సాక్షి, హైదరాబాద్: ఉగాది తర్వాత ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ ధర్నా చేయనుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆయన సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్‌ఎల్పీలో చర్చ జరిగిందని తెలిపారు. పంజాబ్ తరహాలో కేంద్రం.. తెలంగాణ వరి ధాన్యం 100 శాతం కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం తీరుపై టీఆర్‌ఎస్‌ఎల్పీలో చర్చించామని చెప్పారు. టీఆర్‌ఎస్ చేపట్టే రైతు ధర్నాకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆహార ధాన్యాల సేకరణలో దేశం మొత్తం ఒకే పాలసీ ఉండాలన్నారు.
రాష్ట్రానికో విధానం పెట్టడం సరికాదన్నారు. 30 లక్షల ఎకరాల వరి ధాన్యం సేకరించాల్సి ఉందని తెలిపారు. కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. రెండు, మూడేళ్లకు ఆహార నిల్వలు ఎప్పుడూ కేంద్రం సిద్ధంగా ఉంచాలని అన్నారు. వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్‌మెంట్ ఎందుకు ఉండదు? అని సూటిగా ప్రశ్నించారు. చాలా విషయాల్లో కేంద్రం ఒకే విధానం అంటోందని తెలిపారు.
ధాన్యం విషయంలో మాత్రం కేంద్రానికి ఒక విధానం లేదని మండిపడ్డారు. పంజాజ్, హర్యానాలో వందశాతం ధాన్యం సేకరిస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. కేంద్రం సహకారం లేకున్నా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కేంద్రం ధాన్యం సేకరణ విషయంలో కుంటి సాకులు చెబుతోందని అన్నారు. మంత్రులు, ఎంపీలు రేపు ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కలుస్తారని అన్నారు.
తెలంగాణ ఉద్యమం తరహాలో కేంద్రంపై పోరాటం చేస్తామని కేసీఆర్ తెలిపారు. రేపు గ్రామ, మండల, జిల్లా, మున్సిపాలిటీల్లో తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తామని తెలిపారు. సమాజాన్ని విభజించే రాజకీయాలు తెలంగాణలో జరుగుతున్నాయని అన్నారు. యూపీలో బీజేపీ బలం తగ్గుతుందని చెప్పా.. అదే జరిగిందని తెలిపారు. ఎనిమిదేళ్లు దాటింది.. ఇక వీళ్లు(బీజేపీ) చేసిందేమీ లేదని తేలిపోయిందని మండిపడ్డారు. పంజాబ్‌లో రైతుల ఆగ్రహం కనిపించిందని అన్నారు. గతంలో యూపీఏ కంటే ప్రస్తుతం బీజేపీ దుర్మార్గమైన పాలన చేస్తోందని మండిపడ్డారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు ఎందుకు కశ్మీర్ ఫైల్స్? ఇది విభజన కాదా? ఓట్ల కోసం ఇంత అవసరమా? అని నిలదీశారు.
తెలంగాణ ప్రజలతో కేంద్రం పెట్టుకోవద్దు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సెలవులు ఇచ్చి కశ్మీర్ ఫైల్స్ సినిమా చూపిస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన పరిస్థితి అని మండిపడ్డారు. పలు విభాగాల్లో దేశం తిరోగమనంలో ప్రయాణిస్తోందని తెలిపారు. బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని అన్నారు. అయితే డీమానిటైజ్.. లేదంటే మానిటైజ్.. ఇదీ బీజేపీ పరిస్థితి అని ఎద్దేవా చేశారు. 15 లక్షల ఖాళీలను కేంద్రం వెంటనే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్లపై కేంద్రం స్పందన లేదని దుయ్యబట్టారు. బీసీ కులగణనను కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజల్లో విద్వేషాలు, ఉద్వేగాలను బీజేపీ రెచ్చగొడుతోంది.. ఇది సమంజసం కాదని మండిపడ్డారు. బీజేపీ హయాంలో బ్యాంకుల దోపిడీ బాగా పెరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రజలతో కేంద్రం పెట్టుకోవద్దని హెచ్చరించారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95-105 సీట్లు గెలుస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment