Noon
-
అటవీశాఖ క్లియరెన్స్ ఇస్తేనే ఆంక్షల సడలింపు
తిరుమల: అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే మార్గంలో వన్య మృగాల నుంచి ఎలాంటి ముప్పు లేదని అటవీశాఖ అధికారులు ధ్రువీకరిస్తేనే 12 ఏళ్ల లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టంచేశారు. అప్పటి వరకు చిన్నారులపై ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల వరకే నడకదారుల్లో చిన్నారులకు అనుమతి ఉంటుందని, భక్తుల భద్రతే తమకు ముఖ్యమని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో సోమవారం చైర్మన్ క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు ఆహారం, తాగునీరు, కాఫీ, టీ, మజ్జిగ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గోగర్భం సర్కిల్ నుంచి కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూలను తనిఖీ చేశారు. అనంతరం చైర్మన్ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెరటాశి మాసం, సెలవుల కారణంగా నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. క్యూలు నాలుగు నుంచి ఐదు కిలో మీటర్ల దూరం వెళ్లాయని, ఇలాంటి భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం చేయించాలనే సంకల్పంతో వీఐపీ బ్రేక్, సుపథం, స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీ కూడా రద్దు చేసినట్లు చెప్పారు. క్యూల్లో ఉండే భక్తులు ఎక్కడా అసహనానికి లోను కాకుండా అవసరమైన తగిన వసతులు కల్పించామని తెలిపారు. ఈ నెల 15 నుంచి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అధికారుల పనితీరు బ్రహ్మాండం తిరుమలకు భక్తులు పోటెత్తడంతో ఈవో, జేఈవో, సీవీఎస్వో ఇతర అధికారులందరూ ప్రత్యక్షంగా ఏర్పాట్లు పరిశీలిస్తూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని చైర్మన్ అభినందించారు. భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చూస్తున్నారని వివరించారు. కాగా, ఆదివారం అర్ధరాత్రి వరకు తిరుమల శ్రీవారిని 88,623 మంది దర్శించుకున్నారు. హుండీలో రూ. 4.67 కోట్లు వేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతుంది. జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఆరోగ్యాధికారి డాక్టర్ శ్రీదేవి, డీఎఫ్వో శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కడుపులో మడుగు!
మధ్యాహ్న సమయం. అప్పుడే భోజనం పూర్తయింది. భుక్తాయాసంతో వరండాలోని వాలుకుర్చీలో చారబడ్డాడు ఆ పెద్దాయన. తాపీగా తాంబూలాన్ని ఆస్వాదిస్తున్నాడు. మాగన్నుగా నిద్ర ముంచుకొస్తోంది. వాలుకుర్చీలోనే కాసేపు కునుకు తీసేవాడేమో! ఉన్నట్లుండి కడుపులో ఏదో భారంగా అనిపించసాగింది. భోజనం ఏమైనా ఎక్కువైందా అనే ఆలోచనలో పడ్డాడు. నిమిషాలు గడుస్తున్న కొద్దీ కడుపులో భారం నెమ్మదిగా పెరగసాగింది. కడుపులో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. చెప్పలేని అలజడి. మరికాసేపటికి కడుపులో ఏదో నిండిపోతున్నట్లు ఇబ్బంది. కడుపులో మడుగు కదులుతున్న అనుభూతి. ఇదేదో మామూలుగా తీసిపారేయాల్సిన సంగతి కాదని అర్థమైంది ఆయనకు. భోజనం ఎక్కువ కావడం వల్ల తలెత్తిన సమస్య కాదని మనసుకు తెలుస్తోంది. మరేమై ఉంటుంది..? ఆలోచించసాగాడు ఆయన.. ఆలోచనలను కట్టిపెట్టి నెమ్మదిగా ధ్యానంలోకి జారుకున్నాడు. ధ్యానావస్థలో ఆయనకు అసలు సంగతి అర్థమైంది. తనపై ఏదో ప్రయోగం జరిగింది. ఎవరో తన కడుపును నీటితో నింపేస్తున్నారు. తన కడుపులో భారం పెరుగుతున్న కొద్దీ ఎక్కడో ఉన్న మడుగులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ధ్యానావస్థలో ఆయనకు దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన కూడా ఆషామాషీ మనిషి కాదు. నిష్టాగరిష్ఠుడైన శ్రీవైష్ణవుడు. తనపై జరుగుతున్న ప్రయోగానికి తక్షణమే విరుగుడు కనిపెట్టాలి. లేకుంటే, ప్రాణానికే ముప్పు. ఇది కచ్చితంగా మారణ ప్రయోగమే! అర్థమైపోయింది ఆయనకు. అప్పటికే వాలుకుర్చీ నుంచి ఏమాత్రం కదలలేని స్థితికి చేరుకున్నాడు. మెల్లగా మంత్రజపం ప్రారంభించాడు. విరుగుడు ప్రక్రియ మొదలైంది. కొద్దిసేపటికి నెమ్మదిగా బలం కూడదీసుకుని ఇంట్లో ఉన్న పాలేరును కేకేశాడు. పెరట్లోని పశువులశాల పైకప్పులో ఉన్న వెదురుబొంగుల్లో ‘మధ్యనున్న బొంగును చీల్చేయ్’ అని చెప్పాడు. పశువులశాల అంతా బాగానే ఉంది కదా.. ఈయనేంటి బొంగును నరికేయమంటాడనుకొని బిత్తరపోయి చూశాడు పాలేరు.. ‘వెంటనే నరికేయ్రా..’ ఈసారి కాస్త గొంతుపెంచి గద్దించాడు ఆయన. బెదిరిపోయిన పాలేరు పరుగున పెరట్లోకి వెళ్లాడు. చేతికందిన గొడ్డలి పుచ్చుకుని పశువుల శాలలోకి దూసుకుపోయాడు. పైకప్పు మధ్యగా ఉన్న బొంగును ఒకే ఒక్క వేటుతో నరికి పారేశాడు. అంతే! ఒక్కసారిగా మొదలైంది ప్రవాహం. నరికేసిన బొంగులోంచి ఉధృతమైన నీటి ధార. పెరట్లోంచి ఆ ధార వెనుకనే ఉన్న పొలంలోకి ప్రవహించింది. చూస్తుండగానే పొలంలో చిన్నసైజు మడుగు కట్టింది. వాలుకుర్చీలోని పెద్దాయన కడుపు తేలిక పడింది. ప్రాణం తెరిపిన పడింది. మర్నాటి మధ్యాహ్నం కూడా ఆ పెద్దాయన యథాప్రకారం భోజనానంతరం తాంబూలం సేవిస్తూ వాలుకుర్చీలో మేనువాల్చాడు. ఒక ఆగంతకుడు పరుగు పరుగున వచ్చి ‘అయ్యా..! తప్పయిపోయింది నన్ను క్షమించండి’ అంటూ ఆయన కాళ్లు చుట్టేసుకున్నాడు. నెమ్మదిగా లేవదీశాడాయన. వచ్చిన ఆగంతకుడే పెద్దాయనపై ప్రయోగం చేసిన తాంత్రికుడు. ‘ఇంకెవరిపైనా ఇలాంటి అఘాయిత్యాలు తలపెట్టకు’ అని హెచ్చరించాడు పెద్దాయన. ‘సరే’నంటూ భయభక్తులతో తలపంకించాడతను. నెమ్మదిగా అక్కడి నుంచి నిష్ర్కమించాడు. దాదాపు ఎనభయ్యేళ్ల కిందటి సంఘటన ఇది. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఒక పట్టణంలో జరిగింది. ఇప్పుడా ప్రాంతం ఒడిశాలో ఉంది. - పన్యాల జగన్నాథ దాసు