టీడీపీ తమ్ముళ్ల ఢిష్యూం.. ఢిష్యూం..
ఎస్సీ రుణాల మంజూరులో వివాదం
కళ్యాణదుర్గం : టీడీపీ తమ్ముళ్ల మధ్య అసంతృప్తి సెగలు ఒక్కసారిగా భగ్గుమని కొట్టుకునే స్థాయికి చేరాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద టీడీపీ మండల కన్వీనర్ డీకే రామాంజినేయులు, పాలవాయి గ్రామానికి చెందిన టీడీపీ యువనాయకుడు రాముల మధ్య ఘర్షణ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల మంజూరుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
పాలవాయి గ్రామ పంచాయితీకి రెండు యూనిట్లు మంజూరయ్యాయి. పంచాయితీ పరిధిలోని పాలవాయి, మల్లాపురం గ్రామాలకు ఒకటి చొప్పున యూనిట్లు కేటాయించేలా టీడీపీ పెద్దలు తీర్మానం చేశారు. అదేతరహాలో టీడీపీ నియమించిన మండల కమిటీకి కూడా సిఫార్సు చేశారు. డీకే రామాంజినేయులు మల్లాపురం గ్రామానికి చెందిన వ్యక్తి కాగా పాలవాయి గ్రామంలో టీడీపీ నాయకుడిగా రాము వ్యవహరిస్తున్నారు. కాగా యూనిట్ల కేటాయింపు విషయంలో డీకే రామాంజినేయులు పాలవాయి యూనిట్‌కు అభ్యర్థిని కేటాయించడంలో జోక్యం చేసుకోవడాన్ని రాముతోపాటు ఎంపీటీసీ గోవిందప్ప వ్యతిరేకించారు.
మండల పరిషత్ కార్యాలయంలో అభ్యర్థుల ఎంపికకు నియమించిన మండల క మిటీ సమావేశానికి చేరుకున్న సదరు నాయకులు ఈ విషయంలో వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు దూషించుకుంటూ చొక్కాలు పట్టుకుని ముష్టి యుద్ధాలకు దిగారు. కాళ్లతో తన్నుకొని, చివరకు చెప్పులు చేతికి తీసుకున్నారు. వెంటనే టీడీపీ నాయకులు వారిని అదుపుచేసి, వారిని అక్కడి నుంచి పంపించేశారు.