సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ చేయాలని ఓసీ సంక్షేమ సంఘం నేత జి.కరుణాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆదాయ పరిమితికి లోబడి రిజర్వేషన్లు కల్పించాలని, అన్ని రాజకీయపార్టీలు తమ ఎజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికి పైగా ఉన్న అగ్రవర్ణ పేదలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న మేజర్ జనరల్ సిన్హా నివేదికను తక్షణమే ఆమోదించాలని పేర్కొన్నారు.
అగ్రవర్ణ పేదలకు కూడా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. జాతీయ స్థాయిలో రూ.లక్ష కోట్లు కేటాయించి జాతీయ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని, రిజర్వేషన్ల ఉద్యమాలు తగ్గుతాయని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పట్టించుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు.