చెరువుల ఆక్రమణలకు అక్రమ అనుమతులపై ‘హైడ్రా’ ఫోకస్
నిజాంపేట, చందానగర్ ఉదంతాల్లో పలు ఆధారాలు లభ్యం
అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై చర్యలకు నిర్ణయం
కేసుల్లో వారిని నిందితులుగా చేర్చాలంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు హైడ్రా లేఖ
అక్రమంగా అనుమతులిచ్చే క్రమంలో భారీగా సొమ్ము చేతులు మారిందనే అంచనా
సదరు అధికారుల వివరాలను ఏసీబీకి అందించాలనే యోచన
పలు అక్రమాలపై విజిలెన్స్ విచారణకూ చాన్స్ ఉందంటున్న ప్రభుత్వ వర్గాలు
సాక్షి, హైదరాబాద్: చెరువులను చెరబట్టిన ఆక్రమణలను కూల్చివేయడంతోపాటు రికార్డులను తారుమారు చేస్తూ, వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపైనా ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’ ఫోకస్ చేసింది. కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల్లో నిర్మాణాలకు కారణమైన వారిపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
ఈ క్రమంలో ప్రగతినగర్‌లోని ఎర్రకుంట, చందానగర్ ఈర్ల చెరువుల ఆక్రమణలకు సంబంధించి ఐదుగురు ప్రభుత్వ అధికారుల పాత్రను గుర్తించింది. సదరు ఆక్రమణలపై నమోదైన కేసుల్లో ఈ అధికారులను కూడా నిందితులుగా చేర్చాలని కోరుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతికి హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం లేఖ రాశారు.
ఎర్రకుంట వ్యవహారంలో నలుగురిపై..
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రకుంట బఫర్ జోన్‌లో 0.29 ఎకరాలను బిల్డర్లు ఆక్రమించి మూడు భవనాలను నిర్మించారు. అవన్నీ గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్తుల్లో నిర్మితమయ్యాయి. వాటిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు.. ఈ నెల 14న కూల్చేశారు. ఆ నిర్మాణాలకు కారణాలపై దర్యాప్తు చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
రెవెన్యూ విభాగానికి చెందిన ‘సర్వేయర్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్’ కె.శ్రీనివాస్ ఈ స్థలానికి సంబంధించి రెండు రికార్డులు రూపొందించినట్లు హైడ్రా విచారణలో తేలింది. ఒకదానిలో అది ప్రభుత్వ స్థలమని, మరో దానిలో అది ప్రైవేట్ స్థలమని పొందుపరిచారు. అవసరాన్ని ఒక్కో రిపోర్టును తీసి ఇవ్వడం చేశారు. ఈ అక్రమ నిర్మాణాలకు చెరువు సర్వే నంబర్‌ను కాకుండా దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న మరో భూమికి సంబంధించిన సర్వే నంబర్ కేటాయించారు.
ఈ వ్యవహారంలో బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్ పాత్ర కూడా ఉన్నట్టు తేలింది. అంతేకాదు హెచ్‌ఎండీఏలో అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ఆ స్థలాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండానే అనుమతి మంజూరు చేశారు. ఇందులో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి.రామకృష్ణారావు పాత్ర కూడా ఉన్నట్టు హైడ్రా నిర్ధారించింది. దీనితో ఈ కేసులో నలుగురు అధికారులనూ నిందితులుగా మార్చాలని పోలీసులను కోరింది.
ఏమీ రాయకుండా ‘చుక్క’ పెట్టి లైన్ క్లియర్!
చందానగర్ పరిధిలోని ఈర్ల చెరువు ఆక్రమణ వ్యవహారంపైనా హైడ్రా లోతుగా ఆరా తీయగా మరో బాగోతం బయటపడింది. ఇక్కడ 0.16 ఎకరాలను ఆక్రమించిన కొందరు.. గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులతో ఒక నిర్మాణం, గ్రౌండ్ ప్లస్ నాలుగు అంతస్తులతో మరో రెండు నిర్మాణాలను చేపట్టారు. వాటిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు.. ఈ నెల 10న ఆ మూడు నిర్మాణాలను నేలమట్టం చేశారు.
ఈ ఆక్రమణలకు సంబంధించి చందానగర్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ నిర్మాణాలకు ఆన్‌లైన్‌లోనే అనుమతులు మంజూరైనట్టు గుర్తించిన హైడ్రా అధికారులు.. పూర్వాపరాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్‌ఎంసీ చందానగర్ సర్కిల్ గత డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఎన్.సుధాంశ్‌తోపాటు మాజీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) ఎం.రాజ్‌కుమార్ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం బిల్డర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
వాస్తవానికి ఈర్ల చెరువు ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా.. దరఖాస్తుతోపాటు ఇరిగేషన్ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకుని జత చేయాలి. బిల్డర్లు అలా చేయలేదని గుర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారి (టీపీఓ) ఆ వివరాలను పొందుపరుస్తూ రాజ్‌కుమార్‌కు ఫార్వర్డ్ చేశారు. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్‌పై రాజ్‌కుమార్ తన అభిప్రాయాలను జోడిస్తేనే అది డిప్యూటీ కమిషనర్‌కు వెళుతుంది.
కానీ రాజ్‌కుమార్ దానిపై ఎలాంటి కామెంట్లు రాయకుండా.. కేవలం ఓ చుక్క (డాట్) పెట్టి డిప్యూటీ కమిషనర్‌కు ఫార్వర్డ్ చేసేశారు. దీని ఆధారంగా డిప్యూటీ కమిషనర్ భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసేశారు. ఇది గుర్తించిన హైడ్రా చందానగర్‌లో నమోదైన కేసులో సుధాంశ్, రాజ్‌కుమార్‌లను నిందితులుగా చేర్చాలని సిఫార్సు చేసింది.
ఏసీబీ అధికారుల దృష్టికి కూడా..
సాధారణంగా అన్నీ సరిగా ఉన్న స్థలాల్లో నిర్మాణాలకు అనుమతి కావాలన్నా.. సంబంధిత అధికారుల చేతులు తడపనిదే ఫైల్ ముందుకు కదలని పరిస్థితి. అలాంటిది చెరువులు, కుంటలు, వాటి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లతోపాటు ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు అంటే.. అధికారుల చేతికి ముడుపులు దండిగా అందినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో ఎర్రకుంట, ఈర్ల చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో రూ.లక్షలు చేతులు మారి ఉంటాయని హైడ్రా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అధికారుల వివరాలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అందించాలని యోచిస్తున్నారు. భవిష్యత్తులో కొన్ని కీలక ఉదంతాలపై విజిలెన్స్ విచారణలు కూడా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా అక్రమార్కుల చుట్టూ ఉచ్చు బిగించాలని హైడ్రా భావిస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment