
సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్): అగ్రవర్ణ పేదలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. అగ్రవర్ణాల్లోని రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ తదితర వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని వైఎస్సార్‌సీపీ తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం హర్షించదగ్గ పరిణామమని తెలిపారు.
ఎన్నికల ప్రణాళికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతూ ప్రతి అంశాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయ మన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అగ్రవర్ణాలను ఆదుకుంటామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నా తదనంతరం పూర్తిగా విస్మరించి కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకున్నాడని కరుణాకర్‌రెడ్డి గుర్తు చేశారు.