
తిమ్మక్క చేతిలో చిల్లిగవ్వ లేదు. అయితే ఆమె చేతిలో.. భారత ప్రభుత్వం ఇచ్చిన నేషనల్ సిటిజన్ అవార్డు ఉంది. ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు ఉంది. మాతా శిశుసంరక్షణ కేంద్రం ఇచ్చిన గౌరవ సర్టిఫికెట్ ఉంది. ఇవేవీ ఆమెకు గుప్పెడు తిండి గింజల్ని ఇవ్వలేకపోయాయి. అందుకే తిమ్మక్క.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తనకిచ్చిన అవార్డును తిరస్కరించింది.
‘సాలుమరడ’ తిమ్మక్క వయసు 105. కర్ణాటకలో ఆమె పెంచిన మర్రిచెట్లు ఎనిమిది వేలకు పైమాటే! తిమ్మక్క కర్ణాటక మాగడి తాలూకా హులికల్ అనే చిన్న గ్రామంలో జన్మించింది. బాల్యంలోనే పశువులను కాసే చిక్కయ్యను వివాహమాడింది. రాళ్లు కొడుతూ, భూమి దున్నుతూ జీవనం గడిపారు ఈ దంపతులు. దురదృష్టవశాత్తు వారికి సంతానం కలగలేదు. తిమ్మక్క ఏ మాత్రం కుంగిపోలేదు. తన జీవితాన్ని చెట్ల పెంపకానికి అంకితం చేసింది. భర్తతో కలిసి ఊరికి దగ్గరలో కుదూర్ రోడ్డుకి ఇరుపక్కలా మర్రి విత్తనాలు నాటుతూ, వాటిని సొంత పిల్లల్లా సాకడం ప్రారంభించింది.
తను తిన్నా తినకున్నా వాటిని మాత్రం ఏళ్లుగా సంరక్షిస్తూనే ఉంది. ఇప్పటికీ మొక్కలు నాటుతూనే ఉంది. చెట్ల మొక్కలు నాటడం వల్లే ఆమెకు సాలుమరడ (చెట్ల వరుస) అని పేరు వచ్చింది. తిమ్మక్క చేసిన పర్యావరణ పరిరక్షణ సేవలకు గుర్తింపుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. అయితే ఇన్ని అవార్డులు సంపాదించుకున్న తిమ్మక్కకు ప్రభుత్వం ఆర్థికంగా ఒక్క సహాయమూ చేయలేదు.
ప్రభుత్వం నుంచి రావలసిన సహాయం కూడా సమయానికి అందకపోగా, వెళ్లి అడిగినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల ప్రభుత్వం అవార్డును ఇవ్వబోతే,‘‘నేను దళితురాలిని అనే ఉద్దేశంతో నాకు అవార్డు ఇవ్వొద్దు. ప్రతివారు మెడల్స్, బహుమతులు ఇస్తారే కాని, ఒక్కరూ నాకు డబ్బు ఇవ్వాలని ఎందుకు అనుకోలేదో నాకు అర్థం కావట్లేదు’’ అని ఆవేదనగా అంది తిమ్మక్క.
– డా. వైజయంతి
Comments
Please login to add a commentAdd a comment