OC Welfare Association
-
ఏపీలో జగన్ విజయం తథ్యం
శివాజీనగర: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఓ.సీ.సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు ఎన్నికల కమిషన్‌పైనా, ఐఏఎస్‌లపైనా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ విజయం తథ్యమని తేలడంతో ఈవీయంలపై ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల తరువాత చంద్రబాబును ఏ ఒక్క జాతీయ పార్టీ నాయకుడు కూడా పట్టించుకోరనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందుగానే ఈవీయంల పేరుతో జాతీయస్థాయిలో కుట్రలకు పాల్పడుతూ రాష్ట్ర పరువును బజారుకీడ్చుతున్నాడని విమర్శించారు. డబ్బు, అధికార దుర్వినియోగం, హత్యా రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు దుర్మార్గపు ఆలోచలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని, అయినా అధికారంలోకి వస్తామని చంద్రాబు కోతలు కోస్తూ మభ్యపెడుతున్నాడని తెలిపారు. ఐదేళ్ల నుంచి చంద్రబాబు అక్రమంగా అవినీతితో సంపాదించిన సొమ్ముతో పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులు మరో ఐదు కట్టవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అగ్రవర్ణ పేదలు మోదీ వైపు అగ్రవర్ణ పేదలకు పది శాతం విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించడంతో నరేంద్రమోదీ కేంద్రంలో మరొకసారి ప్రధాని అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. అగ్రవర్ణాలతో పాటు ఇతర వర్గాలు కూడా మోదీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకొంటున్నారని చెప్పారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకై ఉద్యమిస్తున్న వివిధ రాష్ట్రాలలోని సంఘాలతో కలసి గత పది రోజులుగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలలో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. -
వైఎస్సార్సీపీకే మద్దతు
సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్): అగ్రవర్ణ పేదలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. అగ్రవర్ణాల్లోని రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ తదితర వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని వైఎస్సార్సీపీ తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం హర్షించదగ్గ పరిణామమని తెలిపారు. ఎన్నికల ప్రణాళికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతూ ప్రతి అంశాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయ మన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అగ్రవర్ణాలను ఆదుకుంటామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నా తదనంతరం పూర్తిగా విస్మరించి కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకున్నాడని కరుణాకర్‌రెడ్డి గుర్తు చేశారు. -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై 17న జాతీయ సదస్సు
హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన పేదల(ఈడబ్ల్యూఎస్) కోసం తెచ్చిన రిజర్వేషన్ల అమలు కోసం ఈ నెల 17న జైపూర్‌లో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చట్టబద్ధత చేసి 2 నెలలు అవుతున్నా.. అనేక రాష్ట్రాలు ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం మిగిలిన అగ్రవర్ణాలకు 5 శాతం కల్పిస్తామని ప్రకటించి రిజర్వేషన్ల అమలుకు గండికోట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పటివరకు ఓసీ రిజర్వేషన్ల అమలుపై నిర్లక్ష్యం వహిస్తూ పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. నిరుపేదల ఓసీల రిజర్వేషన్లు కేవలం 14 రాష్ట్రాలే ఇప్పటివరకు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలు చేసేలా ఒత్తిడి చేస్తూ లక్నో, ఫరీదాబాద్, బెంగుళూరు, భోపాల్ తదితర నగరాల్లో జాతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణలకు చెందిన బీజేపీ నాయకులు గ్రూపు తగాదాలతో సతమతం అవుతూ రిజర్వేషన్ల అమలు కోసం గవర్నర్, సీఎంలకు విజ్ఞప్తులు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఓసీలకు కల్పించిన రిజర్వేషన్లను తెలుగు రాష్ట్రాలతోపాటు మిగతా రాష్ట్రాల్లో తక్షణం అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
‘రెడ్డి నేతలను అణచివేసేందుకు కుట్రలు’
సాక్షి, హైదరాబాద్: రెడ్డి సామాజిక వర్గ నేతలను అణచి వేసేందుకు రాజకీయ పార్టీలన్నీ కుట్రలు పన్నుతున్నాయని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ..రెడ్డి వర్గానికి చెందిన నేతలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతున్నారనే కోపంతో పార్టీలు అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నాయని తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, ప్రతాప్రెడ్డిలపై కేసులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఐటీ దాడులు జరిగాయని కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఇప్పటివరకు టికెట్ హామీ లభించకపోవడం శోచనీయమన్నారు. మహాకూటమి అధ్యక్షుడిగా, సీఎం అభ్యర్థిగా రెడ్డి నేతను ప్రకటించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఓసీ సమస్యలను అన్ని పార్టీలు తమ ఎన్నిక ప్రణాళికలో చేర్చి ప్రధాన ఎజెండాగా పరిగణించడం హర్షణీయమని ఆయన తెలిపారు. -
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ చేయాలని ఓసీ సంక్షేమ సంఘం నేత జి.కరుణాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆదాయ పరిమితికి లోబడి రిజర్వేషన్లు కల్పించాలని, అన్ని రాజకీయపార్టీలు తమ ఎజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికి పైగా ఉన్న అగ్రవర్ణ పేదలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న మేజర్ జనరల్ సిన్హా నివేదికను తక్షణమే ఆమోదించాలని పేర్కొన్నారు. అగ్రవర్ణ పేదలకు కూడా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. జాతీయ స్థాయిలో రూ.లక్ష కోట్లు కేటాయించి జాతీయ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని, రిజర్వేషన్ల ఉద్యమాలు తగ్గుతాయని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పట్టించుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు. -
ఓసీల సమస్యలపై జాతీయ ఉద్యమం
- ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి మదనపల్లె(చిత్తూరు) ఓసీల సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కార్యాచరణ ప్రణాళిక ప్రకటించకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాల నిర్లక్ష్యంలో దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల ఉద్యమాలు ఉధృతమవుతున్నాయన్నారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అంటూ రాజకీయ నాయకులు అగ్రవర్ణాల ద్వితీయ శ్రేణి పౌరులుగా పరగణించడం వల్ల ఓసీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రకులలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌చేశారు. ఓసీల అభివృద్ధికి జాతీయస్థాయిలో లక్ష కోట్లు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటుచేస్తే ఆర్థిక అసమానతలు అంతరించి రిజర్వేషన్లు, ఉద్యమాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని కరుణాకర్‌రెడ్డి సూచించారు. రాజ్యాంగపరంగా విద్య, ఉద్యోగ, రిజర్వేషన్లు యాభైశాతం అమలుకాగా, జనరల్ కేటగిరీలో కూడా ఇతర వర్గాలవారు ఎంపిక అవుతున్నందున ఓసీలుగా పిలువబడే అగ్రవర్ణాలకు 10 శాతం విద్య, వైద్య ఉద్యోగ అవకాశాలు కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలను విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ర్ట అధ్యక్షులు ఓంప్రకాష్, రెడ్డిజన సంక్షేమ సంఘం సమన్వయకర్త రామ్మోహన్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వేమనారాయణ రెడ్డి, అవుల సిద్దారెడ్డి, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలి
ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల కోసం సత్వరమే రాజ్యాంగ సవరణ చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఫరీదాబాద్‌లో ‘ఆలిండియా యాంటీ రిజర్వేషన్ ఫ్రంట్’ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. సామాజిక వివక్షత అంతరించి అర్థిక వివక్షత కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
‘ఇతర ఓసీ కులాలూ పటేళ్ల తరహాలో ఉద్యమిస్తాయి’
హైదరాబాద్: ఓసీ కులస్థుల సమస్యలు పరిష్కరించకపోతే గుజ్జర్లు, జాట్లు, పటేల్ తరహా ఉద్యమం చేపడుతామని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. బుధవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకై వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ఉద్యమాలు ఉధృతం కాకముందే... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కోరారు. నిరుపేద ఓసీల సమస్యలపై ఈ నెల 9వ తేదీన ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని, అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకై రాజ్యాంగ సవరణ చేయకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు కోట్ల మందికి పైగా గల అగ్రవర్ణ పేదలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న కమిటీ నివేదికలను ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. సామాజిక వివక్షత అంతరించి, ఆర్థిక వివక్షత కొనసాగుతన్న నేపధ్యంలో ఆర్థిక వెనుకబాటును పరిగణలోకి తీసుకుని అన్ని వర్గాల వారికి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కరుణాకర్‌రెడ్డి కోరారు. ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు ప్రమోద్ భాటియ, సుశీల్ కౌర్, మోహన్‌రెడ్డి, కార్తికేయన్, అనంతరెడ్డి, శ్రీనాధశర్మ, విక్రాంత్, మధుసూదన్ రెడ్డి, ప్రశాంతి, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
సమాజ హితంతో ముందుకెళ్దాం
ఓసీ సంక్షేమ సంఘం ఐకమత్యమే మన బలం పేద విద్యార్థులకు అండగా నిలుద్దాం సాక్షి, హైదరాబాద్: సమాజ హితమే రెడ్ల లక్షణమని, అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయన్ని కొనసాగిద్దామని హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి అన్నారు. ఓసీ సంక్షేమ సంఘం, రెడ్డి ఐక్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో వివిధ రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైన రెడ్డిజన లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి సభ్యులకు ఆత్మీయ అభినంద సభ నిర్వహించారు. ఈ సం దర్భంగా నాయిని మాట్లాడుతూ అన్ని వర్గాలవారు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. ఓసీల్లోనూ పేదలకు అండగా నిలుద్దామన్నారు. ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ అందరికీ సామాజిక న్యాయం జరగాల్సి ఉందన్నారు. ఒకప్పుడు బాగున్న ఓసీలు.. రిజర్వేషన్లు లేక ఇబ్బందులు ఎదుక్కొంటున్నారన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ గతం ఘనం గా, భవిష్యత్తు ఆందోళనకరంగా ఉందని చెప్పా రు. అనంతరం రెడ్డి ప్రజాప్రతినిధులందరినీ సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, తెలంగాణ మంత్రు లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఏపీ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, సి. రామచంద్రారెడ్డి, వై. సాయిప్రసాద్ రెడ్డి, వై. బాలనాగిరెడ్డి, బి.రాజేంద్రనాథ్ రెడ్డి, బి. రాజశేఖర్‌రెడ్డి, జి. శ్రీకాంత్ రెడ్డి, ఆర్.ప్రతాప్ రెడ్డి, జె.వెంకటరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి. కరుణాకర్‌రెడ్డి, హోలిమేరీ, నలందా గ్రూఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఎ.వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓసీ సంఘం మహిళా అధ్యక్షురాలిగా సౌమ్యారెడ్డి
హైదరాబాద్: ఓసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కర్ర సౌమ్యారెడ్డి నియమితులయ్యారు. గురువారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సౌమ్యారెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. సౌమ్యారెడ్డి మాట్లాడుతూ అగ్రవర్ణ పేదల సమస్యలపై రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు.