తొమ్మిదేళ్ల ప్రసిద్ధి సింగ్‌కి ‘డయానా అవార్డ్ 2022’ దక్కింది. ఆ అమ్మాయిని అంతా ‘ఎకో వారియర్’ అంటారు. ‘క్లయిమేట్ ఛాంపియన్’ అని కూడా. ఎందుకు? మొక్కలు నాటుతుంది. చెట్లను పెంచుతుంది. అడవులను నిర్మించాలనుకుంటోంది. ఇప్పటికి 28 పండ్లతోటలు ప్రసిద్ధి ప్రోత్సాహంతో ఊపిరి పోసుకున్నాయి. పచ్చగా లేని ప్రపంచంలో జీవించలేము అంటుంది ప్రసిద్ధి. ఈ వానాకాలంలో ప్రసిద్ధిలా ఆలోచిస్తే నాలుగు మొక్కలు కనీసం కుండీల్లో అయినా పడతాయి.
మూడేళ్ల పిల్లలు మట్టితో ఆడుకుంటారు. కాని ప్రసిద్ధి సింగ్ మొక్కలతో ఆడుకుంది. వాళ్ల నాన్న ప్రవీణ్ సింగ్ ఆ పాపను మూడేళ్ల వయసు నుంచే మొక్కలతో పరిచయం చేయించాడు. పాప చేత మొదటగా పెరట్లో నాటించింది ‘మిరప గింజల’ని. అవి మొక్కలుగా ఎదగడం చూసి ఆశ్చర్యపోయింది ప్రసిద్ధి. తండ్రి, కూతురు కలిసి దక్షిణ చెన్నై శివార్లలో ఉండే ‘మహేంద్ర వరల్డ్ సిటీ’లో ఉంటారు. దానికదే ఒక ప్రపంచం. పచ్చగా ఉండేది.
అయితే 2016లో అంటే ప్రసిద్ధికి మూడేళ్ల వయసులో వచ్చిన వర్ధా తుఫాను ఆ పచ్చదనాన్ని ధ్వంసం చేసింది. చిన్నారి ప్రసిద్ధి మీద ఆ విధ్వంసం ముద్ర వేసింది. ‘నువ్వు మొక్కలు పెంచాలి. చూడు ఎలా నాశనం అయ్యాయో’ అని తండ్రి చెప్పిన మాట పని చేసింది. అంత చిన్న వయసులో అందరు పిల్లలూ ఆడుకుంటుంటే తనకు చేతనైన మొక్కలు నాటడం మొదలెట్టింది ప్రసిద్ధి. అది మొదలు. ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.
ప్రసిద్ధి ఫౌండేషన్
‘నాకు చెట్లన్నా, తేనెటీగలన్నా, సముద్రమన్నా చాలా ఇష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా ఓటమిని అంగీకరించకు అని చెప్తాయి చెట్లు. నలుగురిని కలుపుకుని పని చెయ్ అంటాయి తేనెటీగలు. జీవితాన్ని సెలబ్రేట్ చేసుకో అని చెబుతుంది సముద్రం. అందుకే అవి నాకు స్ఫూర్తి’ అంటుంది ప్రసిద్ధి. చెట్లమీద ప్రేమతో 6 ఏళ్ల వయసులోనే ‘ప్రసిద్ధి ఫౌండేషన్’ను స్థాపించింది. ‘నా చేతుల మీదుగా లక్ష మొక్కలు నాటాలని సంకల్పించాను’ అంటుంది ప్రసిద్ధి. ఇప్పటికి ఎన్ని నాటిందో తెలుసా? 46,000. అవును... అన్ని వేల మొక్కలు ప్రసిద్ధి పూనిక వల్లే పచ్చగా తలలు ఎత్తాయి. అందుకే అందరూ ప్రసిద్ధి క్లయిమేట్ ఛాంపియన్ అంటున్నారు.
పండ్ల మొక్కలే లక్ష్యం
జపాన్‌కు చెందిన ‘అకిర మియావకి’ గొప్ప పర్యావరణవేత్త. 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సహజ అడవులను తలపించే ‘మియావకి ఫారెస్ట్’ను అతడు వృద్ధి చేశాడు. అంటే ఇందులో అన్నిరకాల చెట్లు, మొక్కలు, తీగలు ఉండి దానికదే ఒక అడవిగా మారుతుంది. దీని నుంచి స్ఫూర్తి పొందిన తాను ‘ఫూట్ ఫారెస్ట్’లను చెన్నై చుట్టుపక్కల వృద్ధి చేయాలని నిర్ణయించుకుంది.
అయితే తాను పెంచదలుచుకున్నవన్నీ స్థానిక (భారతీయ) పండ్ల మొక్కలే. ‘నాకు ఫ్రూట్ ఫారెస్ట్‌లు పెంచాలని ఎందుకు అనిపించిందంటే పండ్లు జనానికి అందుతాయి, తింటారు అని. ఇవాళ అన్ని రసాయనాల పండ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. రసాయనాలు లేని పండ్లు అందించాలి’ అంటుంది ప్రసిద్ధి. మామిడి, జామ, సపోట, నారింజ, నిమ్మ, రేగు, తాటి, సీమచింత ఇలా దేశీయంగా ఉండే పండ్ల మొక్కలు, చెట్లను పెంచడం ప్రసిద్ధి లక్ష్యం.
28 పండ్ల తోటలు
ప్రసిద్ధి పెంచుతున్న ఫ్రూట్ ఫారెస్ట్‌లను మనం పండ్ల తోటలు అనవచ్చు. ఈ తోటలు ఎలా పెంచుతుంది? ‘భాగస్వామ్యం వల్ల’ అంటుంది ప్రసిద్ధి. స్కూళ్లలో ఉన్న ఖాళీ స్థలాలు, పారిశ్రామిక సంస్థలకు ఉన్న ఖాళీ స్థలాలు, ప్రయివేటు వ్యక్తుల దగ్గర ఉన్న ఖాళీ స్థలాలు వీటిని పండ్లతోటలకు ఇమ్మని అభ్యర్థిస్తుంది. ఫౌండేషన్‌లో స్వచ్ఛందంగా పని చేయడానికి వచ్చిన కార్యకర్తలు కూడా ఈ స్థలాలను గుర్తిస్తారు. ప్రసిద్ధి ఆ యాజమాన్యాలకు లేఖలు రాస్తుంది. ‘వారిని ఒప్పించడం కష్టమే గాని పరిస్థితి వివరిస్తే ఒప్పుకుంటారు’ అంటుంది నవ్వుతూ. అంతెందుకు? ప్రసిద్ధి తాను చదువుతున్న మహేంద్ర వరల్డ్ స్కూల్‌లో వంద పండ్ల మొక్కలు నాటింది.
అవి ఎదుగుతున్నాయి. ఒకసారి స్థలం దొరికాక తన కార్యకర్తలు వెళ్లి ఫౌండేషన్ ద్వారా సేకరించిన మొక్కల్ని, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీలోని మొక్కల్ని తీసుకెళ్లి ప్రసిద్ధి ఆధ్వర్యంలో నాటుతారు. ‘మేము నాటుతాం సరే. కొందరు నీళ్లు పోయరు. కొన్నిచోట్ల నీళ్లు ఉండవు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. కొన్నిచోట్ల తోటమాలిని పెడతాం.
2021లో నాకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ దక్కితే ఆ డబ్బుతో ఒక తోటకు కంచె వేయించి బావి తవ్వించాను’ అంటుంది ప్రసిద్ధి. ప్రసిద్ధి చేస్తున్న పనికి చాలా మంది మద్దతు ఇస్తున్నారు. సహకరిస్తున్నారు. అలాగని చదువును నిర్లక్ష్యం చేయడం లేదు. ప్రసిద్ధి అనేక నగరాలకు తిరుగుతూ పర్యావరణ రంగంలో పని చేస్తున్న సంస్థలతో కలిసి ప్రకృతిని ఏదో ఒక స్థాయిలో కాపాడాలని చూస్తోంది. ఇది చదివాక మన వంతు.
మేము నాటుతాం సరే. కొందరు నీళ్లు పోయరు. కొన్నిచోట్ల నీళ్లు ఉండవు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. కొన్నిచోట్ల తోటమాలిని పెడతాం. 2021లో నాకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ దక్కితే ఆ డబ్బుతో ఒక తోటకు కంచె వేయించి బావి తవ్వించాను. – ప్రసిద్ధి సింగ్
Comments
Please login to add a commentAdd a comment