అటవీశాఖ క్లియరెన్స్‌ ఇస్తేనే ఆంక్షల సడలింపు | TTD: Pedestrians are allowed till 2 pm | Sakshi
Sakshi News home page

అటవీశాఖ క్లియరెన్స్‌ ఇస్తేనే ఆంక్షల సడలింపు

Published Tue, Oct 3 2023 5:12 AM | Last Updated on Tue, Oct 3 2023 8:54 PM

TTD: Pedestrians are allowed till 2 pm - Sakshi

క్యూలో ఉన్న భక్తులతో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి

తిరుమల: అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే మార్గంలో వన్య మృగాల నుంచి ఎలాంటి ముప్పు లేదని అటవీశాఖ అధికారులు ధ్రువీకరిస్తేనే 12 ఏళ్ల లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి స్పష్టంచేశారు. అప్పటి వరకు చిన్నారులపై ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల వరకే నడకదారుల్లో  చిన్నారులకు అనుమతి ఉంటుందని, భక్తుల భద్రతే తమకు ముఖ్యమని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో సోమవారం చైర్మన్‌ క్యూలైన్‌లను పరిశీలించారు.

భక్తులకు ఆహారం, తాగునీరు, కాఫీ, టీ, మజ్జిగ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గోగర్భం సర్కిల్‌ నుంచి కృష్ణతేజ సర్కిల్‌ వరకు క్యూలను తనిఖీ చేశారు. అనంతరం చైర్మన్‌ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెరటాశి మాసం, సెలవుల కారణంగా నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు.

క్యూలు నాలుగు నుంచి ఐదు కిలో మీటర్ల దూరం వెళ్లాయని, ఇలాంటి భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం చేయించాలనే సంకల్పంతో వీఐపీ బ్రేక్, సుపథం, స్లాటెడ్‌ దర్శనం టోకెన్ల జారీ కూడా రద్దు చేసినట్లు చెప్పారు. క్యూల్లో ఉండే భక్తులు ఎక్కడా అసహనానికి లోను కాకుండా అవసరమైన తగిన  వసతులు కల్పించామని తెలిపారు. ఈ నెల 15 నుంచి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

అధికారుల పనితీరు బ్రహ్మాండం 
తిరుమలకు భక్తులు పోటెత్తడంతో ఈవో, జేఈవో, సీవీఎస్వో ఇతర అధికారులందరూ ప్రత్యక్షంగా ఏర్పాట్లు పరిశీలిస్తూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని చైర్మన్‌ అభినందించారు. భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చూస్తున్నారని వివరించారు. కాగా, ఆదివారం అర్ధరాత్రి వరకు తిరుమల శ్రీవారిని 88,623 మంది దర్శించుకున్నారు. హుండీలో రూ. 4.67 కోట్లు వేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతుంది. జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఆరోగ్యాధికారి డాక్టర్‌ శ్రీదేవి, డీఎఫ్వో శ్రీనివాసులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement