఏటూరునాగారంలో 2 లక్షలు, పాకాల అడవులలో 2.12 లక్షలు, ఖమ్మం జిల్లాలో కిన్నెరసాని అడవులలో 1.57 లక్షలు, మంజీరకి 49 వేలు, మెదక్ జిల్లా, పోచారంలో 34 వేలు, మహబూబ్‌నగర్‌లో రాజీవ్ గాంధీ వన్యప్రాణ రక్షణ పేరుతో 5.35 లక్షల ఎకరాల చొప్పున సేకరించబోతున్నారు. అటవీ ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి 500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. కానీ, అవినీతి అధికారువల్ల ఈ ఆదాయానికి గండిపడుతున్నది. గతంలో బీడీ ఆకుల వ్యాపారంతో 30 కోట్ల ఆదాయం వచ్చింది. అడవుల పెంపకానికి విదేశీ ఆర్థిక సహాయంతో పాటు ప్రపంచ బ్యాంకు నిధులు కూడా వస్తున్నాయి. ఔషద మొక్కల పెంపకానికి నిధులు ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ మేనేజ్మెంట్ కింద వనసంరక్షణ సమితులు నిర్వహించి, అడవుల పెంపుదలకు ప్రణాళికలు అమలు చేశారు. ఫలితాలు మాత్రం ఆశించినంత రాలేదు. నేడు గృహ నిర్మాణాల సమస్య తీవ్రంగా ముందుకొచ్చింది. పట్టణాల్లో గృహనిర్మాణాలు బాగా జరుగుతున్నాయి. వీటికి కలప వాడకం కూడా పెరుగుతున్నది. చివరికి గ్రామాల్లో తుమ్మ, వేప చెట్లను కూడా గృహ నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. కలపకు ప్రత్యామ్నాయంగా మరో వస్తువు వినియోగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం సుబాబులు, జామాయిల్ తోటలు అడవుల్లో వేస్తున్నారు. 3,4 సంవత్సరాలు కాగానే వాటిని నరికివేస్తున్నారు. అడవులు స్థిరంగా పెరగాలి తప్ప, నరికేస్తే తిరిగి పెరుగుదలకు చాలా కాలం పడుతుంది. నేడు కార్పొరేట్ సంస్థలు అడవులలో ఖనిజ సంపదపై కన్నేశాయి. జిందాల్ లాంటి సంస్థలు ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాలను రద్దుచేసి ఖనిజ సంపదను భవిష్యత్తు తరాల కోసం కాపాడుకోవాలి. ముడి ఖనిజం ఎగుమతిని నిషేధించాలి. అటవీశాఖ అధికారులందరికీ అకౌంటబిలిటీ పెట్టి అడవుల పెంపకం బాధ్యతను అప్పగించాలి. అడవి జంతువుల వల్ల మైదానంలో పంటలు దెబ్బతిన్నచో అటవీశాఖ పరిహారం చెల్లించే బాధ్యతను తీసుకునే విధంగా ఉండాలి. అప్పుడే అడవులు వృద్ధి చెందుతాయి. సారంపల్లి మల్లారెడ్డి వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94900 98666 -
మొక్కలే అతడి ప్రాణం..
నెక్కొండ: మండలంలోని పెద్దకొర్పోలు గ్రామానికి చెందిన ఓ వన ప్రేమికుడు అనువుగాని చోట పెరుగుతున్న చెట్లను సంరక్షిస్తున్నాడు. వివరాలలోకి వెళ్తే... గ్రామానికి చెందిన పరుపాటి ఇంద్రసేనారెడ్డికి చెట్లంటే ప్రాణం. ఈ మేరకు అనువుగాని చోటైన తాటి చెట్ల కొమ్మల్లో పెరుగుతున్న చెట్లకు ప్రాణం పోస్తున్నాడీ వనప్రేమికుడు. పాము చంద్రయ్య, అమ్మ వెంకన్నల సహాయంతో 20 చెట్లను వేర్లతో తీసి అనువైన ప్రదేశాలలో నాటేందుకు సిద్ధపడ్డాడు. అందులో భాగంగానే గ్రామంలోని ప్రధాన వీధుల వెంట, కస్తూర్భాగాంధీ గురుకులం, ప్రభుత్వం పాఠశాల ఆవరణ, పంచాయతీ కార్యాలయాలలో నాటించారు. ఆయన కృషిని గుర్తించిన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఢిల్లీ చుట్టూ ట్రీవాల్
న్యూఢిల్లీ: వాయు కాలుష్యం, గాలి దుమారాల కట్టడికి ఢిల్లీ హరిత బాట పట్టింది. నగరం చుట్టూ రెండేళ్లలో 31 లక్షల మొక్కలు నాటేందుకు శనివారం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ అధికారి తెలిపారు. ఢిల్లీకి పొరుగు రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ సరిహద్దుల వెంట ఆరావళి, యమునా అటవీ ప్రాంతాల చుట్టూ మొక్కలతో హరిత వలయాన్ని ఏర్పాటుచేయనున్నారు. కాలుష్యానికి కారణమవుతున్న ధూళి రేణువులను మొక్కలతో అడ్డుకుని, ఏటా రాజస్తాన్ నుంచి వస్తున్న గాలి దుమారాల నుంచి ఢిల్లీని కాపాడటమే లక్ష్యంగా ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం తగిన పరిశోధనలు చేసి, పొడవైన, దట్టమైన ఆకులతో కూడిన మొక్కలను ఎంచుకున్నారు. ధూళి రేణువులు గాల్లోకి లేవకుండా నిరోధించే వేప, మర్రి, ఉసిరి, రావి, జామ తదితర మొక్కలను నాటనున్నారు. 24 గంటలు ఆక్సిజన్ విడుదల చేసే రావి మొక్కలకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ 21 లక్షలు, అటవీ శాఖ 4 లక్షలు, మునిసిపల్ కార్పొరేషన్లు 4 లక్షలు, ఎడీఎంసీ 3 లక్షల చొప్పున మొక్కలు నాటనున్నాయి. -
31 ఏళ్లు...31 మొక్కలు
బర్త్‌డే వస్తుందంటే చాలు! ఎప్పుడు? ఎక్కడ? ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలో ప్లాన్ చేసుకోవడం సహజం. కొంతమంది మాత్రం సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. వాళ్లలో కంగనా రనౌత్ ఒకరు. ఈవిడగారి రూటే సెపరేటు. ఎందుకంటే బర్త్‌డే సందర్భంగా ఆమె స్వయంగా గోతులు తవ్వారు. దేవుడా... ఏంటిది అనుకుంటున్నారా? ఆమె గోతులు తవ్వింది మంచి పనికే. మొక్కలు నాటడానికి. శుక్రవారం (మార్చి 23) కంగనా బర్త్‌డే. 31వ వసంతంలోకి అడుగుపెట్టారామె. అందుకే మనాలీలో ఉన్న తన ఇంటి చుట్టుపక్కల వారం రోజుల నుంచి 31 మొక్కలను నాటారు కంగనా. అంటే.. సంవత్సరానికో మొక్క అన్నట్లు లెక్క. విశేషం ఏంటంటే ప్రపంచ వాతావారణ శాస్త్ర దినోత్సవం కూడా మార్చి 23నే. సీన్ భలే కనెకై్టంది కదూ! బర్త్‌డే సందర్భంగా కంగనా మాట్లాడుతూ– ‘‘ఈ బర్త్‌డే సందర్భంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నాను. పియానో నేర్చుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ట్రైనర్ దగ్గర పాఠాలు వింటున్నా. మా ఇంట్లో మా అమ్మ కూరగాయలు పెంచుతారు. అలా గార్డెనింగ్ పట్ల నాకు ఇంట్రెస్ట్ మొదలైంది. అందుకే ఈ ఏడాది మొక్కలు నాటాను. గొయ్యి తవ్వి ఒక్కో మొక్క నాటడానికి అరగంటకుపైగా టైమ్ పట్టింది. అఫ్కోర్స్ ఇదొక స్ట్రెస్‌బస్టర్‌లా కూడా అనిపించింది. నా బర్త్‌డే సందర్భంగా టెంపుల్‌కి వెళ్లాను. ఫ్యామిలీ అంతా కలిసి లంచ్ చేశాం’’ అన్నారు. కంగనా టైటిల్ రోల్లో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ షూటింగ్ కంప్లీటైందని సమాచారం. ఆగస్టులో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రకాశ్ కొవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మెంటల్ హై క్యా’ చిత్రంతో బిజీగా ఉన్నారు కంగనా రనౌత్.