సారూ..మా గోడు వినరూ!
ఎన్నో ఏళ్లుగా తీసుకుంటున్న పింఛన్లను ఒక్కసారిగా తొలగించి మా పొట్ట గొట్టడం భావ్యం కాదు.. అంటూ పింఛన్లు రద్దయిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అర్హతలూ ఉన్నా ఆసరా తీసేశారని, భరోసా కల్పిస్తామని చెప్పి.. వయస్సు మీదపడిన ఈ తరుణంలో తీరని వేదన మిగిల్చారని వాపోయారు. తమ గోడు ఆలకించి.. మళ్లీ పింఛన్లు ఇప్పించాలని వేడుకుంటూ వత్సవాయి మండలపరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు.
* పింఛన్ల రద్దుపై బాధితుల ఆవేదన
* వత్సవాయి మండలపరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన
వత్సవారు : తమకు ఆసరాగా ఉన్న పింఛన్లను సర్వేల పేరుతో తొలగించడంపై తీవ్ర ఆవేదనకు గురైన వృద్ధులు స్థానిక మండలపరిషత్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. వయసుడిగిన తరుణంలో తమ పొట్టకొట్టడం భావ్యం కాదంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. అన్ని అర్హతలూ ఉన్న తమకు మళ్లీ పింఛన్లు ఇవ్వాలని వేడుకున్నారు. వీరంతా మండలంలోని భీమవరం వాస్తవ్యులు. ఇటీవల నిర్వహించిన పింఛన్ల సర్వేలో గ్రామానికి చెందిన 102 మంది అనర్హులని పేర్కొంటూ జాబితా నుంచి వారి పేర్లు తొలగించారు.
తొలగించిన వారిలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు కూడా ఉన్నారు. కొంతమందికి వయస్సు చాలలేదని, మరికొంతమందికి వారి పేరిట భూములున్నాయని కారణాలు చూపారు. వాస్తవానికి ఆందోళనకు వచ్చినవారిలో ఎవరికీ పొలాలు లేవు. వయస్సు చాలదంటూ తొలగించిన వారిలో దాదాపు 70 సంవత్సరాలు వయస్సున్న వారు కూడా ఉండటం గమనార్హం. జన్మభూమి కార్యక్రమానికి ముందే వీరి పేర్లు తొలగించిన విషయం తెలిసిందే. జన్మభూమి సభలో అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధితులు తమ గోడు వినిపించగా, గొడవ జరగకుండా ఉండటం కోసం వారికి సర్దిచెప్పారు.
జాబితాలో పేరు లేనివారికి కూడా త్వరలోనే పింఛన్ అందజేస్తామని చెప్పి జన్మభూమి కార్యక్రమాన్ని ముగించారు. వారి మాటలు నమ్మి ఆ తర్వాత పింఛను గురించి అధికారులు, ప్రజాప్రతినిధులను అడిగిన సమాధానం చెప్పడం లేదని గ్రామస్తులు వాపోయారు. దీంతో తప్పనిసరై తమ గోడు వెళ్లబోసుకోవడం కోసం ఆందోళన బాట పట్టినట్లు వివరించారు. సుమారు గంటసేపు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఏఎన్‌వీ నాంచారరావు మాట్లాడుతూ జాబితాలో లేని వారి పేర్లను గురించి గ్రామాల్లో సర్వే చేసినట్లు చెప్పారు. అర్హులకు త్వరలో పింఛన్లు అందుతాయనడంతో ఆందోళన విరమించారు.
ఇరవయ్యేళ్లుగా తీసుకుంటున్నా..
దాదాపు ఇరవయ్యేళ్లుగా పింఛను తీసుకుంటున్నా. ఇప్పుడు వయస్సు చాలలేదంటూ జాబి తాలో నా పేరు తొల గించినట్లు అధికారులు చెప్పారు. ఇప్పుడు నా వయస్సు 80 సంవత్సరాలు.
- పిల్లి నాగమ్మ