హైదరాబాద్: ఓసీ కులస్థుల సమస్యలు పరిష్కరించకపోతే గుజ్జర్లు, జాట్‌లు, పటేల్ తరహా ఉద్యమం చేపడుతామని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. బుధవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకై వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ఉద్యమాలు ఉధృతం కాకముందే... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కోరారు. నిరుపేద ఓసీల సమస్యలపై ఈ నెల 9వ తేదీన ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని, అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకై రాజ్యాంగ సవరణ చేయకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు కోట్ల మందికి పైగా గల అగ్రవర్ణ పేదలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న కమిటీ నివేదికలను ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు.
సామాజిక వివక్షత అంతరించి, ఆర్థిక వివక్షత కొనసాగుతన్న నేపధ్యంలో ఆర్థిక వెనుకబాటును పరిగణలోకి తీసుకుని అన్ని వర్గాల వారికి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కరుణాకర్‌రెడ్డి కోరారు. ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు ప్రమోద్ భాటియ, సుశీల్ కౌర్, మోహన్‌రెడ్డి, కార్తికేయన్, అనంతరెడ్డి, శ్రీనాధశర్మ, విక్రాంత్, మధుసూదన్ రెడ్డి, ప్రశాంతి, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
‘ఇతర ఓసీ కులాలూ పటేళ్ల తరహాలో ఉద్యమిస్తాయి’
Published Wed, Sep 2 2015 8:05 PM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM
Advertisement