Purchase of land
-
నిల్చున్న చోటే నిగ్గుతేల్చే యాప్!
సాక్షి, హైదరాబాద్: ఏ చెరువు పరిధి ఎక్కడి దాకా ఉంది? దాని ఫుల్ ట్యాంక్ లెవల్ ఎంత వరకు? బఫర్ జోన్ ఏ మేరకు విస్తరించి ఉంది? తెలుసుకోవడం ఎలా?.. ఔటర్ రింగు రోడ్డు పరి«ధిలోని ఆక్రమణలపై అనునిత్యం హైదరా బాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో స్థలం, ఇల్లు, ఫ్లాట్ కొనాలని భావిస్తున్న సామాన్యుడికి వస్తున్న సందేహాలు ఇవి. బడా బాబులు, రియల్టర్లు, వ్యాపారుల మాదిరిగా వీరికి సమాచారం సేకరించే నెట్వర్క్ ఉండదు. దీంతో ఏమాత్రం తొందరపడి ముందడుగు వేసినా నిండా మునిగిపోతామనే భయం ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఔటర్’ పరిధిలోని చెరువులకు సంబంధించిన సమాచారంతో ఓ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నారు. హెచ్ఎండీఏ ఆన్లైన్లో ఉంచినా.. రాజధానితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న చెరువులకు సంబంధించిన సమస్త సమాచారం ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) వద్ద ఉంది. ఈ విభాగం ప్రతి చెరువు, కుంట, ట్యాంక్‌కు ప్రత్యేక ఐడీ సైతం జారీ చేసింది. దానికి సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల లెక్కలతో పాటు వీటిని గుర్తిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ వివరాలనూ క్రోడీకరించింది. ఈ వివరాలన్నింటినీ మ్యాపులతో సహా అధికారిక వెబ్సైట్ (https:// lakes. hmda. gov. in) లో అందుబాటులో ఉంచింది. అయితే ఈ వివరాలు పూర్తి సాంకేతిక పదజాలంతో ఉండటంతో సామాన్యుడికి అర్థమయ్యే పరిస్థితి లేదు. టెస్ట్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్... ఇలా సాంకేతిక పరిభాష, అంకెలతో ఉన్న ఆ వివరాలను డీ కోడ్ చేయాలంటే సాధారణ ప్రజలు నిపుణుల సహాయం తీసుకోవాల్సివస్తోంది. లేనిపక్షంలో తాను ఖరీదు చేయబోతున్న ప్రాంతం వివరాల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.వివరాలన్నీ సరళంగా అందుబాటులో.. అదే సమయంలో ప్రస్తుతం హెచ్ఎండీఏ వద్ద అందుబాటులో ఉన్న వివరాలన్నింటినీ సరళంగా మార్చి హైడ్రా కోసం రూపొందించే ప్రత్యేక వెబ్‌సైట్‌తో పొందుపరచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆక్రమణలు సహా వివిధ అంశాలపై ఫిర్యాదులు చేయడానికి వాట్సాప్ నంబర్, ఈ–మెయిల్ ఐడీలతో పాటు యాప్‌ను హైడ్రా అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులోనే జియో ట్యాగింగ్ డేటాను పొందుపరుస్తారు. అవసరమైతే ఈ విషయంలో గూగుల్ మ్యాప్స్ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న ఎవరైనా ఓ ప్రాంతంలో నిల్చుని యాప్‌ను ఓపెన్ చేస్తే.. ఆ ఏరియా ఏదైనా చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల కిందికి వస్తుందా? అనేది స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వ భూములు, పార్కులు తదితరాలనూ ఈ యాప్‌లోకి తీసుకురావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భావిస్తున్నారు. నగరంలో ఉన్న చెరువుల్లో సర్వే, ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఫైనల్ వెరిఫికేషన్ ప్రక్రియలు పూర్తయినవి 54 ఉన్నాయి. వీటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై స్పష్టత ఉండటంతో తొలిదశలో వీటికే జియో ఫెన్సింగ్ చేయించనున్నారు. జియో ఫెన్సింగ్‌తో పరిరక్షించనున్న హైడ్రా సువిశాలంగా విస్తరించి ఉన్న నగరంలోని కొన్ని చెరువులు, పార్క్‌లు, ప్రభుత్వ స్థలాలపై నిఘా ఉంచడానికి డ్రోన్లు, సీసీ కెమెరాలు, గార్డుల వ్యవస్థ సైతం సరిపోదు. ఈ నేపథ్యంలో కీలకమైన వాటిని పరిరక్షించడానికి జియో ఫెన్సింగ్ విధానాన్ని అమలు చేయడానికి హైడ్రా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ), అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (అడ్రిన్) సహా మరికొన్ని సంస్థలతో సంప్రదింపులు జరపనున్నారు.వీరి సహకారంతో ఉపగ్రహాల ద్వారా ఆయా చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల హద్దులను పక్కాగా గుర్తించడంతో పాటు వాటికి జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా ఆ పరిధిలోకి వెళ్లి పూడ్చటానికి, నిర్మాణాలు చేపట్టడానికి సహా ఏ ఇతర ప్రయత్నం చేసినా ఆ కార్యకలాపాలను జియో ఫెన్సింగ్ ఆధారంగా శాటిలైట్లు గుర్తిస్తాయి. వెంటనే ఆ సమాచారాన్ని హైడ్రా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)తో పాటు కీలక అధికారులకు అందిస్తూ అప్రమత్తం చేస్తాయి. -
దారి మళ్లించిన నిధులతో దర్జా!
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి, ఆయన సోదరుడు జతిన్‌కుమార్ ‘సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ విస్తరణకు తీసుకున్న రూ.322.03 కోట్ల రుణాన్ని దారి మళ్లించి సీఆర్డీఏ పరిధిలో కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్‌కు వినియోగించారని బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. రుణాన్ని తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకుండా మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. వడ్డీతో కలిపి రుణం రూ.400.84 కోట్లకు చేరుకుందని, దీన్ని రికవరీ చేసేందుకు తనఖా ఆస్తులను మార్చి 23న ఈ–ఆక్షన్ విధానంలో వేలం వేస్తున్నామని తెలిపింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణాన్ని దారి మళ్లించిన సుజనా చౌదరి, జతిన్‌కుమార్ తదితరులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గతంలోనే మరో బ్యాంకు ఫిర్యాదు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెండు నెలల క్రితం ఇదే తరహాలో సుజానా చౌదరిపై ఫిర్యాదు చేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజ్జెక్ట్ లిమిటెడ్ పేరుతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రూ.304 కోట్ల రుణం తీసుకుని మోసగించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ఫిర్యాదుపై సీబీఐ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేందుకు సీబీఐ సిద్ధమైంది. విచారణలో పలు కేసులు.. చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరి తప్పుడు పత్రాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు టోపీ పెట్టి రూ.8 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకున్నారు. ఇందులో అధిక శాతం నిధులను 2004 నుంచి 2014 వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబుకు అందజేసినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సుజనా ఆర్థిక నేరాలపై పలు కేసులు విచారణలో ఉన్నాయి. ఆర్థిక నేరగాడైన సుజనా చౌదరిని చంద్రబాబు రాజ్యసభకు పంపడంతోపాటు 2014లో కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కేలా చేశారు. బ్యాంకును బురిడీ కొట్టించిన నిధులతో.. రాజధాని ప్రాంతంపై చంద్రబాబు నుంచి ముందే సమాచారం అందుకున్న సుజానా చౌదరి తన కంపెనీలు, సోదరుడు జతిన్‌కుమార్, కుటుంబ సభ్యుల పేర్లతో చౌకగా వేలాది ఎకరాలను సొంతం చేసుకున్నారు. అధిక శాతం భూములకు అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు చేయించుకుని రాజధాని ప్రకటన వెలువడిన తర్వాత 2016, 2017, 2018లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తాను కేంద్ర సహాయ మంత్రిగా ఉండటంతో బ్యాంకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి షెల్ కంపెనీల పేర్లతో భారీగా రుణాలు తీసుకున్నారు. 13.95 శాతం వడ్డీపై అక్టోబర్ 26, 2018న బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.322.03 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ డబ్బులతో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను విస్తరిస్తానని బ్యాంక్‌కు హామీ ఇచ్చారు. రుణానికి జతిన్‌కుమార్, స్నేహితుడు గొట్టిముక్కుల శ్రీనివాసరాజు, షెల్ కంపెనీలతో గ్యారంటీ ఇప్పించారు. అయితే ఈ డబ్బులను కంపెనీ విస్తరణకు కాకుండా రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలుకు వినియోగించుకున్నారు. ఆధారాలతో సీబీఐకి బ్యాంకు ఫిర్యాదు.. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తీసుకున్న రుణాన్ని మళ్లించి 2018 నవంబర్ 13న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో 623.12 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా ఈ నిధులను మళ్లించినట్లు గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధారాలతో సీబీఐకి ఫిర్యాదు చేసింది. -
గ్రీన్‌లాండ్‌ను కొనేద్దామా!
వాషింగ్టన్/స్టాక్‌హోమ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలోనే అదిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్‌పై కన్నేశారు. ‘డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడం వీలవుతుందా?’ అని ట్రంప్ తన సలహాదారుల అభిప్రాయాన్ని కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అపారమైన సహజవనరులతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం కావడంతో గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ దృష్టి సారించారు. డెన్మార్క్‌లో ప్రావిన్స్ అయిన గ్రీన్లాండ్కు స్వయంప్రతిపత్తి ఉంది. 20 లక్షల చదరపు కి.మీ విస్తీర్ణం గల గ్రీన్లాండ్ జనాభా 57వేలు. ఈ ద్వీపంలోని 85 శాతం భూభాగంపై 3 కి.మీ మందంతో మంచుదుప్పటి కప్పుకుంది. ట్రంప్ ప్రతిపాదనపై కొందరు సన్నిహితులు స్పందిస్తూ..‘గ్రీన్లాండ్లోని తూలేలో అమెరికాకు ఇప్పటికే వైమానిక స్థావరం ఉంది. కాబట్టి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం వ్యూహాత్మకమే’ అని తెలిపారు. అయితే అధికారం నుంచి తప్పుకునేలోపు తనపేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసేందుకే ట్రంప్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు. 1946లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ గ్రీన్‌లాండ్‌ను తమకు అమ్మితే రూ.712.47 కోట్లు ఇస్తామని చెప్పగా, ఈ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది. గ్రీన్లాండ్లో విస్తారమైన హైడ్రోకార్బన్ నిక్షేపాలు, అరుదైన ఖనిజాలు, తీర ప్రాంతంపై అమెరికా అమితాసక్తితో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం వికీలీక్స్ బయటపెట్టింది. మేం అమ్మకానికి లేం: గ్రీన్లాండ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనను గ్రీన్లాండ్ ఖండించింది. ఈ విషయమై గ్రీన్లాండ్ విదేశాంగ శాఖ స్పందిస్తూ..‘అమెరికాతో వ్యాపారానికి మా తలుపులు తెరిచిఉంటాయి. కానీ గ్రీన్లాండ్ అమ్మకానికి మేం సిద్ధంగా లేం. సహజవనరులు, చేపలు, పునరుత్పాదక విద్యుత్, సాహస క్రీడలకు గ్రీన్లాండ్ నెలవు’ అని స్పష్టం చేసింది. గ్రీన్లాండ్ మాజీ ప్రధాని లార్స్ రాముస్సేన్ మాట్లాడుతూ..‘ట్రంప్ ఏప్రిల్ ఫూల్ జోక్ చేస్తున్నారనుకుంటా. కానీ ఇది సీజన్ కాదుగా’ అని వ్యాఖ్యానించారు. మూడుదేశాల వలస పాలనలో.. గ్రీన్‌లాండ్‌ను 13వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దంవరకూ నార్వే పాలించింది. 1499లో పోర్చుగీసు వారు ఈ ద్వీపం తమదని ప్రకటించుకున్నారు. 18వ శతాబ్దం ఆరంభంలో గ్రీన్‌లాండ్‌ను ఉమ్మడిగా పరిపాలించాలని డెన్మార్క్–నార్వే నిర్ణయించాయి. 1814లో నార్వే–స్వీడన్ విడిపోవడంతో గ్రీన్‌లాండ్‌పై అధికారాలు డెన్మార్క్‌కు దక్కాయి. గ్రీన్లాండ్లో మెజారిటీ ఇన్యుట్ జాతిప్రజలే. వీరంతా గ్రీన్లాండిక్ భాష మాట్లాడుతారు. దీంతో ఈ ప్రాంతంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా కాలనీగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ 1953లో విలీనం చేసుకుంది. డానిష్ భాషను తప్పనిసరి చేసింది. దీంతో ఉన్నతవిద్య కోసం పలువురు గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్‌కు వెళ్లడం ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతమైనా గ్రీన్లాండ్ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష బయలుదేరింది. దీంతో డెన్మార్క్ 1972లో హోంరూల్ చట్టం తీసుకొచ్చింది. విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, సహజవనరులు మినహా అన్ని అధికారాలను స్థానిక ప్రభుత్వానికి అప్పగించింది. 2008లో జరిగిన రెఫరెండంలో మరిన్ని అధికారాలు కావాలని గ్రీన్లాండర్లు తీర్పునిచ్చారు. దీంతో పోలీస్, న్యాయ వ్యవస్థలు, సహజవనరులు, విమానయానం, సరిహద్దు చట్టాలు చేసే అధికారం గ్రీన్లాండ్కు దక్కాయి. -
భూ దందా!
⇒ పేదల భూముల చుట్టూ ఓ ఉన్నతాధికారి ‘చక్ర’బంధం ⇒ ‘అనంతసాగర్’లో కేర్ టేకర్ పేరుతో దళారీకి కబ్జా బాధ్యతలు ⇒ బినామీ పేర్లు, తప్పుడు పత్రాలతో 300 ఎకరాల విక్రయం ⇒ అమ్మకానికి సిద్ధంగా మరో 300 ఎకరాలు ⇒ సాగు భూముల నుంచి గిరిజనుల గెంటివేత సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆయన ఒక అత్యున్నతస్థాయి అధికారి. అధికార బలాన్ని, వారసత్వంగా వచ్చిన కొంత భూమిని అడ్డం పెట్టుకొని మరో 700 ఎకరాలకు ఎసరు పెట్టారు. కేర్ టేకర్ పేరుతో ఓ దళారిని సృష్టించి పట్టా భూముల మీదకు ఉసిగొల్పారు. సదరు అధికారి తండ్రి నుంచే భూములు కొనుగోలు చేసి ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజనులనూ వదల్లేదు. బినామీ పేర్లు, తప్పుడు పత్రాలతో ఇప్పటికే 300 ఎకరాలు అమ్మివేశారు. మరో 300 ఎకరాలు అమ్మకానికి పెట్టారు. కొంత కాలంగా మెదక్ మండలం అనంతసాగర్ భూముల్లో టీఎస్ ఆర్టీసీ జేఎండీ జీవీ రమణారావు ఉసిగొల్పిన కేర్‌టేకర్ రఘు సాగిస్తున్న కబ్జా కాండపై ‘సాక్షి’పరిశీలనాత్మక కథనం. మెదక్ మండలం అనంతసాగర్ గ్రామంలోని హఫీజా బేగం అనే మహిళ నుంచి 1 నుంచి 51 సర్వే నంబర్లలోని 845 ఎకరాల భూమిని 1960లో నర్సింహారెడ్డి, జనార్దన్‌రావు, సూర్యారావుతోపాటు మరో ఐదుగురు కలసి కొనుగోలు చేశారు. వీరు ఏనాడు భూమిని సాగు చేయలేదు. వీరిలో కొందరు తమ వాటా భూములను గిరిజనులకు అమ్ముకున్నారు. అమ్ముకున్న వారిలో టీఎస్ ఆర్టీసీ జేఎండీ రమణారావు తండ్రి జనార్దన్‌రావు కూడా ఉన్నారు. అక్రమాల ‘పట్టా’..: 2012లో జీవీ రమణారావు సర్వే నంబర్ 23ఉ, 1ఉ, 2ఉ, 19ఉ, 27ఈ, 28ఉ, 35ఉ, 43ఉ, 50ఉ, 51ఉ, 36ఉ లోని 103.16 ఎకరాలు తన తండ్రి వారసత్వంగా వచ్చిన భూమిని తనకు పౌతీ చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి రమణారావుకు అనువంశికంగా సంక్రమించే భూమి అంత ఉండదు. ఆయన తండ్రి జనార్దన్‌రావు సంపాదించిన 104 ఎకరాల భూమిలో ఆయనే 1975 నుంచి 1986 వరకు దాదాపు 60 నుంచి 70 ఎకరాల భూమిని దళిత, గిరిజనులకు అమ్ముకున్నారు. అప్పట్లో ఎకరాకు రూ. వెయ్యి నుంచి 5 వేల వరకు వెచ్చించి శేరిశంకర్ తాండా, తిమ్మాయిపల్లి రైతులు కొనుక్కున్నారు. క్రయవిక్రయాల రశీదులు, భూ విక్రయ పత్రాలు గిరిజనుల వద్ద ఉన్నాయి. అయితే అక్షరజ్ఞానం పెద్దగాలేని వారు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కొంతమంది అసలు పట్టానే చేయించుకోలేదు. కానీ తరతరాలుగా అదే భూమిని దున్నుకొని బతుకుతున్నారు. అత్యున్నత స్థాయి ఉద్యోగిగా ఉన్న రమణారావు విలువలకు కట్టుబడి తన తండ్రి నుంచి భూములు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న గిరిజనులకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాల్సి ఉంది. కానీ ఆయన అందుకు విరుద్ధంగా భూమిని అంతా ఆయన పేరుతో పట్టా చేయించుకున్నారు. రమణారావు ఉసిగొల్పిన దళారి... 2012లోనే రమణారావు తన భూమికి పి.రఘు అనే వ్యక్తికి కేర్‌టేకర్ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడే ఆయన అక్రమానికి తెర లేపారు. తన భూమితోపాటు చిన్నాన్న గండ్ర సూర్యారావు భూమికి కూడా రఘు కేర్‌టేకర్‌గా ఉంటారని రాసిచ్చారు. సూర్యారావుకు కూడా 104 ఎకరాల వాటా ఉంది. ఆయనకు 4 కుమారులు, ఒక కుమార్తె ఉండగానే వారికి తెలియకుండా ఆయన సంరక్షణ బాధ్యతలు మరో వ్యక్తికి అప్పగించడంతో రమణారావు ఉద్దేశం బట్టబయలు అయింది. ఇక రఘు ఫోర్జరీ సంతకాలతో 854/14 2253/14, 3304/2014, 2254/2014, 2027/2014, 1127/2014 డాక్యుమెంట్ నంబర్లతో జై భారత్‌రెడ్డి ఆయన బంధువులకు 199 ఎకరాలు విక్రయించారు. ఇందులో 854/14, 3304/14 డాక్యుమెంట్లలో మాత్రమే రమణారావు సంతకాలు ఉన్నాయి. రఘు చేసిన ఫొర్జరీ పత్రాలను ‘సాక్షి’ సేకరించింది. 0168 పట్టా నంబర్‌తో మరో పాసు పుస్తకాన్ని సృష్టించి మరికొంత భూమిని ఆక్రమించారు. సర్వే నంబర్ 1, 2, 50లలో ఆయనకు సంబంధంలేని 14 ఎకరాల భూమిని రమణారావు పేరు మీద పట్టా చేయించి, ఆ మొత్తం భూమినీ విక్రయించారు. తాజాగా రఘు మరో 250 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ చేయించాడు. జనార్దన్‌రావుతోపాటు హక్కుదారులుగా ఉన్న వారి భూములను మింగేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా ఫెన్సింగ్ వేసిన భూమి రమణారావుదేనని, ఆయన చెప్తేనే ఫెన్సింగ్ చేయించానని రఘు చెబుతున్నాడు. విచిత్రం ఏమిటంటే రమణారావు వంశానికి సంబంధంలేని పల్లె పోచమ్మ తల్లి గుడి మాన్యాన్ని కూడా ఇటీవల రఘు విక్రయించారు. దీనిపై వివాదం చెలరేగటంతో రమణారావు.. స్థానిక నేతకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని కోరినట్టు తెలిసింది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నోరు మెదపకపోవడం గమనార్హం. గొల్లుమంటున్న గిరిజనులు: భూ సీలింగ్ చట్టం 1973 ప్రకారం అనంతసాగర్‌లో ప్రొసీడింగ్ నంబర్ సీఆర్/6497/1978తో సర్వే నంబర్ 24లో 6.46 ఎకరాలను ఐదుగురికి, 1985లో 2394/ఎస్జీడీ/75 ప్రొసీడింగ్ సీసీ నంబర్‌తో సర్వే నంబర్ 27లో 42.36 ఎకరాలను 41 మంది గిరిజనులకు, 1991లో సర్వే నంబర్ 27లో ప్రొసీడింగ్ నంబర్ డీ/5676/91 ఉత్తర్వుతో 22.25 ఎకరాలను 17 మంది లబ్ధిదారులకు ఇస్తున్నట్లు రికార్డులు ఉన్నాయి. మొత్తం 71.02 ఎకరాల్లో దాదాపు 63 మంది దళిత, గిరిజనులకు పట్టాలు చేశారు. అంతకుముందే 30 మంది రైతులకు 13/బి కింద అధికారులు ఒక్కొక్కరికి 1:10 గుంటల చొప్పున పట్టాలిచ్చారు. ఇవే పాసుపుస్తకాలను రైతులు ఏడీబీ బ్యాంకులో తాకట్టుపెట్టి రుణాలు తీసుకొని బోర్లు వేయించి, సాగు కూడా చేస్తున్నారు. తాజాగా వారిని భూముల నుంచి వెళ్లగొట్టారు. బోర్లు పూడ్చి వేయిం చారు. గత రబీ సీజన్లో పొట్టకొచ్చిన మొక్కజొన్న, పూతకొచ్చిన పత్తిని పూర్తిగా ధ్వంసం చేయించారు. ఈ దుర్మార్గాన్ని కళ్లారా చూసిన శేరిశంకర్ తండాకు చెందిన కాట్రోత్ జమ్ల, కాట్రోత్ బద్రు గుండె పగిలి చనిపోయారు. అదే భూమిలో జమ్లి, బద్రుల మృతదేహాలను ఖననం చేయగా వాటిని బయటకు తీయించి అడవిలోకి విసిరేయించినట్లు మృతుల బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. గూండాలతో కొట్టించారు మా కండ్ల ముందే పంటను దున్నేశారు. పంట పోయిందని మా అయ్య బద్రుకు గుండెపోటు వచ్చి చనిపోయిండు. మాది పట్టా భూమి. మమ్ములను గూండాలతో కొట్టించి సాగు చేసుకుంటున్న భూమి నుంచి తరిమేశారు. - కాట్రోత్ బలరాం, శేరిశంకర్ తండా మేం దున్నుకున్నది మా పట్టా భూములే మేం దున్నుకుంటున్నది మా పట్టా భూములే. ఎక్కడి నుంచి వచ్చాడోకానీ మా పంటచేలను దున్నేసి మా భూములను గుంజుకున్నడు. ఈ భూములను గుంజుకుంటే మాకు బతుకుదెరవు లేదని కాళ్లమీదపడ్డా కనికరించలేదు. - రనుజ, శేరిశంకర్ తండా నా భూమి నేను అమ్ముకుంటున్నా: రమణారావు ఈ వ్యవహారంపై జీవీ రమణారావును వివరణ కోరగా తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని అమ్ముకున్నానని, స్థానికంగా ఏం జరుగుతుందో తనకు తెలియదని చెప్పారు. గుడి భూమి అమ్మినట్టు తెలియదన్నారు. మీ చిన్నాన్న భూమికి మీరు ఎలా వారసులవుతారని అడగ్గా ఉన్నతాధికారినైన తనను ప్రశ్నించడం ఏమిటని ఎదురు ప్రశ్నించారు. దీనిపై తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేర్‌టేకర్ రఘుతో మాట్లాడగా... తాను అమ్ముతున్న భూమి జీవీ రమణారావుది మాత్రమేనని, ఆయన కేర్‌టేకర్‌గా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. రమణారావుకు 104 ఎకరాలే ఉండగా 250 ఎకరాలు ఎలా విక్రయించారని ప్రశ్నించగా నర్సింహారెడ్డి భూములు అమ్మినట్లు చెప్పారు.