సమావేశంలో మాట్లాడుతున్న షర్మిల
మెదక్‌జోన్: యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పెట్టిన సంతకం నేడు రాష్ట్ర రైతాంగానికి మరణ శాసనంగా మారిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. శనివారం మెదక్ వచ్చిన సందర్భంగా మార్కెట్‌లోని ధాన్యాన్ని పరిశీలించిన ఆమె రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వరి వేస్తే ఉరే అని చెప్పిన సీఎం కేసీఆర్ మాటలు నమ్మిన రైతులు గతేడాదితో పోలిస్తే 17 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ఖాతాలో రూ.850 కోట్లు నగదు ఉందని అందులో నుంచి రైతులకు పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే కేంద్రం అంతు చూస్తామంటూ ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్, ఢిల్లీలో ధర్నా చేసి రాష్ట్రానికి వచ్చి మేమే కొంటామని చెప్పారని గుర్తు చేశారు.
ఆ మాట చెప్పి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభించలేదని విమర్శించారు. రైతు పండించిన ధాన్యం కొనలేనప్పుడు సీఎం ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు. వైఎస్సార్‌టీపీ అధికారంలోకి వచ్చాక రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తానని షర్మిల స్పష్టం చేశారు. ఆమె వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment