ఎమ్మెల్యే కావాలనుకున్నారు. కాని అంతకంటే పెద్ద పోస్టే దక్కింది. అదీ రెండుసార్లు ఎంపీగా గెలిచారు. కాని ఆయన కోరిక ఎమ్మెల్యే కావడమేనట. అందుకే ఈసారి సొంత గడ్డ మీద నుంచి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. మరి గులాబీ బాస్ ఆయన కోరిక నెరవేరుస్తారా?
దృష్టంతా దుబ్బాక మీదే.!
కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ నుండి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన ప్రభాకరరెడ్డి పార్టీ కోసం బలంగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో చివరి క్షణంలో ఎమ్మెల్యే సీటు చేజారి మళ్లీ ఎంపీ సీట్ ఆయన్ను వరించింది. 2019తో కూడా కలుపుకుని కొత్త ప్రభాకరరెడ్డి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ఆయనకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక బలంగా ఉంది. అందుకే ఇప్పుడైనా తన సొంత నియోజకవర్గమైన దుబ్బాక అసెంబ్లీ సీటు ఇవ్వాలని గులాబీ బాస్‌ను కోరినట్లు తెలుస్తోంది. తన ఆశయం నెరవేర్చుకునే క్రమంలో ఇటీవల... దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కువగా తిరుగుతున్నారట... అదేవిధంగా నియోజకవర్గంలో తన అనుచర గణాన్ని కూడా పెంచుకున్నట్లు చెబుతున్నారు. ప్రగతి భవన్ నుంచి కూడా కొత్త ప్రభాకర్ రెడ్డికి సానుకూలంగా సంకేతాలు వచ్చాయట. విషయం అర్థం కావడంతో ఎంపీ అనుచరులు దుబ్బాకలో అప్పుడే ప్రచారం ప్రారంభించేశారట.
పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్
2014కి ముందు దుబ్బాక అసెంబ్లీ సీటు టార్గెట్‌గానే ఆయన పనిచేశారు. కాని సోలిపేట రామలింగారెడ్డి కారణంగా చివరగా ఎమ్మెల్యే టికెట్ చేయి జారింది. 2018లో కూడా ఆయన కోరిక నెరవేరలేదు. ఇలా రెండు సార్లు ఎంపీ ఎన్నికల్లోనే నిలబడి గెలిచారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంలో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి సుజాతకు టిక్కెట్టు ఇచ్చింది టీఆర్ఎస్ అధిష్టానం. ఆమెపై బిజెపి అభ్యర్థి రఘునందనరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీఆర్ఎస్ సిటింగ్ సీటు చేజారిపోయింది. ఇక అప్పటినుంచి టిఆర్ఎస్ అధిష్టానం దుబ్బాక నియోజకవర్గంపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఇక్కడ పార్టీకి గట్టి లీడర్ అవసరమని భావించి.. ఎప్పటినుంచో ఎమ్మెల్యే కావాలనుకుంటున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అప్పటి నుండి పార్టీ కార్యక్రమం అయినా.. ప్రభుత్వ కార్యక్రమాలు అయినా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో కనిపిస్తున్నారు.
టార్గెట్ రఘునందన్
మెదక్ ఎంపీగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే... దుబ్బాక అసెంబ్లీ స్థానంలో తనకంటూ ఒక టీమును తయారు చేసుకుని..అందరినీ కలుపు పోతున్నారట కొత్త ప్రభాకరరెడ్డి. అసంతృప్తితో ఉన్న వారిని సైతం ప్రత్యేక సమావేశాల ద్వారా తన వైపు తిప్పుకుంటున్నారట. దుబ్బాకలో బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావును ఢీకొట్టే బలమైన నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అంటూ ఆయన అనుచరులు నియోజకవర్గంలో గట్టిగానే ప్రచారం చేస్తున్నారట. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. దీనికి మంత్రి హరీష్ రావు సహకారం కూడా తోడవుతుందని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ ప్రోగ్రామ్ జరిగినా...అటు ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఇటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరవుతూ జనం వద్ద మార్కులు కొట్టేస్తున్నారట. రెండు వర్గాల వారు ఏదో విషయంలో గొడవ పడుతూ ఉన్నారట. కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం తగ్గేదే లేదంటూ నియోజకవర్గం అంతా తిరుగుతూ ప్రజలకు దగ్గరవుతున్నారట.
పోటీ చేస్తా.. గెలిచి గిఫ్ట్ ఇస్తా
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నాయకత్వం వహించే ఎంపీ సీటు కంటే ఒక అసెంబ్లీ సీటుకే పరిమితం కావాలని కొత్త ప్రభాకరరెడ్డి అనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైతే కలిగే ప్రయోజనాలు వేరేగా ఉంటాయని ఆయన భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు దక్కించుకుని.. రఘునందన్పై గెలిచి పార్టీకి గిఫ్ట్ ఇస్తానంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment