సాక్షి ప్రతినిధి, విజయనగరం: నిర్మాణంలో ఉన్న ఈ ప్రభుత్వ భవనాన్ని చూశారా? దీని కోసం రూ.77లక్షలు ఖర్చు పెట్టారంటే నమ్ముతారా? ఇందులో సందేహం ఉన్నా నమ్మి తీరాల్సిందే. పాచిపెంట మండల పరిషత్ కార్యాలయం కోసం చేపట్టిన ఈ భవన నిర్మాణంలో ఉండగానే లోపాలు బయటపడుతున్నాయి. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పగుళ్లు కన్పిస్తున్నాయి. అయినా ఇప్పటికే మంజూరు చేసిన రూ.77లక్షలు సరిపోలేదు. ఒక్క గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేయాలంటేనే మరో రూ. 5 లక్షలు కావాలంటున్నారు. ఇక ఫస్ట్ ఫ్లోర్‌కు ఇంకెంత అడుగుతారో చూడాలి.
అదే రూ.77లక్షలతో మన సొంతానికని నిర్మించుకుంటే ఇంతకన్న పెద్ద భవనమే కట్టుకోవచ్చు.. ప్రభుత్వ భవన నిర్మాణాలంటే ఇలాగే ఉంటాయా? నిర్మాణంలో ఉన్న ఈ భవనం చూసిన వారికి ఆ అభిప్రాయం కలగక మానదు. జెడ్పీ అధికారులకు ఇదే అనుమానం వచ్చిందేమో? తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని క్వాలిటీ కంట్రోల్ అధికారులకు జెడ్పీ సీఈఓ రాజకుమారి లేఖ రాశారు. పాచిపెంట మండల పరిషత్ కార్యాలయ భవనం నిర్మించేందుకు 2012-13లో రూ.72 లక్షలు బీఆర్‌జీ నిధులు మంజూరు చేశారు. జీప్లస్ 1 తరహాలో నిర్మించేందుకు కాంట్రాక్ట్‌ను టీడీపీకి చెందిన ఓ నేత తీసుకున్నారు. సంవత్సర కాల పరిమితితో నిర్మాణం పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది. కానీ పనులు సకాలంలో పూర్తి చేయలేదు.
సరికదా మంజూరు చేసిన రూ.72లక్షలు సరిపోలేదంటూ నిర్మాణాన్ని మధ్యలో వదిలేశారు. గ్రౌండ్ ప్లోర్‌లో అరకొర పనులు చేయగా, ఫస్ట్ ఫ్లోర్‌లో శ్లాబ్ మాత్రమే వేశారు. గ్రౌండ్ ప్లోర్‌లో పనులు పూర్తి చేయాలంటే మరో రూ.10 లక్షలు అవసరమని కాంట్రాక్టర్ తరఫున వకాల్తా పుచ్చుకుని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోరారు. ఇక, ఫస్ట్ ఫ్లోర్ పూర్తి చేయాలంటే ఇంకెంత అడుగుతారో చూడాలి. మొత్తానికి కాంట్రాక్టర్ అడిగారని, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోరారని తల ఊపుతూ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేసేందుకని మరో రూ.10లక్షలు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ.5 లక్షలు మంజూరు చేశారు. రావడమే తరువాయి... దాన్ని కూడా కాంట్రాక్టర్ ఖర్చు పెట్టేశారు. ఈ లెక్కన రూ.77లక్షలు ఖర్చు పెట్టినట్టయింది.
అయినా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంత ఖర్చు పెడుతున్నా పనులు పూర్తికాకపోవడానికి కారణమేంటని జెడ్పీ సీఈఓ రాజకుమారి ఆరాతీశారు. పాచిపెంట భవనానికి కొన్ని నెలలకు ముందు మంజూరై నిర్మాణాలు పూర్తయిన చీపురుపల్లి, ఎస్‌కోట, బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయాల భవనాల్ని ఒక్కసారి పరిశీలించారు. అదే జీప్లస్-1 తరహాలో నిర్మించిన ఆ మూడు మండలాల భవనాలకు తొలుత ఒక్కొక్కదానికి రూ.55 లక్షలు మంజూరవగా, ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు, స్థానిక పరిస్థితుల దృష్ట్యా సరిపోదని డిమాండ్ చేయడంతో అదనంగా ఒక్కొక్కదానికి మరో రూ.16లక్షలు చొప్పున మంజూరు చేశారు.
మొత్తానికి రూ.71లక్షల వ్యయంతో సకాలంలో పనులు పూర్తయ్యాయి. కానీ పాచిపెంటలో రూ.77లక్షలు మంజూరు చేసినా గ్రౌండ్ ఫ్లోరే పూర్తి కాలేదు. పైన కేవలం శ్లాబ్ కన్పిస్తోంది. ఇదేదో గందరగోళంగా ఉందన్న అభిప్రాయంతో ఇటీవల జెడ్పీ సీఈఓ రాజకుమారి పాచిపెంట వెళ్లారు. ఎక్కడికక్కడ కన్పిస్తున్న పగుళ్లు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల్ని చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమగ్ర తనిఖీ చేసి, రిపోర్టు ఇవ్వాలని కోరుతూ క్వాలిటీ కంట్రోల్‌కు లేఖ రాశారు. మరీ, క్వాలిటీ కంట్రోల్ అధికారులేమిస్తారో గాని ఆ భవనం పరిస్థితి చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కల్గక మానదు. ఒక్క గ్రౌండ్ ప్లోర్ పూర్తి చేయడానికి రూ.82లక్షలు అవుతుందని అధికారులు, కాంట్రాక్టర్లు చెబుతుంటే ఫస్ట్ ప్లోర్ పూర్తి చేయడానికి ఇంకెంత అడుగుతారో ?
క్వాలిటీ కంట్రోల్‌కు లేఖ రాశా: జెడ్పీ సీఈఓ
నిర్మాణ పనులపై అనుమానం ఉంది. ఎక్కడికక్కడ పగుళ్లు, అసంపూర్తి నిర్మాణాలపై అసంతృప్తి ఉంది. దానికోసమే తనిఖీ చేసి, నివేదిక ఇవ్వాలని క్వాలిటీ కంట్రోల్ అధికారులకు లేఖ రాశానని జెడ్పీ సీఈఓ రాజకుమారి తెలిపారు.
పరిషత్ భవనానికి అవినీతి పగుళ్లు!
Published Fri, Jul 24 2015 1:17 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement