karunakara Reddy
-
శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
సాక్షి, తిరుపతి: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ప్రధాని మోదీ ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి సోమవారం ఉదయం 9 గంటలకు మహాద్వారం వద్దకు చేరుకోగా, అర్చకులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి, వేదపండితులు ఆలయ మర్యాదలతో వేదమంత్రోచ్ఛారణ నడుమ ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. మహాద్వారం నుంచి ఆలయంలోనికి ప్రవేశించిన ప్రధాని ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం బంగారు వాకిలి ద్వారా గర్భగుడిలోకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వైభవం, ప్రాశస్త్యం గురించి ప్రధానికి ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. ఆలయ జీయర్లు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం వకుళామాతను ప్రధాని దర్శించుకున్నారు. అక్కడి నుంచి విమాన ప్రాకారం మీదుగా విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఆ తర్వాత వెండివాకిలి మీదుగా వెలుపలకు వచ్చిన ప్రధాని ధ్వజస్తంభాన్ని మొక్కారు. అనంతరం రంగనాయక మండపంలో ప్రధానికి వేద పండితులు ఆశీర్వచనం పలకగా, భూమన కరుణాకరరెడ్డి, ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, టీటీడీ 2024 క్యాలెండర్, డైరీ, పంచగవ్యాలను అందజేశారు. అక్కడి నుంచి అతిథి గృహానికి చేరుకున్న ప్రధాని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం అల్పాహారాన్ని స్వీకరించారు. ప్రధాని నరేంద్రమోదీ శ్రీవారిని దర్శించుకోవడం ఇది నాలుగోసారి. కాగా, తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా 140 కోట్ల మంది భారతీయులకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి కలగాలని తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రార్థించానని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. ప్రధానికి సాదర వీడ్కోలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డుమార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరివెళ్లారు. విమానాశ్రయంలో మోదీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి వీడ్కోలు పలికారు. -
అటవీశాఖ క్లియరెన్స్ ఇస్తేనే ఆంక్షల సడలింపు
తిరుమల: అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే మార్గంలో వన్య మృగాల నుంచి ఎలాంటి ముప్పు లేదని అటవీశాఖ అధికారులు ధ్రువీకరిస్తేనే 12 ఏళ్ల లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టంచేశారు. అప్పటి వరకు చిన్నారులపై ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల వరకే నడకదారుల్లో చిన్నారులకు అనుమతి ఉంటుందని, భక్తుల భద్రతే తమకు ముఖ్యమని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో సోమవారం చైర్మన్ క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు ఆహారం, తాగునీరు, కాఫీ, టీ, మజ్జిగ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గోగర్భం సర్కిల్ నుంచి కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూలను తనిఖీ చేశారు. అనంతరం చైర్మన్ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెరటాశి మాసం, సెలవుల కారణంగా నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. క్యూలు నాలుగు నుంచి ఐదు కిలో మీటర్ల దూరం వెళ్లాయని, ఇలాంటి భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం చేయించాలనే సంకల్పంతో వీఐపీ బ్రేక్, సుపథం, స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీ కూడా రద్దు చేసినట్లు చెప్పారు. క్యూల్లో ఉండే భక్తులు ఎక్కడా అసహనానికి లోను కాకుండా అవసరమైన తగిన వసతులు కల్పించామని తెలిపారు. ఈ నెల 15 నుంచి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అధికారుల పనితీరు బ్రహ్మాండం తిరుమలకు భక్తులు పోటెత్తడంతో ఈవో, జేఈవో, సీవీఎస్వో ఇతర అధికారులందరూ ప్రత్యక్షంగా ఏర్పాట్లు పరిశీలిస్తూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని చైర్మన్ అభినందించారు. భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చూస్తున్నారని వివరించారు. కాగా, ఆదివారం అర్ధరాత్రి వరకు తిరుమల శ్రీవారిని 88,623 మంది దర్శించుకున్నారు. హుండీలో రూ. 4.67 కోట్లు వేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతుంది. జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఆరోగ్యాధికారి డాక్టర్ శ్రీదేవి, డీఎఫ్‌వో శ్రీనివాసులు పాల్గొన్నారు. -
తెలంగాణకి హరిత తిలకం కోటి వృక్షార్చన
భరతమాత నుదిటిపై సస్య తిలకం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఆకు పచ్చని తెలంగాణ సంకల్పం.. హరిత హారం. ఈ హరితహార సాధన పథ క్రమంలో తలపెట్టిన మహా యజ్ఞం.. కోటి వృక్షార్చన. ఒకేరోజు ఒకే గంటలో.. కోటి మొక్కలు నాటి సీఎం కె. చంద్రశేఖర రావుకి ఘన వన కానుకనందించేందుకు యావత్ తెలంగాణ పచ్చని మొక్కలు చేబూనింది. పల్లెపట్నాన మొక్కల పండుగతో వన హారతి పట్టేందుకు సన్నద్ధమైంది. వన విస్తరణలో సరికొత్త రికార్డులు బద్ధలుకొట్టేందుకు కోటి వృక్షార్చన వేదిక కాబోతోంది. మొక్కలే మన శ్వాస. వృక్షాలే మన ఊపిరి. జలజీవాలకి మూలం అడవులే. మొక్కలు లేనిదే మనుగడ లేదు. పచ్చదనం లేనిదే పురోగమనం లేదు. కానీ నేడు ఆ పచ్చదనమే కరువై ప్రపంచం అల్లాడుతోంది. శ్రుతి మించిన శిలాజ ఇంధనాల వాడకం, విచక్షణ రహిత వనరుల వినియోగం కారణంగా ప్రకృతిలో సమతౌల్యం దెబ్బతిని... భూతాపం భూమండలాన్ని కబళించే దుస్థితి దాపురించింది. పర్యావరణ మార్పులకి అడ్డుకట్ట పడకపోతే... జీవ ఉనికి, మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన నేటి సాంకేతిక యుగంలో తలసరి మొక్కలు, అంతి మంగా హరిత సాంద్రత పెంచడమే లక్ష్యంగా భారతరత్న, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలకి ప్రతిరూపంగా ప్రాణం పోసుకున్న సామాజిక వన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్. మొక్కలు నాటడంలో సరికొత్త సంచలనం, వనాల విస్తరణలో వినూత్న మంత్రం ఈ హరిత సవాలు. ఇది ప్రప్రథమంగా మొదలైన తెలంగాణతోపాటు దేశమంతటా నేడు ఉద్యమంలా విస్తరించింది. ఎంపీ సంతోష్ చొరవ, సెలబ్రిటీల హంగులు వెరసి మూడు మొక్కలు ఆరు చెట్లతో ఘనంగా సాగుతోంది. సామాజిక ట్రెండ్‌గా మారిన గ్రీన్ ఛాలెంజ్.. మరో దశని అందుకోబోతోంది. ముఖ్యంగా తెలం గాణ గడ్డ మరోసారి హరిత రికార్డులకి సిద్ధమైంది. ఫిబ్రవరి 17 సీఎం పుట్టినరోజు సందర్భంగా... తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. 3 మొక్కలు నాటిన పౌరులు... ఆన్లైన్ యాప్, వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఇప్పటికే వాట్సప్ నంబర్ 9000365000, ఇగ్నైటింగ్ మైండ్స్ మొబైల్ యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు. ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటిన వ్యక్తులు, సంస్థలకి అవార్డులు ఇవ్వనున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి వివిధ రంగాలకి చెందిన సెలబ్రిటీలు నూతన శోభని తీసుకువచ్చారు. ఈ ఛాలెంజ్ నిరంతరం సజీవంగా ఉండేలా, వార్తల్లో నిలిచేలా వెలుగు తెచ్చారు. సచిన్, అమితాబచ్చన్, చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్ ఇలా ఎందరెందరో మొక్కలు నాటి అభిమానుల్లో స్ఫూర్తి నింపారు. ఫలితంగా నేడు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరణ వార్తలు, మొక్కలు నాటుతున్న ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి. ఎందరో బుల్లితెర, వెండితెర నటీనటులు, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఇప్పటికే మొక్కలు నాటిన వారంతా తాజాగా కోటి వృక్షార్చనలో పాల్గొనాలంటూ పిలుపునిస్తున్నారు. ప్రకృతి విపత్తుల నుంచి భారతావనిని కాపాడుకుందామంటూ యూట్యూబ్, ట్విట్టర్లలో వీడియో సందేశాలు పెడుతున్నారు. సీఎం పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలంటూ ఆహ్వానిస్తున్నారు. కోటి రత్నాల తెలంగాణ గడ్డకు.. వన తిలకం.. హరిత హారం. ఈ హరిత యజ్ఞానికి.. పచ్చని పావడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్. సీఎం స్వప్నమైన ఆకుపచ్చని తెలంగాణ సాధనలో.. హరిత సవాలు చిరునిచ్చెన. హరిత భారత స్వప్నంతో ప్రతిఒక్కరికీ చేరువైన గ్రీన్ ఛాలెంజ్.. కోటి వృక్షార్చన ద్వారా వనాల విస్తరణ, కాలుష్య నివారణకి దోహదపడనుంది. కోటి మొక్కలతో సీఎంకి మరపురాని బహుమతి ఇవ్వాలని తెలంగాణ సమాజం ఎదురుచూస్తోంది. ఇప్పటికే హరితహారం పుణ్యమాని రాష్ట్రంలో పచ్చదనం 4 శాతం వృద్ధి చెందింది. ఇక ఈ సామాజిక వన విప్లవం ఇదే స్థాయిలో దేశమంతటా కొనసాగితే... 28 చెట్లతో తలసరి మొక్కల లెక్కల్లో అట్టడుగున ఉన్న భారత్‌లో పచ్చదనం పరిఢవిల్లుతుంది. చెట్టు–పుట్ట, పశువులు–పక్షులు, నదులని పూజించే దేశంలో జన చైతన్యం వెల్లివిరిస్తే.. భారత్‌లో హరిత సాంద్రత పెంచడం అసాధ్యం కాదు. ఉత్తరాఖండ్ మంచు సరస్సు విధ్వంసం వంటి ఘటనలకి ఆస్కారం ఉండదు. నిర్జీవమవుతున్న అడవులు కొత్త చిగుళ్లు వేస్తాయి. వనాల వైశాల్యం పెరిగితే... తద్వారా వర్షాలు, భూగర్భ జలాలు మెరుగుపడి కరవుల ప్రభావం తగ్గుతుంది. అంతిమంగా దేశానికి ఆహార, జల భద్రత లభిస్తుంది. ఇందుకు కోటి వృక్షార్చన ద్వారా తెలంగాణ రాష్ట్రమే పునాది కావాలని ఆశిద్దాం. రాష్ట్రంలో హరిత వనాలు గగన సీమలని అందుకోవాలని కోరుకుందాం. (నేడు సీఎం కేసీఆర్ జన్మదినం) వ్యాసకర్త ఇగ్నైటింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు ఎం. కరుణాకర్‌రెడ్డి మొబైల్ : 98494 33311 -
‘ఈడబ్ల్యూఎస్ తక్షణమే అమలు చేయాలి’
అంబర్‌పేట: అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల (ఈడబ్ల్యూఎస్)ను తెలుగు రాష్ట్రాల్లో తక్షణమే అమలు చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఈడబ్ల్యూఎస్ తెలుగు రాష్ట్రాల సాధన సమితి ఆధ్వర్యంలో ఓసీ ప్రజలసాధన సదస్సు నిర్వహించారు. కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టి ఏడాది పూర్తవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయకపోవడం దారుణమన్నారు. బిల్లు అమలు చేయకపోవడంతో అగ్రవర్ణాల పేదలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ అమలు చేయకపోతే రెడ్డి, కమ్మ, వెలమ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణ కులాల ప్రతినిధులతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అవసరమైతే ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో పలు అగ్రకుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘హెల్త్ వర్సిటీ వీసీని తొలగించాలి’
హైదరాబాద్: కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డిని తొలగించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని 14 బీసీ సంఘాలు హెచ్చరించాయి. ఆదివారం ఇక్కడ విద్యానగర్ బీసీ భవన్లో 14 బీసీ సంఘాల సమావేశం జరిగింది. వీసీని తొలగించాలని ఆ సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశాయి. బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయలేదని, ఫలితంగా 262 మందికి సీట్లు రాకుండా పోయాయని అన్నారు. వీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మారారని, రాజ్యాంగ హక్కులను అమలు చేయకుండా ఈ వర్గాలపట్ల విషాన్ని వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరిగిందని వైద్య, ఆరోగ్య శాఖ కూడా అంగీకరించిందని తెలిపారు. అన్యాయాన్ని సరిదిద్దకుండా వైస్ చాన్సలర్ వితండవాదం చేస్తూ హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు కూడా మెరిట్ మార్కుల ప్రకారం మొదట ఓపెన్ కాంపిటీషన్ సీట్లు భర్తీ చేసి, ఆ తర్వాత రిజర్వేషన్లు భర్తీ చేయాలని తీర్పు చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్ల అమలులో తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ అడ్మిషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీకే మద్దతు
సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్): అగ్రవర్ణ పేదలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. అగ్రవర్ణాల్లోని రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ తదితర వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని వైఎస్సార్సీపీ తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం హర్షించదగ్గ పరిణామమని తెలిపారు. ఎన్నికల ప్రణాళికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతూ ప్రతి అంశాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయ మన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అగ్రవర్ణాలను ఆదుకుంటామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నా తదనంతరం పూర్తిగా విస్మరించి కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకున్నాడని కరుణాకర్‌రెడ్డి గుర్తు చేశారు. -
‘నారాయణ’ కోసమే..
స్కావెంజర్స్ కాలనీ తొలగించి మంత్రి నారాయణ విద్యాసంస్థలు నెలకొల్పే కుట్ర భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ధర్నా ఆ కాలనీవాసుల జోలికొస్తే ప్రాణత్యాగాలకైనా సిద్ధం అక్కడే పట్టాలిచ్చిఇళ్లు నిర్మించి ఇవ్వాలి కార్మికులకు అండగా వైఎస్సార్సీపీ తిరుపతి సిటీ:‘‘దళితులు.. అందులోనూ పేదలే కదా పొమ్మంటే పోతారులే అని పారిశుద్ధ్య కార్మికుల ఇళ్లను ఖాళీ చేయించాలని చూస్తే ఖబడ్దార్’’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు హెచ్చరించారు. తిరుపతి నగరం నడిబొడ్డున పారిశుద్ధ్య కార్మికులు నివాసాలుంటున్న స్కావెంజర్స్ కాలనీలో ఇళ్లను తొలగించి అక్కడ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థలను నెలకొల్పేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. స్కావెంజర్స్ కాలనీలోని కార్మికుల ఇళ్లను తొలగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ వరప్రసాదరావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కార్మికులతో కలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు డంపింగ్ యార్డ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా కరుణాకర రెడ్డి మాట్లాడుతూ 4లక్షలమంది ప్రజలకు సంబంధించిన పారిశుధ్యాన్ని శుభ్రం చేసే కార్మికులు స్కావెంజర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారని చెప్పారు. ఐదున్నర ఎకరాల్లో సమారు 381మంది కార్మికుల కుటుంబాలు గత 60 సంవత్సరాలకు పైబడి నివాసం ఉంటున్నాయని చెప్పారు. మంత్రి నారాయణ ఈ స్థలాన్ని కబ్జా చేసి కాలేజీలను కట్టుకోవడానికి కార్మికులను తరిమిగొట్టే ప్రయత్నానికి పూనుకున్నారని పేర్కొన్నారు. ఇక్కడున్న కార్మికులకు నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికృత మాల వద్ద ఇళ్లు కట్టించి ఇస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం 36మందికి మాత్రమే అక్కడ 10 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో ఇరుకైన ఇళ్లను స్నానాల గదులు, మరుగుదొడ్లు లేకుండా నిర్మిస్తున్నారని తెలిపారు. అక్కడ నిర్మించే ఇళ్లలో ఇస్కా సమావేశానికి హాజరవుతున్న మంత్రి నారాయణ నిద్ర చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 5వ తేదీ లోగా కార్మికులంతా కాలనీని ఖాళీ చేయాలని మంత్రి నారాయణ చెప్పడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మంత్రి బెదిరింపులకు తాము భయపడేదిలేదని హెచ్చరించారు. కోట్లాది రూపాయలు సంపాదించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కట్టబెట్టి ప్రజల అమోదం లేకుండా నారాయణ మంత్రి అయ్యారని ఏద్దేవా కరుణాకర రెడ్డి చేశారు. మంత్రి నారాయణను దళిత, గిరిజనులు పిడికిళ్లు బిగించి తరిమి తరిమి కొడతారని చెప్పారు. కార్మికులకు ఇక్కడే ఇళ్లపట్టాలిచ్చి ఇళ్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం చేసేందుకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. న్యాయబద్ధంగా, శాంతియుతంగా తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి పోరాటాలు చేస్తామన్నారు. ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ స్కావెంజర్స్ కాలనీలో నిరుపేద దళిత, గిరిజన, బీసీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయని చెప్పారు. ప్రభుత్వం చేతనైతే వెంటనే ప్రస్తుతం వారు ఉన్నచోటే వారందరికీ పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే స్కావెంజర్స్ కాలనీ పేరును మార్పు చేయాలని ఇప్పటికే మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ ధర్నాలో పార్టీ నేతలు బోయనపాటి మమత, ఎస్కె.బాబు, పుల్లూరు అమరనాథరెడ్డి, కట్టా గోపీయాదవ్, టి.వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేంద్ర, మునిరామిరెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, గీతా, కుసుమ, సాయి, శ్యామల, శాంతారెడ్డి, నాగిరెడ్డి, మురళీయాదవ్, శివకుమార్, తాళ్లూరి ప్రసాద్, హనుమంత నాయక్, బాలిశెట్టి కిషోర్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు పెద్దపీట
కేంద్రపాలక మండలి సభ్యులుగా ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే అమరనాథరెడ్డి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార ప్రతినిధులుగా ఆర్కే.రోజా, భూమన సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు మరోసారి పెద్దపీట వేశారు. కేంద్ర పాలకమండలి సభ్యులుగా తిరుపతి ఎంపీ వరప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డిని నియమించారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, అధికార ప్రతినిధులుగా ఆర్కే.రోజా, భూమన కరుణాకరరెడ్డిని నియమిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రకటించిన రాష్ట్ర కమిటీలోనూ జిల్లాకు అధిక ప్రాధాన్యత కల్పించారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను నియమించారు. అలాగే కార్యద ర్శిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా నుంచి పార్టీ తరపున ఇద్దరు ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర కమిటీలో జిల్లాకు ప్రాధాన్యం కల్పించారు. -
జగన్‌తో రాజకీయ సంచలనం
=తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి =వెయ్యి మందితో పార్టీలో చేరిన శ్యామలమ్మ సాక్షి, తిరుపతి: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైస్.జగన్ మోహన్‌రెడ్డి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కాంగ్రెస్ నాయకురాలు సంతోషమ్మ కోడలు శ్యామలమ్మ దాదాపు వెయ్యి మంది కార్యకర్తలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 30 ఏళ్లగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంతోషమ్మ కోడలు శ్యామలమ్మ వైఎస్ఆర్ సీపీలోకి రావడం ముదావహమని అన్నారు. జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిభావంతుడైన నాయకుడని, రాజకీయం రంగంలో సంచలనం సృష్టించారని తెలిపారు. వటవృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీ ఊడలు పీకారని తెలిపారు. వైఎస్ పాలనలో గ్యాస్, కరెంట్, బస్సు చార్జీలు పెరగలేదని గుర్తు చేశారు. తిరుపతిలోనే 25 వేల తెల్ల రేషన్ కార్డులు, 23 వేల మందికి పింఛన్లు తీసేశారని అన్నారు. ప్రజలకు ఒక్క మేలు కూడా చేయని కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కొమ్ముకాస్తోందని ఆరోపించారు. నాలుగు నెలల తరువాత జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, ఆయన అధికారంలోకి రాగానే రూ.200 పింఛన్లు 700కు పెంచుతారని, వికలాంగులకు అందజేసే రూ.500 వెయ్యి చేస్తారని అన్నారు. ఓటర్లు ఫ్యాను గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. పార్టీలో చేరిన శ్యామలమ్మ మాట్లాడుతూ తాను వైఎస్ అభిమానిగా పార్టీలో చేరానని తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. తిరుపతి పార్లమెంటరీ పరిశీలకుడు వరప్రసాదరావు మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో పలు సంక్షేమ పథకాలు వస్తాయని అన్నారు. నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్ రెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్ గాయత్రీ దేవి, నగర మహిళా కన్వీనర్ కుసుమ, ఎస్సీ సెల్ కన్వీనర్ రాజేంద్ర, పార్టీ నాయకులు ఎంవీఎస్. మణి, పుల్లయ్య, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, చెంచయ్య యాదవ్, సాకం ప్రభాకర్ పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే జగన్ లక్ష్యం
సాక్షి, తిరుపతి: ప్రజాసంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి లక్ష్యమని ఆ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఆయన రెండు రోజుల నిరాహారదీక్షకు కూర్చు న్నారు. ఆయన మాట్లాడుతూ జైలు నుంచి జగన్మోహన్రెడ్డి విడుదలైనప్పటినుంచి ప్రజల మధ్య గడపుతున్నారని అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఈ నెలలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల కార్యాచరణను ప్రకటించారని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే తమ పార్టీ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారని అన్నారు. వీరి చర్యను టీడీపీ నేతలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. 38 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబా బు ఆలోచనలు మాత్రం పాతాళంలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు మాట్లాడుతూ విభజన జరిగితే సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. చంద్రబా బు కాంగ్రెస్‌తో రహస్య పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే నిత్యం ప్రజల మధ్య గడుపుతున్నారని అన్నారు. పులుగోరు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆంధ్రలో జన్మించిన వాడేనని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు హనుమంతరావు ప్రజల చేత దెబ్బలు తిన్న నాయకుడని తెలిపారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు సమైక్యాంధ్ర కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. కాంగ్రెసు నాయకుడు సబ్బంహరి స్వప్రయోజనాల కోసం, వైఎస్సార్ కాంగ్రెస్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. పార్టీ నాయకుడు ఎస్కే.బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనర్ కుసుమ, బీసీ కమిటీ సభ్యులు ఎల్లయ్య, కట్టా జయరాంయాదవ్, సింగిల్ విండో మాజీ సభ్యుడు రామచంద్రారెడ్డి, ఆర్టీసీ జేఏసీ నాయకుడు చంద్రయ్య, పార్టీ నాయకులు మణ్యం చంద్రశేఖర్‌రెడ్డి, తొండమనాటి వెంకటేష్, కొమ్ము చెంచయ్య యాదవ్, చందూరాయల్, న్యాయవాది చంద్రశేఖర్, తిరుమలయ్య, వెంకటముని, నాగిరెడ్డి, ముద్రనారాయణ, శాంతారెడ్డి, గీత, సుశీలమ్మ, గీతారెడ్డి, ప్రమీల, గౌరి పాల్గొన్నారు. -
బాబు అండదండలతోనే విభజన కుట్ర
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అండదండలతోనే రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సోనియాగాంధీ కుట్రపన్నుతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి తుడా సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నాయకులు చేస్తున్న రిలే దీక్షలకు శనివారం పార్టీ నాయకులు ఆదం రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆటోనగర్నాయకులు శనివారం మద్దతు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శిబిరం వద్దకు విచ్చేసి వారికి పూల మాలలు వేసి దీక్షలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఆజ్యం పోశారన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాలకు సీమాం ధ్రులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా మనే వెన్నుపోటు పోడిచి చంద్రబాబు పదవిలోకి వచ్చారని, నమ్మినవారిని నట్టేట ముంచడం ఆయన నైజంగా మారిందని విమర్శించారు. ఎక్కడ ఆంటోనీ కమిటీ సీమాంధ్రులకు అనుకూలంగా నివేదిక ఇస్తుందేమోనని అర్ధాంతరంగా బస్సు యాత్రను ప క్కనపెట్టి ఢిల్లీకి పరుగులు తీశారన్నారు. దీనికి తోడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటిషన్‌ను అడ్డుకునేందుకు సోనియా కాళ్లను పట్టుకునేందుకు వెళ్లారని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి బయటకు వస్తున్నాడంటే కిరణ్, చంద్రబాబుకు గుండెల్లో దడ మొదలవుతుందన్నారు. రా ష్ట్రాన్ని ముక్కలు చేసే హక్కు సోనియాకు లేదన్నా రు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రకు తాగునీరు, సాగునీరు, విద్యుత్ లేక ఏడారిగా మారే పరిస్థితి దాపురించిదన్నారు. విద్యార్థుకూ నిరాశే ఎదరవుతుందనని తెలిపారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేతులకు గాజులు తొడుక్కొని ఆడంగుల్లా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. నిజంగా సీమాంధ్ర ప్ర జలపై మమకారం ఉంటే వెంటనే పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. 45 రోజులుగా సమైక్యం కోసం అలుపెరగని ఉద్యమం చేస్తున్నది ఒక్క వైఎస్సార్సీపీయేనని ఆ యన గుర్తుచేశారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఎస్కె.బాబు, కుప్పయ్య, చల్లా, కిట్టు, శంకర్, కైలాసం, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, మాదవనాయుడు, చెంచుయాదవ్, గోపీయాదవ్, తిమ్మారెడ్డి, హర్ష, పుణీత, శారద, మునీశ్వరి, లక్ష్మి పాల్గొన్నారు.