సాక్షి, హైదరాబాద్: అగ్ర కుల పేదలకు శుభవార్త. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2–3 రోజుల్లోనే దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయనున్నట్లు గురువారం తెలిపారు. దీనితో రాష్ట్రంలో సైతం విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ అమల్లోకి రానుంది. ఈ మేరకు విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసి ప్రకటించనుంది.
మొత్తం 60% రిజర్వేషన్లు: ‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు వాటిని యథాతథంగా కొనసాగిస్తూనే ఈడబ్ల్యూఎస్ వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కలిపితే మొత్తం 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
(చదవండి: చార్జీలు పెంచకుంటే బస్సు గట్టెక్కదు)
రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం వారికే..!
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అగ్ర కుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా 2019 జనవరిలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు గల అగ్ర కులాల పేదలకు ఈ రిజర్వేషన్లను వర్తింపజేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు మినహా ఇతర జనరల్ కేటగిరీ పేదలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో మాత్రమే 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా అనుమతిస్తూ వస్తోంది. చదవండి: (పదవులు కాదు.. పార్టీ శాశ్వతం: కేటీఆర్)
భారీ సంఖ్యలో ఎంబీబీఎస్ సీట్లు కలిగిన గాంధీ, ఉస్మానియా వంటి వైద్య కళాశాలల్లో సైతం ఇప్పటివరకు ఈ కోటా అమలుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే రాష్ట్రంలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను సంపూర్ణంగా అమలు చేయాలని అగ్ర కుల పేదలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఇకపై అన్ని రకాల ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో సైతం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రాష్ట్రంలో కూడా రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికే రిజర్వేషన్లు వర్తించే అవకాశాలు ఉన్నాయి.
అగ్ర కుల పేదలకు 5 వేల పోస్టులు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో తక్షణమే 50 వేల పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ పోస్టుల్లో 10 శాతం అంటే 5 వేల పోస్టులు.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అగ్ర కుల పేదలకు రిజర్వు కానున్నాయి. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ సహా ఇతర అన్ని రకాల కోర్సుల్లో 2020–21 విద్యా సంవత్సరానికి ఆడ్మిషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఆయా కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం రిజర్వేషన్లు అమలు కానున్నాయి.
(చదవండి: కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్)
Comments
Please login to add a commentAdd a comment