YS జగన్ Speech At Vana Mahotsavam | Dokiparru Village | Guntur | AP CM YS Jagan Mohan Reddy - Sakshi
Sakshi News home page

అందరూ తోడుగా నిలవాలని కోరుతున్నా : సీఎం జగన్‌

Published Sat, Aug 31 2019 12:56 PM | Last Updated on Sat, Aug 31 2019 5:34 PM

CM YS Jagan Speech At VanaMahotsava Program In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : పర్యావరణ రక్షణ కోసం ప్రభుత్వంతో పాటు అదరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. నీరు, నేల, నింగి, గాలి వీటంన్నిటిని కూడా కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిది అని పిలుపునిచ్చారు. విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని కోరారు. అడవుల సంఖ్య ఏటేటా తగ్గిపోతుందని, వీటిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం జగన్‌ శనివారం గుంటూరు జిల్లా డోకిపర్రు గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాలుపంచుకొని ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. సీఎం జగన్‌ ఇంకా ఎమన్నారంటే.. 

(చదవండి : వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌)

అందుకే అశోకుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు
‘మనం నాటే ప్రతి మొక్కభూమాతకు మేలు చేస్తుంది. మనం పెంచే ప్రతి చెట్టు తరువాతి తరానికి కూడా వీటి ఫలాలను ఇస్తుంది. మాములుగా మనిషి బతకాలంటే ఆక్సిజన్‌ కావాలి. అటువంటి ఆక్సిజన్‌ ఇచ్చే ఏకైక ప్రాణి ఒక్క చెట్టు మాత్రమే. ఈ సృష్టిలో బ్యాలెన్స్‌గా ఉండాలంటే చెట్లు బలంగా ఎదగాలి. రాష్ట్ర భూభాగంలో 37,258 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో 23 శాతం మాత్రమే అడువులు ఉన్నాయి. ఇందులో 13 శాంక్షరీలు, మూడు నేషనల్‌ పార్కులు, రెండు జులాజికల్‌ పార్కులు, ఒక టైగర్‌ రిజర్వ్‌, ఒక ఎనుగు రిజర్వ్‌ అడవులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ మన రాష్ట్రంలో ఉన్నాయి కదా అని గొప్పగా ఫీల్‌ కావాలా? లేక మొత్తం భూభాగంలో మూడింతల్లో ఒక భాగం అడవులు ఉండాలని జాతీయ అడవుల విధానం చెబుతున్నప్పుడు 33 శాతం ఉండాల్సిన అడవుల్లో మన రాష్ట్రంలో కేవలం 23 శాతం మాత్రమే ఉన్నాయని భాధపడాలో ఆలోచించుకోవాలి.అశోకుడి గురించి మనం వింటుంటాం. ఆయన గొప్ప చక్రవర్తి అని విన్నాం. రోడ్డుకు ఇరువైపు చెట్లను నాటించాడు కాబట్టే అశోకుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఆయన నాటించిన చెట్లు వందల సంవత్సరాలు బతికాయి, తరువాత తరాలకు మేలు చేశాయి. 

25 కోట్ల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం
పర్యావరణం బాగుంటేనే మనమంతా కూడా బాగుంటాం. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రంలో 2351 వృక్షజాతులు, 1461 జంతు జాతులు ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని జంతువులు, మొక్కలు అంతరించి పోతున్నాయి. మనం డైనోసార్స్‌ గురించి వింటుంటాం. ఇవి ఇప్పుడు కనిపించడం లేదు. ప్రపంచంలో ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే..పులులు అంతరించిపోతున్నాయి. పులుల సంఖ్య రాష్ట్రంలో కేవలం 48 మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఆరు పెరిగాయని సంబరాలు చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. వీటిని గురించి మనం పట్టించుకోవడం మానేస్తే పులులు, సింహాలు ఏవి కూడా ఉండవు. మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తూ..రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటిదాకా నాలుగు కోట్ల మొక్కలు నాటాం. ఈ ఒక్క రోజు కోటి మొక్కలు నాటబోతున్నాం. ప్రతి ఒక్కరు ఒక్క మొక్క నాటడం కాదు. ప్రతి ఒక్కరు మూడు, నాలుగు మొక్కలు నాటాలి. అప్పుడే మన రాష్ట్రాన్ని కాపాడుకోగలుతామని గుర్తు ఎరగాలి. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. గ్రామ వాలంటీర్ల చేత మొక్కల పెంపకం నాటే కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నాను. నీడనిచ్చే మొక్కలు, టేకు మొక్కలు, ఎర్రచందనం మొక్కలు 12 కోట్లు మొక్కలు నాటేందుకు అటవీ శాఖ సిద్దంగా ఉంది.

దశల వారిగా 10వేల ఎలక్ట్రిక్‌ బస్సులు తెస్తాం
ఇవాళ ఫార్మా పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాం. పరిశ్రమలు వచ్చేసమయంలో పర్యావరణానికి మేలు చేస్తుందా? అన్నది ఆలోచన చేయాలి. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును ప్రక్షళన చేయబోతున్నామని చెబుతున్నాను. ఫార్మా రంగంలో లక్ష టన్నుల కాలుష్యం వస్తుందని నా దృష్టికి వచ్చింది. కేవలం 30 వేల టన్నులు మాత్రమే ఆడిట్‌ జరుగుతుందని, మిగతాది కాల్చివేయడం, లేదా సముద్రంలో వేయడం జరుగుతుంది. పరిశ్రమల్లో ఎంత కాలుష్యం వస్తుంది. ఏ రకంగా మనం డిస్పోజ్‌ చేయాలో ఆలోచన చేయాలి. ప్రభుత్వమే బాధ్యత తీసుకోబోతోంది. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం. ఈ ఏడాది అక్షరాల ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో 100 ఎలక్ట్రసిటీ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. దశల వారిగా 10 వేల ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకొస్తాం. నీరు, నేల, నింగి, గాలి వీటంన్నిటిని కూడా కాలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వీటిని కాపాడుకుందాం’  అని సీఎం జగన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement