సాక్షి, అమరావతి: ‘ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని బుధవారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఆయన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉదయం 9 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి పాల్గొననున్నారు. వనమహోత్సవంలో 20 కోట్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం
జీవరాశులకు ప్రాణవాయువు అందించే మొక్కలను విరివిగా నాటడం ద్వారా చెట్ల పెంపకానికి త్రికరణ శుద్ధితో పాటుపడతామని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనుదామని రాష్ట్ర అటవీ దళాల అధిపతి ఎన్.ప్రతీప్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన ‘జగనన్న పచ్చతోరణం’ ప్రచార సామగ్రిని మంగళవారం విడుదల చేశారు.
మొక్కల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే : పెద్దిరెడ్డి
జగనన్న పచ్చతోరణంలో భాగంగా రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత కూడా ప్రభుత్వమే చేపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఈ కార్యక్రమ ప్రారంభ ఏర్పాట్లను మంగళవారం ఆయన మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి, సీఎం ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్‌లతో కలిసి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment