
అంబర్‌పేట: అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల (ఈడబ్ల్యూఎస్)ను తెలుగు రాష్ట్రాల్లో తక్షణమే అమలు చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఈడబ్ల్యూఎస్ తెలుగు రాష్ట్రాల సాధన సమితి ఆధ్వర్యంలో ఓసీ ప్రజలసాధన సదస్సు నిర్వహించారు. కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టి ఏడాది పూర్తవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయకపోవడం దారుణమన్నారు. బిల్లు అమలు చేయకపోవడంతో అగ్రవర్ణాల పేదలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ అమలు చేయకపోతే రెడ్డి, కమ్మ, వెలమ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణ కులాల ప్రతినిధులతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అవసరమైతే ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో పలు అగ్రకుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.