సాక్షి, హైదరాబాద్: అగ్రకుల పేదలకు శుభ వార్త. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆర్థికంగా వెనక బడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ల కోసం దరఖాస్తు చేసుకొనే వారి నుంచి ఆస్తుల వివరాలు, వాటిపై స్వీయ ధ్రువీకరణ (డిక్లరేషన్) స్వీకరించకుండానే ధ్రువపత్రం జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు నమూనా నుంచి ఈ స్వీయ ధ్రువీకరణను తొలగించాలని మీ–సేవను ఆదేశించింది.
ఆస్తుల వివరాల విభాగం కింద వ్యవసాయ భూములు, నివాస గృహాలు, నివాస స్థలాలకు సంబంధించిన సమగ్ర వివ రాలను ఇవ్వాల్సి ఉండగా దరఖాస్తు నమూ నా నుంచి ఈ విభాగాన్ని సైతం తొలగిం చాలని సూచించింది. ప్రస్తుత దరఖాస్తు విధా నంలో ఐదెకరాలు, ఆపై పొలం.. 1,000 చద రపు అడుగులు, ఆపై విస్తీర్ణంలో నివాస స్థలం... పురపాలికల్లో 100 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస గృహం... గ్రామాల్లో 200 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస గృహంలో ఏదీ లేదని దరఖాస్తుదారులు స్వీయ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంది.
కానీ ఇక పై కుటుంబ ఆదాయం రూ. 8 లక్షల్లోపు ఉం దని స్వీయ ధ్రువీకరణ ఇస్తే సరిపోనుంది. ఐదెకరాలు, ఆపై పొలం, నివాస గృహం, నివాస స్థలాలేవి లేవని డిక్లరేషన్ ఇచ్చినట్లు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌లో ప్రస్తుతం పొందు పరుస్తుండగా ఇకపై దీన్ని కూడా తొలగిం చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్ సోమేశ్ కుమార్ గురువారం మీ– సేవ విభాగం కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
గతేడాది జారీ చేసిన జీవో నంబర్ 33 అమలు కోసం ఈ మేరకు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వ కొలువులతోపాటు రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో 10 శాతం ఈడ బ్ల్యూఎస్ కోటా కోసం దరఖాస్తు చేసుకొనే వారికి ఈ నిర్ణయంతో లబ్ధి కలగనుంది.
కేంద్రంలో కోటాకు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే..
కేంద్ర ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకొనే వారు మాత్రం ఆస్తుల వివరాలతోపాటు వాటిపై స్వీయ ధ్రువీకరణను యథావిధిగా ఇవ్వాల్సి ఉండనుంది. సీఎస్ సోమేశ్ కుమార్ తాజా ఆదేశాల ప్రకారం ఈడబ్ల్యూఎస్ ఉద్దేశం (పర్పస్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్) అనే కొత్త కాలమ్‌ను మీ–సేవా దరఖాస్తులో చేర్చనున్నారు. కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారా లేక రాష్ట్ర ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారా?
అనే రెండు ఐచ్ఛికాలు ఈ కాలమ్‌లో ఉండనున్నాయి. వాటిలో ఒక దాన్ని దరఖాస్తుదారులు ఎంపిక చేసుకోవాల్సి ఉండనుంది. ఒకవేళ కేంద్ర ఈడబ్ల్యూఎస్ కోటా కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుత దరఖాస్తు, సర్టిఫికెట్ నమూనాల్లో ఎలాంటి మార్పులుండవు. రాష్ట్ర ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకుంటే మాత్రం దరఖాస్తు, సర్టిఫికెట్ నమూనాలో పైన పేర్కొన్న మార్పులు అమల్లోకి రానున్నాయి. కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ కోటాకు జారీ చేసే సర్టిఫికెట్లలో మాత్రం ఈ మేరకు డిక్లరేషన్ ఇచ్చారన్న విషయాన్ని యథాతధంగా పొందుపర్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment