ఉండాల్సిన చెరువులు 1,728
ఇప్పుడు మిగిలినవి 700 లోపే..
గత 45 ఏళ్లలో నామరూపాలు లేకుండా పోయినవి 1000 పైనే..
గ్రేటర్ చెరువులపై ఎన్‌ఆర్‌ఎస్‌సీ తేల్చిన పచ్చి నిజం
మిగిలిన చెరువుల్లోనూ సగం దాకా కబ్జాలు, ఆక్రమణలే..
చాలా చోట్ల భారీ నిర్మాణాలు, గోదాములు.. కొత్తగా వెలుస్తున్న కాలనీలు
ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల కక్కుర్తితో కొనసాగుతున్న ఆక్రమణలు
చెరువుల భూముల్లో నిర్మాణాలపై కఠిన చర్యలు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: ఒకనాడు నిండుగా చెరువులతో, వాటి పక్కన తోటలతో కళకళలాడిన నగరం హైదరాబాద్.. కానీ నాటి చెరువులు కుంటలు అయిపోతే.. కుంటలన్నీ బస్తీలుగా మారిపోయాయి. చెరువు కనిపిస్తే చెరపట్టడమే లక్ష్యంగా చెలరేగిపోయిన కబ్జాదారులతో ఎక్కడికక్కడ భారీ నిర్మాణాలు వెలిశాయి. దశాబ్దాలుగా ఈ తతంగం జరుగుతున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల కమీషన్ల కక్కుర్తితో.. వందల కొద్దీ చెరువులు నామరూపాలు లేకుండా పోయాయి.
పెద్ద పెద్ద కాలనీలను చూపించి.. ఒకప్పుడు ఇక్కడ పెద్ద చెరువు ఉండేదని చెప్పుకునే రోజులు వచ్చాయి. గత 45 ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 61 శాతం చెరువులు మాయమైపోయినట్టు ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)’ తేల్చింది. దీనికి సంబంధించి ఇటీవల ‘హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (హైడ్రా)’కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిలో ఉన్న నిర్మాణాల తొలగింపుపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు.
అనేక ప్రాంతాలకు అవే గుర్తింపు
హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల పేర్లలో బాగ్, తలాబ్, కుంట, కట్ట వంటి పదాలు ఉంటాయి. అవన్నీ నగరంలో చెరువులు, కుంటలు, తోటలు ఉన్న ప్రాంతాలే. దానికితోడు పెద్ద పెద్ద చెరువులూ ఎన్నో ఉండేవి. రియల్‌ఎస్టేట్ బూమ్‌తో కబ్జాలు, ఆక్రమణలతో పరిస్థితులు మారిపోయాయి. చెరువుల శిఖం భూములతోపాటు తూములు,అలుగులు, నాలాలపై అడ్డగోలుగా నిర్మాణాలు వచ్చి చేరాయి.
ఈ క్రమంలో 1979, 2024 మధ్య హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేసిన ఎన్‌ఆర్‌ఎస్‌సీ.. పెద్ద సంఖ్యలో చెరువులు మాయమైనట్టు తేల్చింది. బుధవారం ఎన్‌ఆర్‌ఎస్‌సీలో జరిగిన సమావే«శంలో ఈ వివరాలను వెల్లడించింది. ఉదాహరణకు శాతం చెరువు విస్తీర్ణం గతంలో 70 ఎకరాలుకాగా.. ఇప్పుడు మిగిలింది పదెకరాలే. ఎల్బీనగర్ కప్రాయి చెరువు 71 ఎకరాలకుగాను 18 ఎకరాలే మిగిలింది.
హెచ్‌ఎండీఏ యంత్రాంగం నిర్లక్ష్యంతో..
ఇటీవలి వరకు గ్రేటర్‌లో చెరువుల బాధ్యతలను హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పర్యవేక్షించింది. దీని పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 1,728 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పూర్తి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్ హద్దులను నిర్ధారించడంలో దశాబ్దాలుగా నిర్లక్ష్యం చూపారు. కేవలం 200 చెరువుల హద్దులను మాత్రమే నోటిఫై చేశారు. ఈ కారణంగానే కబ్జాల పర్వం యథేచ్చగా కొనసాగింది. 472 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఫాక్స్‌సాగర్‌లో.. ఇప్పటివరకు 120 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయి.
ఈ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే రసాయన గోదాములు, భారీ నిర్మాణాలు వెలిశాయి. 2003లో అప్పటి ప్రభుత్వం చెరువు భూముల్లోనే 11 ఎకరాల్లో పేదలకు పట్టాలివ్వడం గమనార్హం. ఇక మూసాపేట మైసమ్మ చెరువు భూముల్లో ఏకంగా ఆకాశ హరŠామ్యలే వెలిశాయి. శేరిలింగంపల్లిలోని దేవునికుంట, సున్నం చెరువు, మంగలి కుంటలు దాదాపు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు గోల్కొండ రాజులకు మంచినీరు అందించిన దుర్గం చెరువు చిక్కిపోయింది. దీని 125 ఎకరాల విస్తీర్ణంలో 25 ఎకరాల మేర గార్డెన్స్ వెలిశాయి.
నేతలు, రియల్టర్లు, అధికారులు కుమ్మక్కై
చెరువులు, కుంటలు కబ్జా చేసి నిర్మించిన, నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు, లేఔట్ల వెనుక రాజకీయ నాయకులు, రియల్టర్లు ఉంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు బినామీ పేర్లతో చెరువుల్లో వెంచర్లు, లేఔట్లు వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి కొందరు అధికారుల కక్కుర్తి తోడుకావడంతో అక్రమాలు విచ్చలవిడిగా కొనసాగాయి. కొన్ని సందర్భాల్లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి, హడావుడి చేయడం పరిపాటిగా మారిపోయింది.
వాటిని పూర్తిగా కూల్చివేయడానికి బదులు నిర్మాణాల పైకప్పు, గోడలకు పెద్ద పెద్ద రంధ్రాలు చేసి వదిలేస్తూ వచ్చారు. నేతలు, రియల్టర్లు తమ పలుకుబడి వినియోగించి తర్వాతి చర్యలు లేకుండా చూసుకుంటున్నారు. భవనాలకు పెట్టిన రంధ్రాలను పూడ్చేసి తమ దందా కొనసాగించేస్తున్నారు. తాజాగా ఎన్‌ఆర్‌ఎస్‌సీ ప్రజెంటేషన్ నేపథ్యంలో ‘హైడ్రా’ డైరెక్టర్ ఏవీ రంగనాథ్ వేగంగా స్పందించారు.
చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను పూర్తిగా కూల్చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో నిర్మాణంలో ఉన్నవాటిని కూల్చాలని, తర్వాత పాత నిర్మాణాలపై ఫోకస్ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో.. ఎనిమిది భవనాలను (ఐదు అంతస్తులు, అంతకంటే ఎక్కువ ఎత్తయినవి) అధికారులు కూల్చేశారు. రెండు లేఔట్లను ధ్వంసం చేశారు.
స్థిరాస్తి కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోండి
చెరువులకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ భవనాలను కూల్చేయడంతోపాటు వారికి సహకరించిన ప్రభుత్వ అధికారులపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. శనివారం రెండు ప్రాంతాల్లో నిర్మాణాలను కూల్చివేసి దాదాపు 15 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం.
చెరువుల పరిసరాల్లో ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని.. తెలుసుకోకుండా ముందుకెళ్తే నష్టపోవాల్సి వస్తుంది. ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్రమ నిర్మానాలు, కబ్జాలపై సమాచారం ఇవ్వాలి.
– ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment