AP CM YS Jagan Mohan Reddy Speech in Guntur Vana Mahotsavam 2021 - Sakshi
Sakshi News home page

చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలి: సీఎం జగన్

Published Thu, Aug 5 2021 11:21 AM | Last Updated on Thu, Aug 5 2021 4:42 PM

CM YS Jagan Speech In Vana Mahotsavam 2021 - Sakshi

సాక్షి, మంగళగిరి: రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో గురువారం ‘జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే...

ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి..
చెట్ల పెంపకానికి సంబంధించి రెండు, మూడు చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటే... అవి ఎంత అవసరమో మనకు నిరంతరం తెలుస్తుంది. ఒకటి.. మనం పీల్చే గాలి ఆక్సిజన్‌. ప్రపంచంలో ఏ జీవి అయినా  ఆక్సిజన్‌ను  పీల్చుకుని కార్బన్ ‌డై ఆక్సైడ్‌ వదిలేస్తుంది. ఒక్క చెట్టు మాత్రమే పగటి పూట కార్భన్‌ డై ఆక్సైడ్‌ తీసుకుని ఆక్సిజన్‌ను వదులుతుంది. అంటే ఒక చెట్టు ఉంటే ప్యూర్‌గా ఉన్న ఆక్సిజన్‌ లెవెల్స్‌ మెరుగ్గా ఉంటాయన్నది ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం. రెండో అంశం.. చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కూడా కురిసే పరిస్ధితి ఉంటుంది.

మనం పదో తరగితి చదువుల్లో, పరీక్షలు రాసేటప్పుడు తెలుసుకున్న విషయాలివి. ఆస్మోసిస్‌ అని, ట్రాన్సిపరేషన్, గటేషన్‌ అని రకరకాలు సిద్ధాంతాలు అన్నీ చదివాం.  చెట్లు వలన వర్షం ఎలా ప్రభావితం అవుతుంది, ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఎందుకుంటాయి అనే ఈ రెండు విషయాలును జ్ఞాపకం ఉంచుకోవాలి. చెట్లు వలన మనకు జరిగే మంచిని మనం జ్ఞాపకం పెట్టుకుంటే, చెట్లను పెంచాల్సిన అవసరం ఎప్పుడూ కనిపిస్తుంది.

చెట్ల పెంపకం–ఒక యజ్ఞం
రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలి. రాష్ట్రంలో ఈరోజు 23 శాతం మాత్రమే ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతం పెంచే దిశగా అందరం ప్రయత్నం చేయాలి. మనందరం కలిసి చెట్లను నాటి, వాటిని సంరక్షించేందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మనం,  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత తమ మనసులో ఈ ప్రతిజ్ఞ చేయాలి. చెట్లకు తోడుగా అందరం కలిసికట్టుగా ఉండి అడుగులు వేస్తే.. .మన రాష్ట్రంలో చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది.  ఇది జరగాలని కోరుకుంటున్నాను. ఈ రోజు దాదాపు 5 కోట్ల మొక్కలను నాటడానికి అటవీశాఖను పురమాయిస్తూ... ప్రతిజ్ఞతో ఈ పనికి పూనుకోవాలని అందరినీ కోరుతున్నాను. అందరినీ ప్రతిజ్ఞ చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాను. 

సభలో ప్రతిజ్ఞ చేయించిన సీఎం
ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి, ప్రకృతిలోని సమతుల్య స్ధితి అవసరాన్ని గుర్తిస్తూ... ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా, వాడవాడా, ఇంటా బయటా, అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనసా, వాచా, కర్మణా అందరం దీనికి కట్టుబడి ఉండి ఈ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని కోరుకుంటూ, మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం వైఎస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 

ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి బాలినేని
పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నాడు-నేడు పథకంలో భాగంగా స్కూళ్లు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటాలని ఆయన పిలుపు నిచ్చారు. పచ్చదనం పెంపొందించడం, అడవుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు.

‘‘ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం కల్పించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో భాగంగా మన రాష్ట్రంలో 23 శాతం ఉన్న అటవీ విస్తీరణం 33 శాతం పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. మన రాష్ట్రం అటవీ విస్తరణలో దేశంలో రెండో స్ధానంలో ఉంది, దానిని మొదటి స్ధానంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నాం. దీనికి తోడు అటవీ శాఖ జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ద్వారా వివిధ శాఖల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తున్నాం, దీంతో పాటు నాడు-నేడు కార్యక్రమం, జగనన్న కాలనీలలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం.

ప్రతీ విషయానికి ఎల్లో మీడియా దుర్మార్గంగా వక్రీకరిస్తుంది. సీఎం వైఎస్‌ జగన్‌పై ఎంత బురదచల్లినా ప్రజల మనసులో ఆయన చిరస్ధాయిగా నిలిచిపోయారు. అదే టీడీపీ ప్రభుత్వంలో కోట్లు అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించలేదు కానీ,  సీఎం జగన్‌ చేస్తోన్న అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక పచ్చ పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రతీ కార్యక్రమం కూడా చెప్పిన తేదీకే అమలు చేస్తూ పాలన సాగిస్తున్నారని’’ మంత్రి బాలినేని అన్నారు.

పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
రాష్ట్రంలో పచ్చదనం పూర్తిగా విస్తరించాలని, మొక్కలు నాటడమే కాదు, నాటిన ప్రతీ మొక్క కూడా వృక్షంలా తయారయ్యేందుకు అందరూ కృషిచేయాలని  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లేలా మనం రాష్ట్రంలో ప్రతీ రోజూ వీలైనంత మేరకు మొక్కలు నాటాలన్నారు. వాతావరణ సమతుల్యం, వాతావరణ కాలుష్యం తగ్గడానికి, ఆక్సీజన్‌ అవసరం కూడా తెలుసుకున్నాం. కాబట్టి, మొక్కలు, వృక్షాలు అనేది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మనం తలంచి మొక్కలు విరివిగా పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement