సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోని వివిధ కోర్సుల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం ప్రత్యేక కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ప్రత్యేక కోటా అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచించింది. ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న వారికి ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కొద్ది రోజుల్లోనే అడ్మిషన్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం సీట్లను భర్తీ చేయాల్సి ఉందని, అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలని విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యా మండలి సూచించింది.
10 శాతం అదనంగా సీట్లు
ఈ రిజర్వేషన్ల అమలుకు గాను ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్లలో 10 శాతం సీట్లను కేటాయించడం కాకుండా, అదనంగా 10 శాతం సీట్లను సృష్టిస్తారు. ఈ సీట్లను కన్వీనర్ కోటా కింద అర్హులైన ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు కేటాయిస్తారు. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే 10 శాతం సీట్లు పెంచి ఈ కోటా కింద భర్తీ చేస్తారు. అయితే సాధారణ ఎంఏ, ఎమ్‌కాం, సాధారణ డిగ్రీ కోర్సుల్లో ఇప్పటికే ఉన్న సీట్లు భర్తీ కావడం లేదనీ, అందువల్ల ఈ కోర్సులకు ప్రత్యేక కోటాను సృష్టించినా ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని ఉన్నత విద్యా మండలి వర్గాలు అంటున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్, డిమాండ్ ఉన్న ఇతర పీజీల వంటి కోర్సుల్లో ఈ కోటాకు విలువ ఉంటుందని చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment