తెలంగాణకి హరిత తిలకం కోటి వృక్షార్చన  | Karunakar Reddy Guest Column On Tree Plantation On Occasion Of Telangana CM KCR | Sakshi
Sakshi News home page

తెలంగాణకి హరిత తిలకం కోటి వృక్షార్చన 

Published Wed, Feb 17 2021 1:30 AM | Last Updated on Wed, Feb 17 2021 1:30 AM

Karunakar Reddy Guest Column On Tree Plantation On Occasion Of Telangana CM KCR - Sakshi

భరతమాత నుదిటిపై సస్య తిలకం.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌. ఆకు పచ్చని తెలంగాణ సంకల్పం.. హరిత హారం. ఈ హరితహార సాధన పథ క్రమంలో తలపెట్టిన మహా యజ్ఞం.. కోటి వృక్షార్చన. ఒకేరోజు ఒకే గంటలో.. కోటి మొక్కలు నాటి సీఎం కె. చంద్రశేఖర రావుకి ఘన వన కానుకనందించేందుకు యావత్‌ తెలంగాణ పచ్చని మొక్కలు చేబూనింది. పల్లెపట్నాన మొక్కల పండుగతో వన హారతి పట్టేందుకు సన్నద్ధమైంది. వన విస్తరణలో సరికొత్త రికార్డులు బద్ధలుకొట్టేందుకు కోటి వృక్షార్చన వేదిక కాబోతోంది. 

మొక్కలే మన శ్వాస. వృక్షాలే మన ఊపిరి. జలజీవాలకి మూలం అడవులే. మొక్కలు లేనిదే మనుగడ లేదు. పచ్చదనం లేనిదే పురోగమనం లేదు. కానీ నేడు ఆ పచ్చదనమే కరువై ప్రపంచం అల్లాడుతోంది. శ్రుతి మించిన శిలాజ ఇంధనాల వాడకం, విచక్షణ రహిత వనరుల వినియోగం కారణంగా ప్రకృతిలో సమతౌల్యం దెబ్బతిని... భూతాపం భూమండలాన్ని కబళించే దుస్థితి దాపురించింది. పర్యావరణ మార్పులకి అడ్డుకట్ట పడకపోతే... జీవ ఉనికి, మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన నేటి సాంకేతిక యుగంలో తలసరి మొక్కలు, అంతి మంగా హరిత సాంద్రత పెంచడమే లక్ష్యంగా భారతరత్న, దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఆశయాలకి ప్రతిరూపంగా ప్రాణం పోసుకున్న సామాజిక వన ఉద్యమం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌. మొక్కలు నాటడంలో సరికొత్త సంచలనం, వనాల విస్తరణలో వినూత్న మంత్రం ఈ హరిత సవాలు. 

ఇది ప్రప్రథమంగా మొదలైన తెలంగాణతోపాటు దేశమంతటా నేడు ఉద్యమంలా విస్తరించింది. ఎంపీ సంతోష్‌ చొరవ, సెలబ్రిటీల హంగులు వెరసి మూడు మొక్కలు ఆరు చెట్లతో ఘనంగా సాగుతోంది. సామాజిక ట్రెండ్‌గా మారిన గ్రీన్‌ ఛాలెంజ్‌.. మరో దశని అందుకోబోతోంది. ముఖ్యంగా తెలం గాణ గడ్డ మరోసారి హరిత రికార్డులకి సిద్ధమైంది. ఫిబ్రవరి 17 సీఎం పుట్టినరోజు సందర్భంగా... తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. 3 మొక్కలు నాటిన పౌరులు... ఆన్‌లైన్‌ యాప్, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేలా ఇప్పటికే వాట్సప్‌ నంబర్‌ 9000365000, ఇగ్నైటింగ్‌ మైండ్స్‌ మొబైల్‌ యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు. ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటిన వ్యక్తులు, సంస్థలకి అవార్డులు ఇవ్వనున్నారు. 

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కి వివిధ రంగాలకి చెందిన సెలబ్రిటీలు నూతన శోభని తీసుకువచ్చారు. ఈ ఛాలెంజ్‌ నిరంతరం సజీవంగా ఉండేలా, వార్తల్లో నిలిచేలా వెలుగు తెచ్చారు. సచిన్, అమితాబచ్చన్, చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్‌ ఇలా ఎందరెందరో మొక్కలు నాటి అభిమానుల్లో స్ఫూర్తి నింపారు. ఫలితంగా నేడు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరణ వార్తలు, మొక్కలు నాటుతున్న ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి. ఎందరో బుల్లితెర, వెండితెర నటీనటులు, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఇప్పటికే మొక్కలు నాటిన వారంతా తాజాగా కోటి వృక్షార్చనలో పాల్గొనాలంటూ పిలుపునిస్తున్నారు. ప్రకృతి విపత్తుల నుంచి భారతావనిని కాపాడుకుందామంటూ యూట్యూబ్, ట్విట్టర్లలో వీడియో సందేశాలు పెడుతున్నారు.

సీఎం పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలంటూ ఆహ్వానిస్తున్నారు. కోటి రత్నాల తెలంగాణ గడ్డకు.. వన తిలకం.. హరిత హారం. ఈ హరిత యజ్ఞానికి.. పచ్చని పావడా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌. సీఎం స్వప్నమైన ఆకుపచ్చని తెలంగాణ సాధనలో.. హరిత సవాలు చిరునిచ్చెన. హరిత భారత స్వప్నంతో ప్రతిఒక్కరికీ చేరువైన గ్రీన్‌ ఛాలెంజ్‌.. కోటి వృక్షార్చన ద్వారా వనాల విస్తరణ, కాలుష్య నివారణకి దోహదపడనుంది. కోటి మొక్కలతో సీఎంకి మరపురాని బహుమతి ఇవ్వాలని తెలంగాణ సమాజం ఎదురుచూస్తోంది. ఇప్పటికే హరితహారం పుణ్యమాని రాష్ట్రంలో పచ్చదనం 4 శాతం వృద్ధి చెందింది. ఇక ఈ సామాజిక వన విప్లవం ఇదే స్థాయిలో దేశమంతటా కొనసాగితే... 28 చెట్లతో తలసరి మొక్కల లెక్కల్లో అట్టడుగున ఉన్న భారత్‌లో పచ్చదనం పరిఢవిల్లుతుంది.

చెట్టు–పుట్ట, పశువులు–పక్షులు, నదులని పూజించే దేశంలో జన చైతన్యం వెల్లివిరిస్తే.. భారత్‌లో హరిత సాంద్రత పెంచడం అసాధ్యం కాదు. ఉత్తరాఖండ్‌ మంచు సరస్సు విధ్వంసం వంటి ఘటనలకి ఆస్కారం ఉండదు. నిర్జీవమవుతున్న అడవులు కొత్త చిగుళ్లు వేస్తాయి. వనాల వైశాల్యం పెరిగితే... తద్వారా వర్షాలు, భూగర్భ జలాలు మెరుగుపడి కరవుల ప్రభావం తగ్గుతుంది. అంతిమంగా దేశానికి ఆహార, జల భద్రత లభిస్తుంది. ఇందుకు కోటి వృక్షార్చన ద్వారా తెలంగాణ రాష్ట్రమే పునాది కావాలని ఆశిద్దాం. రాష్ట్రంలో హరిత వనాలు గగన సీమలని అందుకోవాలని కోరుకుందాం. (నేడు సీఎం కేసీఆర్‌ జన్మదినం)

వ్యాసకర్త ఇగ్నైటింగ్‌ మైండ్స్‌ వ్యవస్థాపకులు
ఎం. కరుణాకర్‌రెడ్డి
మొబైల్‌ : 98494 33311

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement