గ్రీన్‌.. గ్రీన్‌.. ఎవర్‌గ్రీన్‌  | Everything is ready for the plant festival Vana Mahotsavam | Sakshi
Sakshi News home page

గ్రీన్‌.. గ్రీన్‌.. ఎవర్‌గ్రీన్‌ 

Published Tue, Jul 21 2020 6:17 AM | Last Updated on Tue, Jul 21 2020 6:17 AM

Everything is ready for the plant festival Vana Mahotsavam - Sakshi

లేబాక రఘరామిరెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక అటవీ విభాగానికి చెందిన అన్ని నర్సరీలు రకరకాల మొక్కలతో కొత్త కళ సంతరించుకున్నాయి. మొక్కలు నాటే పండుగ వన మహోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ బృందం ఇటీవల ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు, కొత్తపట్నం నర్సరీలను సందర్శించింది. వాతావరణం అనుకూలించడంతో నర్సరీల్లో మొక్కలు పచ్చగా కళకళలాడుతున్నాయి. నల్లని, తెల్లని పాలిథిన్‌ సంచుల్లో లైను కట్టినట్లున్న రకరకాల మొక్కలతో నర్సరీలు కొత్త శోభ సంతరించుకున్నాయి. ఆరు కోట్లకు పైగా మొక్కలతో సామాజిక అటవీ విభాగానికి చెందిన 737 నర్సరీలు ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి. ఉద్యానవన విభాగం, ప్రయివేటు నర్సరీల్లో 6.03 కోట్ల మొక్కలు సిద్ధమయ్యాయి.

ఒక్కొక్కరు ఒక్కో మొక్క..
► గత ప్రభుత్వాలు మొక్కలు నాటి, వాటి సంరక్షణ గురించి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నాటిన ప్రతి మొక్కను బిడ్డలా సంరక్షించి చెట్టుగా మారేలా చూడాలని సీఎం జగన్‌ ఆదేశిం చారు. దీంతో  ప్రభుత్వం ‘ఒక్కొ క్కరు ఒక్కో మొక్క’ నాటి సం రక్షించాలనే నినాదం తెచ్చింది. 
► పచ్చదనం పెంపునకు గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల సేవలను ప్రణాళికా బద్ధంగా వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
​​​​​​​► అన్ని రకాల రహదారులు, విద్యా సంస్థలు, పారిశ్రా మిక సంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటుతారు. 

33% గ్రీన్‌ కవర్‌ లక్ష్యం
​​​​​​​► పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజం కోసం ఇప్పటికే దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘ఆన్‌లైన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫాం’ అమల్లోకి తెచ్చిన సీఎం జగన్‌ ఇప్పుడు పచ్చదనం పెంపుపై దృష్టి పెట్టారు. 
​​​​​​​► జాతీయ అటవీ విధానం ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం గ్రీన్‌ కవర్‌ (పచ్చదనం) సాధన లక్ష్యంగా ముందుకెళ్లాలన్న సీఎం మార్గనిర్దేశం మేరకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 
​​​​​​​► రాష్ట్ర అటవీ శాఖ నోడల్‌ ఏజెన్సీగా అటవీ శాఖతో పాటు 29 ప్రధాన శాఖలు ఈ ఏడాది 20 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, వన సంరక్షణ సమితుల ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.
​​​​​​​► రాష్ట్రంలో 1,62,968 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం ఉంది. ఇందులో 37,258 చదరపు కిలో మీటర్ల (మొత్తం భూభాగంలో 23 శాతం) మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దీంతో పాటు అడవి వెలుపల మూడు శాతం చెట్లు ఉన్నాయి. 

నాలుగు రకాల ప్లాంటేషన్లు
ఎవెన్యూ ప్లాంటేషన్‌: జాతీయ రహదా రులు, రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రహదారులు తదితర చోట్ల మొక్కలు పెంచుతారు. వేప, చింత, కానుగ, మర్రి, రావి, నిద్రగన్నేరు, బాదం, ఏడాకులపాయ, నేరేడు తదితర మొక్కలను ఈ ప్లాంటేషన్‌కు వినియోగిస్తారు.
బ్యాంక్‌ ప్లాంటేషన్‌: స్థానిక పరిస్థితులు, భూమిని బట్టి సాగునీటి కాలువల వెంబడి టేకు, సుబాబుల్, మలబార్‌ నీమ్, వేప 
తదితర మొక్కలను నాటుతారు. 
బ్లాక్‌ ప్లాంటేషన్‌: చెట్లు క్షీణించిన అటవీ ప్రాంతం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, రెవెన్యూ పోరంబోకు, దేవాలయాల 
భూములు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, పరిశ్రమలు తదితర సంస్థల ప్రాంగణాల్లో మొక్కలు నాటుతారు. ఆయా అటవీ ప్రాంతాల వాతావరణం, నేల పరిస్థితులను బట్టి మోదుగ, ఎర్ర చందనం, శ్రీగంధం, రోజ్‌ ఉడ్, నేరవేప, మద్ది, నీరుద్ది, ఏగిస తదితర మొక్కలు నాటుతారు.  
ఇళ్లు, పొలాలు: ఇళ్ల వద్ద, పొలం గట్లపైనా నాటుకోవడం కోసం అటవీ శాఖ మొక్కలు ఇస్తుంది. సాధారణంగా రైతులు టేకు, ఎర్రచందనం, శ్రీగంధం, వేప, చింత, దానిమ్మ, జామ, ఉసిరి, సపోటా తదితర మొక్కలను నాటుతారు. 

3 రకాలుగా వర్గీకరణ
​​​​​​​► పనస, మామిడి, ఉసిరి, సపోట, దానిమ్మ తదితరాలు ఫలసాయం ఇచ్చే మొక్కల జాబితాలో ఉన్నాయి.
​​​​​​​► ఎర్రచందనం, శ్రీగంధం, వేప, వేగిస, నారవేప, టేకు, రోజ్‌ 
ఉడ్‌ తదితర మొక్కలను కలప ఇచ్చేవిగా పేర్కొంటారు.
​​​​​​​► ఏడాకులపాయ, నిద్రగన్నేరు, సుబాబుల్‌ లాంటి మొక్కలను సాధారణంగా నీడ కోసం పాఠశాలల్లో నాటుతారు. 

రేపే శ్రీకారం
వన మహోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో బుధవారం ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొక్కలు నాటి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొననున్నారు.   

​​​​​​​► గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
​​​​​​​► నాటిన వాటిలో కనీసం 85 శాతమైనా బతికేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.  

ట్రీ గార్డుల ఏర్పాటు: మంత్రి పెద్దిరెడ్డి
జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో నాటే ప్రతి మొక్కను రక్షించేందుకు దాని చుట్టూ ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వనమహోత్సవం ఏర్పాట్లపై సోమవారం మంత్రి అధికారులతో సమీక్షించారు. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్, ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌ చినతాతయ్య తదితరులు పాల్గొన్నారు. 

365 రోజులూ పని..
ప్రతిరోజూ పనికెళ్తున్నా. ఏడాదిలో 365 రోజులూ నర్సరీల్లో పని ఉంటోంది. లాక్‌డౌన్లోనూ పని దొరికింది. భర్త పనికి వెళ్లకపోయినా నాకు పని ఉండటం వల్ల కుటుంబ పోషణ సజావుగా సాగుతోంది. నర్సరీలో మాకు రోజుకు రూ.200 కూలి చెల్లిస్తున్నారు. 
– కొల్లిమేర వెంకటలక్ష్మి, కూలీ, ప్రియదర్శిని  సెంట్రల్‌ నర్సరీ, ధవళేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement