Pragatinagar
-
వరద రావచ్చేమో..
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూ ప్రగతినగర్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ నెల రోజుల క్రితం అయిదంతస్తుల భవన నిర్మాణానికి అనుమతుల కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు దరఖాస్తు చేసుకుంది. నెల రోజుల పాటు దరఖాస్తు పరిశీలన దశలోనే ఉంది. వివిధ స్థాయిలకు చెందిన అధికారులు పరిశీలించి చివరకు ఆ ప్రాంతంలో వరద నీరు రావచ్చేమోననే సందేహాన్ని చల్లగా వ్యక్తం చేశారు. ఈ సందేహాన్ని నివృత్తి చేసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి టోపోమ్యాప్తో కూడిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కావాలంటూ కొర్రీలు పెట్టారు. నెలరోజుల పాటు ఎటూ తేల్చకుండా చివరకు ఎన్ఓసీలు కావాలంటూ షరతులు పెట్టడంతో సదరు నిర్మాణ సంస్థకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. నిజానికి అదే ప్రాంతంలో దశాబ్దాలుగా ఎంతో మంది నివాసం ఉంటున్నారు. దరఖాస్తు చేసుకున్న స్థలానికి చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. పైగా హెచ్ఎండీఏ గతంలో ఇచ్చిన దరఖాస్తులతోనే ఆ భవనాలను కట్టారు. నిర్మాణానికి అన్ని విధాలా అర్హత ఉన్న ఆ స్థలానికి కొత్తగా టోపో మ్యాప్‌తో పాటు ఎన్ఓసీ కావాలని ఆంక్షలు విధించారు. ఒక్క ప్రగతినగర్‌లోనే కాదు. హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలన్నా బిల్డర్లు, మధ్యతరగతి వర్గాలు హడలెత్తుతున్నాయి. టీజీబీపాస్ ద్వారా హెచ్ఎండీఏ నుంచి అనుమతి పొందడమే ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా మారింది. ఎండమావుల్లా ఎన్ఓసీలు... ⇒ భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఎల్ఆర్ఎస్లు, ఆక్యుపెన్సీ సరి్టఫికెట్లు వంటి వివిధ రకాల పనులపై సాధారణంగానే నెలలు గడిచినా అనుమతులు లభించడం దుర్లభంగా మారింది. కేవలం 15 రోజుల్లో దరఖాస్తులను పరిశీలించి అనుమతులను జారీ చేయాల్సి ఉండగా నెలలు గడిచినా అనుమతులు లభించడం లేదంటూ దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఫైళ్లు పెండింగ్ జాబితాలో పేరుకుపోతున్నాయి. ఇదే సమయంలో కొత్తగా రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. హెచ్ఎండీఏ అనుమతుల్లో ఇరిగేషన్, రెవిన్యూ శాఖలను కూడా చేర్చారు. దీంతో ఫైళ్ల కదలికలో మరింత జాప్యం ఏర్పడుతోంది. ⇒ ఇదంతా ఒకవైపైతే.. మరోవైపు హెచ్ఎండీఏ ఆంక్షల మేరకు ఇరిగేషన్, రెవిన్యూ విభాగాల నుంచి ఎన్ఓసీలు జారీ కావడం లేదు. తుర్కయంజాల్‌కు చెందిన ఓ దరఖాస్తుదారు ఏడాది క్రితం భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దశాబ్దాల క్రితం అక్కడ పంట కాల్వ ఉన్నట్లు పరిగణించి ఎన్ఓసీ కోరారు. ఈ మేరకు ఆరు నెలల పాటు ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి ఎన్ఓసీ సంపాదించారాయన. కానీ.. అదొక్కటే చాలదు. రెవెన్యూ ఎన్ఓసీ కూడా అవసరమన్నారు. ఇప్పటి వరకు రెవెన్యూ నుంచి ఎన్ఓసీ లభించలేదు. దీంతో భవన నిర్మాణాన్ని ఆయన వాయిదా వేసుకున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు.రెవెన్యూ అవసరం లేకపోయినా.. సాధారణంగా వర్షం కురిసినప్పుడు ఎత్తు నుంచి పల్లానికి వరద నీళ్లు ప్రవహిస్తాయి. టోపో మ్యాప్‌ల ఆధారంగా ఇలాంటి వరద కాల్వలను గుర్తిస్తారు. భవన నిర్మాణం చేపట్టనున్న స్థలానికి చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఎలాంటి వరదలు రావని నిర్ధారిస్తూ ఎన్ఓసీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నీటిపారుదల అధికారులు ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరిస్తే అది వరద ముప్పు ఉన్న ప్రాంతంగానే పరిగణించాలి. ఇందులో రెవెన్యూ శాఖ భాగస్వామ్యం అవసరం లేదు. వర్షపు నీరు ప్రవహించే ప్రాంతాలుగా అనుమానించి కొర్రీలు విధిస్తున్న హెచ్ఎండీఏ అధికారులు ఇరిగేషన్‌తో పాటు రెవెన్యూ ఎన్ఓసీలను కూడా తప్పనిసరి చేయడం గమనార్హం. కాగా.. హైడ్రా రాకతోనే తాము ఇలాంటి ఎన్ఓసీలను కోరుతున్నామని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. -
ప్రగతి నగర్లో భారీ ట్రాఫిక్ జాం
హైదరాబాద్ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని కూకట్పల్లి ప్రగతినగర్ చెరువు పూర్తిగా నిండింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వరద కొనసాగుతుండటంతో.. చెరువు సమీపంలోని రోడ్డు పైకి నీరు చేరింది. దీనికి తోడు భారీ వర్షాలకు రోడ్డు గుంతల మయమవడంతో.. భారీగా ట్రాఫిక్ జాం అయింది. బుధవారం ఉదయం పనులు నిమిత్తం బయటకు వస్తున్న వాహనదారులు ట్రాఫిక్ జాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రగతినగర్ చెరువు ప్రాంతంలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఏజీపీఓపై సస్పెన్షన్ వేటు
ప్రగతినగర్ : పౌరసరఫరాల శాఖ సహాయ ధా న్యం కొనుగోలు అధికారి (ఏజీపీఓ) శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ కమిషనర్ రజత్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. కస్టమ్ మి ల్లింగ్ ప్యాడీ (సీఎంపీ) కింద రైసుమిల్లర్లకు సరఫరా చేసే ధాన్యం విషయంలో అక్రమాలు జరి గాయన్న ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. 2013-14 ఖరీఫ్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చెల్లించేందుకు రైసుమిల్లర్లకు ప్రభుత్వం గడువును జూన్ నుంచి సెప్టెంబర్‌కు పొడిగించగా.. అంతకు ముందు జరిగిన సీఎంపీలో అవకతవకలను కమిషనర్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదేశాల మేరకు వారం రోజుల క్రితం కరీంనగర్ డీఎస్ఓ చంద్రప్రకాశ్ నేతృత్వంలో 11 బృందాలు ఏకకాలంలో 38 రైసుమిల్లులపై దాడులు నిర్వహించారుు. అయి తే, చాలా వరకు రైసుమిల్లులలో ధాన్యం, బియ్యం లేకపోగా, గతం లో డిఫాల్టర్లయిన రైసుమిల్లర్లకు సై తం సీఎంపీ కింద ధాన్యం చెల్లించి నట్లు తేలింది. ఇదే సమయంలో డీ ఎస్ఓగా వ్యవహరించిన కొండల్రావు ధీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఈ వ్యవహారంపై చంద్రప్రకాశ్ ఇ చ్చిన నివేదిక ప్రకారం శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
స్వచ్ఛమైన మనసులకు ఆలంబన
‘చదివిన చదువుకు సార్థ్ధకత చేకూరాలి. అలాగే చేసే పని మనసుకు సంతృప్తినివ్వాలి. మానసికంగా ఎదగని పిల్లలకు పాఠాలు చెబుతూ అందులోనే సంతృప్తిని వెదుక్కుంటున్నాను’ అంటున్నారు హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రగతినగర్‌కు చెందిన 35 ఏళ్ల బబిత. మానసికంగా ఎదగని, అలాగే చదువులో వెనకబడిన పిల్లల కోసం ‘శ్రేయా ఇన్స్టిట్యూట్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్’ పేరుతో స్కూల్‌ను నడుపుతున్నారు బబిత. అదీ తన ఇంటి లోగిలిలోనే! ఫీజులతో నిమిత్తం లేకుండా సేవే పరమావధిగా సామాజిక వెలుగుకోసం నేనూ ఓ చిరుదివ్వెను వెలిగిస్తాను’ అంటున్న 35 ఏళ్ల బబిత ఏం చేస్తున్నారో ఆమె మాటల్లోనే... ఇంటింటికి వెళ్లి... ‘‘చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనే ఆలోచన అమితంగా ఉండేది. అయితే ‘అన్నీ సక్రమంగా ఉన్న పిల్లలకంటే బతికినన్నాళ్లూ కుటుంబసభ్యులపై ఆధారపడే బుద్ధిమాంద్యం గల పిల్లలకు ఉపయోగపడే పని ఏదైనా చేస్తే బాగుంటుంది’అనుకునేదాన్ని. అందుకు కారణం మా మేనమామ. ఆయన మెంటల్లీ హ్యాండికాప్డ్. శారీరకంగా ఎదిగినా, మానసికంగా రెండేళ్ల పిల్లవాడిలా ఉండేవాడు. కుటుంబసభ్యులు ఎంతో ఇబ్బంది పడుతూనే ఆయనకి సేవలు చేసేవారు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరగడం వల్లనేమో ఈ తరహా ఆలోచన నాతోపాటు వృద్ధి చెందింది. అందుకే స్పెషల్ చిల్డ్రన్ కోసం 2007లో ప్రత్యేక కోర్సు చేశాను. అప్పటికే నాకు పెళ్లై, ఓ పాప కూడా ఉంది. పాప బాగోగులు చూసుకుంటూనే మానసికంగా ఎదగని పిల్లలు ఉన్న ఇళ్లకు వెళ్లి వారికి క్లాసులు తీసుకునేదాన్ని. మా వారు డా.కులశేఖర్, ఇఎస్ఐ ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్! తనకీ సమాజసేవ అంటే చాలా ఇష్టం. వారాంతంలో స్లమ్ ఏరియాలో హెల్త్‌క్యాంపులు నడుపుతుంటారు. ఆయనలో ఆ దృక్పథం ఉండటం వల్లేనేమో నా ఆలోచనకు ఊతం ఇస్తుంటారు. ఇద్దరు ముగ్గురి నుంచి ఇరవై మంది వరకు.... మానసికంగా ఎదగని ఒకరిద్దరు పిల్లలకే ఇస్తున్న ఈ శిక్షణ మరికొంత మంది పిల్లలకు కూడా అందితే బాగుంటుంది అనుకున్నాను. ఆ ఆలోచనతోనే మూడేళ్ల క్రితం శ్రేయ పేరుతో ఇంట్లోనే స్పెషల్ స్కూల్‌ను మొదలుపెట్టాను. మొదట ఇద్దరు, ముగ్గురు పిల్లలు వచ్చేవారు. ఇప్పుడు 20 మంది వరకు ఉన్నారు. వారికై వారు శుభ్రంగా ఎలా ఉండాలి? చిన్న చిన్న పనులు తమకు తామే ఎలా పూర్తి చేసుకోవాలి? వారి వస్తువులు వారే ఎలా గుర్తుపట్టాలో నేర్పిస్తూనే ఆ తర్వాత వృత్తివిద్యాకోర్సులకు అనుబంధిత సంస్థలతో కలిసి శిక్షణ ఇప్పిస్తుంటాను. వీరిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పదిమంది పిల్లలు, సాయంత్రం 5-7 వరకు మరో పదిమంది పిల్లలు వస్తారు. వీరికి శిక్షణ ఇవ్వడానికి మరొక టీచర్ సాయం కూడా తీసుకున్నాను. ఆటపాటలతో... మానసికంగా ఎదగని చిన్నారులను బుద్ధిగా కూర్చోబెట్టాలంటే వారి కళ్లకు అంతా కలర్ఫుల్గా ఉండాలి. అందుకోసం ఇంట్లోనే ఓ రెండు గదులను రంగురంగులుగా తీర్చిదిద్దాను. అలాగే వారికి బోర్ కొట్టకుండా ఉండటం కోసం వారికి ఆటపాటలను నిర్వహిస్తుంటాను. వారి పుట్టినరోజులు, ఇతర ముఖ్యమైన తేదీలు వేడుకగా జరుపుతాను. స్వచ్ఛమైన మనసులు ఉన్న చోట ఎంత మంది ఉన్నా ఇబ్బంది ఉండదు. అందుకే ఈ చిన్నారులతో ఎంత సేపు ఉన్నా సమయమే తెలియదు’’ అని తెలిపారు ఆమె. సమాజసేవలో పాలుపంచుకోవాలంటే పోగేసుకున్న డబ్బులే అవసరం లేదు. మనసులో ఓ మంచి ఆలోచన, చేయగలను అనే సంకల్పం ఉంటే చాలు ఇంటి నుంచే సేవను మొదలుపెట్టవచ్చు అని నిరూపిస్తున్నారు బబిత. - నిర్మలారెడ్డి