
సాక్షి, తిరుపతి: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ప్రధాని మోదీ ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి సోమవారం ఉదయం 9 గంటలకు మహాద్వారం వద్దకు చేరుకోగా, అర్చకులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి, వేదపండితులు ఆలయ మర్యాదలతో వేదమంత్రోచ్ఛారణ నడుమ ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
మహాద్వారం నుంచి ఆలయంలోనికి ప్రవేశించిన ప్రధాని ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం బంగారు వాకిలి ద్వారా గర్భగుడిలోకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వైభవం, ప్రాశస్త్యం గురించి ప్రధానికి ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. ఆలయ జీయర్లు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం వకుళామాతను ప్రధాని దర్శించుకున్నారు.
అక్కడి నుంచి విమాన ప్రాకారం మీదుగా విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఆ తర్వాత వెండివాకిలి మీదుగా వెలుపలకు వచ్చిన ప్రధాని ధ్వజస్తంభాన్ని మొక్కారు. అనంతరం రంగనాయక మండపంలో ప్రధానికి వేద పండితులు ఆశీర్వచనం పలకగా, భూమన కరుణాకరరెడ్డి, ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, టీటీడీ 2024 క్యాలెండర్, డైరీ, పంచగవ్యాలను అందజేశారు.
అక్కడి నుంచి అతిథి గృహానికి చేరుకున్న ప్రధాని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం అల్పాహారాన్ని స్వీకరించారు. ప్రధాని నరేంద్రమోదీ శ్రీవారిని దర్శించుకోవడం ఇది నాలుగోసారి. కాగా, తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా 140 కోట్ల మంది భారతీయులకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి కలగాలని తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రార్థించానని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు.
ప్రధానికి సాదర వీడ్కోలు
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డుమార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరివెళ్లారు. విమానాశ్రయంలో మోదీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment