
న్యూఢిల్లీ: వాయు కాలుష్యం, గాలి దుమారాల కట్టడికి ఢిల్లీ హరిత బాట పట్టింది. నగరం చుట్టూ రెండేళ్లలో 31 లక్షల మొక్కలు నాటేందుకు శనివారం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ అధికారి తెలిపారు. ఢిల్లీకి పొరుగు రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ సరిహద్దుల వెంట ఆరావళి, యమునా అటవీ ప్రాంతాల చుట్టూ మొక్కలతో హరిత వలయాన్ని ఏర్పాటుచేయనున్నారు.
కాలుష్యానికి కారణమవుతున్న ధూళి రేణువులను మొక్కలతో అడ్డుకుని, ఏటా రాజస్తాన్ నుంచి వస్తున్న గాలి దుమారాల నుంచి ఢిల్లీని కాపాడటమే లక్ష్యంగా ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం తగిన పరిశోధనలు చేసి, పొడవైన, దట్టమైన ఆకులతో కూడిన మొక్కలను ఎంచుకున్నారు. ధూళి రేణువులు గాల్లోకి లేవకుండా నిరోధించే వేప, మర్రి, ఉసిరి, రావి, జామ తదితర మొక్కలను నాటనున్నారు. 24 గంటలు ఆక్సిజన్ విడుదల చేసే రావి మొక్కలకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ 21 లక్షలు, అటవీ శాఖ 4 లక్షలు, మునిసిపల్ కార్పొరేషన్లు 4 లక్షలు, ఎడీఎంసీ 3 లక్షల చొప్పున మొక్కలు నాటనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment