చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై హైడ్రా ప్రత్యేక దృష్టి.. ఈ ప్రాంతాల్లోని అన్ని నిర్మాణాలు కూల్చివేత
స్థలాల కొనుగోలుపై గందరగోళంలో సామాన్య ప్రజలు
వీరికి ఉపయుక్తంగా ఉండేలా త్వరలో అందుబాటులోకి హైడ్రా యాప్
ఎక్కడ నిల్చుని ఓపెన్ చేస్తే ఆ ప్రాంతం వివరాలు ప్రత్యక్షం
సాక్షి, హైదరాబాద్: ఏ చెరువు పరిధి ఎక్కడి దాకా ఉంది? దాని ఫుల్ ట్యాంక్ లెవల్ ఎంత వరకు? బఫర్ జోన్ ఏ మేరకు విస్తరించి ఉంది? తెలుసుకోవడం ఎలా?.. ఔటర్ రింగు రోడ్డు పరి«ధిలోని ఆక్రమణలపై అనునిత్యం హైదరా బాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో స్థలం, ఇల్లు, ఫ్లాట్ కొనాలని భావిస్తున్న సామాన్యుడికి వస్తున్న సందేహాలు ఇవి.
బడా బాబులు, రియల్టర్లు, వ్యాపారుల మాదిరిగా వీరికి సమాచారం సేకరించే నెట్‌వర్క్ ఉండదు. దీంతో ఏమాత్రం తొందరపడి ముందడుగు వేసినా నిండా మునిగిపోతామనే భయం ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఔటర్’ పరిధిలోని చెరువులకు సంబంధించిన సమాచారంతో ఓ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్‌లో ఉంచినా..
రాజధానితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న చెరువులకు సంబంధించిన సమస్త సమాచారం ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) వద్ద ఉంది. ఈ విభాగం ప్రతి చెరువు, కుంట, ట్యాంక్‌కు ప్రత్యేక ఐడీ సైతం జారీ చేసింది. దానికి సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల లెక్కలతో పాటు వీటిని గుర్తిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ వివరాలనూ క్రోడీకరించింది. ఈ వివరాలన్నింటినీ మ్యాపులతో సహా అధికారిక వెబ్‌సైట్ (https:// lakes. hmda. gov. in) లో అందుబాటులో ఉంచింది.
అయితే ఈ వివరాలు పూర్తి సాంకేతిక పదజాలంతో ఉండటంతో సామాన్యుడికి అర్థమయ్యే పరిస్థితి లేదు. టెస్ట్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్... ఇలా సాంకేతిక పరిభాష, అంకెలతో ఉన్న ఆ వివరాలను డీ కోడ్ చేయాలంటే సాధారణ ప్రజలు నిపుణుల సహాయం తీసుకోవాల్సివస్తోంది. లేనిపక్షంలో తాను ఖరీదు చేయబోతున్న ప్రాంతం వివరాల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
వివరాలన్నీ సరళంగా అందుబాటులో..
అదే సమయంలో ప్రస్తుతం హెచ్‌ఎండీఏ వద్ద అందుబాటులో ఉన్న వివరాలన్నింటినీ సరళంగా మార్చి హైడ్రా కోసం రూపొందించే ప్రత్యేక వెబ్‌సైట్‌తో పొందుపరచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆక్రమణలు సహా వివిధ అంశాలపై ఫిర్యాదులు చేయడానికి వాట్సాప్ నంబర్, ఈ–మెయిల్ ఐడీలతో పాటు యాప్‌ను హైడ్రా అందుబాటులోకి తీసుకురానుంది.
ఇందులోనే జియో ట్యాగింగ్ డేటాను పొందుపరుస్తారు. అవసరమైతే ఈ విషయంలో గూగుల్ మ్యాప్స్ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న ఎవరైనా ఓ ప్రాంతంలో నిల్చుని యాప్‌ను ఓపెన్ చేస్తే.. ఆ ఏరియా ఏదైనా చెరువు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల కిందికి వస్తుందా? అనేది స్పష్టంగా కనిపిస్తుంది.
భవిష్యత్తులో ప్రభుత్వ భూములు, పార్కులు తదితరాలనూ ఈ యాప్‌లోకి తీసుకురావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భావిస్తున్నారు. నగరంలో ఉన్న చెరువుల్లో సర్వే, ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఫైనల్ వెరిఫికేషన్ ప్రక్రియలు పూర్తయినవి 54 ఉన్నాయి. వీటి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై స్పష్టత ఉండటంతో తొలిదశలో వీటికే జియో ఫెన్సింగ్ చేయించనున్నారు.
జియో ఫెన్సింగ్‌తో పరిరక్షించనున్న హైడ్రా
సువిశాలంగా విస్తరించి ఉన్న నగరంలోని కొన్ని చెరువులు, పార్క్‌లు, ప్రభుత్వ స్థలాలపై నిఘా ఉంచడానికి డ్రోన్లు, సీసీ కెమెరాలు, గార్డుల వ్యవస్థ సైతం సరిపోదు. ఈ నేపథ్యంలో కీలకమైన వాటిని పరిరక్షించడానికి జియో ఫెన్సింగ్ విధానాన్ని అమలు చేయడానికి హైడ్రా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ), అడ్వాన్స్‌డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (అడ్రిన్) సహా మరికొన్ని సంస్థలతో సంప్రదింపులు జరపనున్నారు.
వీరి సహకారంతో ఉపగ్రహాల ద్వారా ఆయా చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల హద్దులను పక్కాగా గుర్తించడంతో పాటు వాటికి జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా ఆ పరిధిలోకి వెళ్లి పూడ్చటానికి, నిర్మాణాలు చేపట్టడానికి సహా ఏ ఇతర ప్రయత్నం చేసినా ఆ కార్యకలాపాలను జియో ఫెన్సింగ్ ఆధారంగా శాటిలైట్లు గుర్తిస్తాయి. వెంటనే ఆ సమాచారాన్ని హైడ్రా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)తో పాటు కీలక అధికారులకు అందిస్తూ అప్రమత్తం చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment