చుట్టూ ఇళ్లున్నా వరద కాల్వ పేరుతో కొర్రీలు
టోపో మ్యాప్‌ల పేరిట ఎన్‌ఓసీలకు డిమాండ్
హైడ్రా నేపథ్యంలో రకరకాల ఆంక్షలు
గృహ నిర్మాణ అనుమతుల్లో అంతులేని జాప్యం
సాక్షి, హైదరాబాద్: జేఎన్‌టీయూ ప్రగతినగర్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ నెల రోజుల క్రితం అయిదంతస్తుల భవన నిర్మాణానికి అనుమతుల కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు దరఖాస్తు చేసుకుంది. నెల రోజుల పాటు దరఖాస్తు పరిశీలన దశలోనే ఉంది. వివిధ స్థాయిలకు చెందిన అధికారులు పరిశీలించి చివరకు ఆ ప్రాంతంలో వరద నీరు రావచ్చేమోననే సందేహాన్ని చల్లగా వ్యక్తం చేశారు. ఈ సందేహాన్ని నివృత్తి చేసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి టోపోమ్యాప్‌తో కూడిన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) కావాలంటూ కొర్రీలు పెట్టారు.
నెలరోజుల పాటు ఎటూ తేల్చకుండా చివరకు ఎన్‌ఓసీలు కావాలంటూ షరతులు పెట్టడంతో సదరు నిర్మాణ సంస్థకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. నిజానికి అదే ప్రాంతంలో దశాబ్దాలుగా ఎంతో మంది నివాసం ఉంటున్నారు. దరఖాస్తు చేసుకున్న స్థలానికి చుట్టుపక్కల అపార్ట్‌మెంట్‌లు కూడా ఉన్నాయి. పైగా హెచ్‌ఎండీఏ గతంలో ఇచ్చిన దరఖాస్తులతోనే ఆ భవనాలను కట్టారు. నిర్మాణానికి అన్ని విధాలా అర్హత ఉన్న ఆ స్థలానికి కొత్తగా టోపో మ్యాప్‌తో పాటు ఎన్‌ఓసీ కావాలని ఆంక్షలు విధించారు. ఒక్క ప్రగతినగర్‌లోనే కాదు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలన్నా బిల్డర్‌లు, మధ్యతరగతి వర్గాలు హడలెత్తుతున్నాయి. టీజీబీపాస్ ద్వారా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి పొందడమే ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా మారింది.
ఎండమావుల్లా ఎన్‌ఓసీలు...
⇒ భవన నిర్మాణాలు, లే అవుట్‌లు, ఎల్‌ఆర్‌ఎస్‌లు, ఆక్యుపెన్సీ సరి్టఫికెట్‌లు వంటి వివిధ రకాల పనులపై సాధారణంగానే నెలలు గడిచినా అనుమతులు లభించడం దుర్లభంగా మారింది. కేవలం 15 రోజుల్లో దరఖాస్తులను పరిశీలించి అనుమతులను జారీ చేయాల్సి ఉండగా నెలలు గడిచినా అనుమతులు లభించడం లేదంటూ దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఫైళ్లు పెండింగ్ జాబితాలో పేరుకుపోతున్నాయి. ఇదే సమయంలో కొత్తగా రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. హెచ్‌ఎండీఏ అనుమతుల్లో ఇరిగేషన్, రెవిన్యూ శాఖలను కూడా చేర్చారు. దీంతో ఫైళ్ల కదలికలో మరింత జాప్యం ఏర్పడుతోంది.
⇒ ఇదంతా ఒకవైపైతే.. మరోవైపు హెచ్‌ఎండీఏ ఆంక్షల మేరకు ఇరిగేషన్, రెవిన్యూ విభాగాల నుంచి ఎన్‌ఓసీలు జారీ కావడం లేదు. తుర్కయంజాల్‌కు చెందిన ఓ దరఖాస్తుదారు ఏడాది క్రితం భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దశాబ్దాల క్రితం అక్కడ పంట కాల్వ ఉన్నట్లు పరిగణించి ఎన్‌ఓసీ కోరారు. ఈ మేరకు ఆరు నెలల పాటు ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి ఎన్‌ఓసీ సంపాదించారాయన. కానీ.. అదొక్కటే చాలదు. రెవెన్యూ ఎన్‌ఓసీ కూడా అవసరమన్నారు. ఇప్పటి వరకు రెవెన్యూ నుంచి ఎన్‌ఓసీ లభించలేదు. దీంతో భవన నిర్మాణాన్ని ఆయన వాయిదా వేసుకున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎన్‌ఓసీలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
రెవెన్యూ అవసరం లేకపోయినా..
సాధారణంగా వర్షం కురిసినప్పుడు ఎత్తు నుంచి పల్లానికి వరద నీళ్లు ప్రవహిస్తాయి. టోపో మ్యాప్‌ల ఆధారంగా ఇలాంటి వరద కాల్వలను గుర్తిస్తారు. భవన నిర్మాణం చేపట్టనున్న స్థలానికి చుట్టూ 500 మీటర్‌ల పరిధిలో ఎలాంటి వరదలు రావని నిర్ధారిస్తూ ఎన్‌ఓసీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నీటిపారుదల అధికారులు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు నిరాకరిస్తే అది వరద ముప్పు ఉన్న ప్రాంతంగానే పరిగణించాలి. ఇందులో రెవెన్యూ శాఖ భాగస్వామ్యం అవసరం లేదు. వర్షపు నీరు ప్రవహించే ప్రాంతాలుగా అనుమానించి కొర్రీలు విధిస్తున్న హెచ్‌ఎండీఏ అధికారులు ఇరిగేషన్‌తో పాటు రెవెన్యూ ఎన్‌ఓసీలను కూడా తప్పనిసరి చేయడం గమనార్హం. కాగా.. హైడ్రా రాకతోనే తాము ఇలాంటి ఎన్‌ఓసీలను కోరుతున్నామని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment