జగన్‌తో రాజకీయ సంచలనం
=తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి
=వెయ్యి మందితో పార్టీలో చేరిన శ్యామలమ్మ
సాక్షి, తిరుపతి: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వ్యక్తి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైస్.జగన్ మోహన్‌రెడ్డి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కాంగ్రెస్ నాయకురాలు సంతోషమ్మ కోడలు శ్యామలమ్మ దాదాపు వెయ్యి మంది కార్యకర్తలతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 30 ఏళ్లగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంతోషమ్మ కోడలు శ్యామలమ్మ వైఎస్‌ఆర్ సీపీలోకి రావడం ముదావహమని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిభావంతుడైన నాయకుడని, రాజకీయం రంగంలో సంచలనం సృష్టించారని తెలిపారు.
వటవృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీ ఊడలు పీకారని తెలిపారు. వైఎస్ పాలనలో గ్యాస్, కరెంట్, బస్సు చార్జీలు పెరగలేదని గుర్తు చేశారు. తిరుపతిలోనే 25 వేల తెల్ల రేషన్ కార్డులు, 23 వేల మందికి పింఛన్లు తీసేశారని అన్నారు. ప్రజలకు ఒక్క మేలు కూడా చేయని కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కొమ్ముకాస్తోందని ఆరోపించారు. నాలుగు నెలల తరువాత జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, ఆయన అధికారంలోకి రాగానే రూ.200 పింఛన్లు 700కు పెంచుతారని, వికలాంగులకు అందజేసే రూ.500 వెయ్యి చేస్తారని అన్నారు. ఓటర్లు ఫ్యాను గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు.
పార్టీలో చేరిన శ్యామలమ్మ మాట్లాడుతూ తాను వైఎస్ అభిమానిగా పార్టీలో చేరానని తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. తిరుపతి పార్లమెంటరీ పరిశీలకుడు వరప్రసాదరావు మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో పలు సంక్షేమ పథకాలు వస్తాయని అన్నారు. నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్ రెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్ గాయత్రీ దేవి, నగర మహిళా కన్వీనర్ కుసుమ, ఎస్‌సీ సెల్ కన్వీనర్ రాజేంద్ర, పార్టీ నాయకులు ఎంవీఎస్. మణి, పుల్లయ్య, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, చెంచయ్య యాదవ్, సాకం ప్రభాకర్ పాల్గొన్నారు.