జి.కరుణాకర్ రెడ్డి
హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన పేదల(ఈడబ్ల్యూఎస్) కోసం తెచ్చిన రిజర్వేషన్ల అమలు కోసం ఈ నెల 17న జైపూర్‌లో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చట్టబద్ధత చేసి 2 నెలలు అవుతున్నా.. అనేక రాష్ట్రాలు ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం మిగిలిన అగ్రవర్ణాలకు 5 శాతం కల్పిస్తామని ప్రకటించి రిజర్వేషన్ల అమలుకు గండికోట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పటివరకు ఓసీ రిజర్వేషన్ల అమలుపై నిర్లక్ష్యం వహిస్తూ పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు.
నిరుపేదల ఓసీల రిజర్వేషన్లు కేవలం 14 రాష్ట్రాలే ఇప్పటివరకు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలు చేసేలా ఒత్తిడి చేస్తూ లక్నో, ఫరీదాబాద్, బెంగుళూరు, భోపాల్ తదితర నగరాల్లో జాతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణలకు చెందిన బీజేపీ నాయకులు గ్రూపు తగాదాలతో సతమతం అవుతూ రిజర్వేషన్ల అమలు కోసం గవర్నర్, సీఎంలకు విజ్ఞప్తులు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఓసీలకు కల్పించిన రిజర్వేషన్లను తెలుగు రాష్ట్రాలతోపాటు మిగతా రాష్ట్రాల్లో తక్షణం అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment