దారి మళ్లించిన నిధులతో దర్జా! | Company took a loan for expansion and Purchased lands in Amaravati | Sakshi
Sakshi News home page

దారి మళ్లించిన నిధులతో దర్జా!

Published Sat, Feb 22 2020 5:04 AM | Last Updated on Sat, Feb 22 2020 11:05 AM

Company took a loan for expansion and Purchased lands in Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్‌ సుజనా చౌదరి, ఆయన సోదరుడు జతిన్‌కుమార్‌ ‘సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌’ విస్తరణకు తీసుకున్న రూ.322.03 కోట్ల రుణాన్ని దారి మళ్లించి సీఆర్‌డీఏ పరిధిలో కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్‌కు వినియోగించారని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. రుణాన్ని తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకుండా మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. వడ్డీతో కలిపి రుణం రూ.400.84 కోట్లకు చేరుకుందని, దీన్ని రికవరీ చేసేందుకు తనఖా ఆస్తులను మార్చి 23న ఈ–ఆక్షన్‌ విధానంలో వేలం వేస్తున్నామని తెలిపింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణాన్ని దారి మళ్లించిన సుజనా చౌదరి, జతిన్‌కుమార్‌ తదితరులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. 

గతంలోనే మరో బ్యాంకు ఫిర్యాదు 
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా రెండు నెలల క్రితం ఇదే తరహాలో సుజానా చౌదరిపై ఫిర్యాదు చేసింది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజ్జెక్ట్‌ లిమిటెడ్‌ పేరుతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రూ.304 కోట్ల రుణం తీసుకుని మోసగించినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేసిన ఫిర్యాదుపై సీబీఐ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేందుకు సీబీఐ సిద్ధమైంది.  

విచారణలో పలు కేసులు.. 
చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరి తప్పుడు పత్రాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు టోపీ పెట్టి రూ.8 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకున్నారు. ఇందులో అధిక శాతం నిధులను 2004 నుంచి 2014 వరకు  టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబుకు అందజేసినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సుజనా ఆర్థిక నేరాలపై పలు కేసులు విచారణలో ఉన్నాయి. ఆర్థిక నేరగాడైన సుజనా చౌదరిని చంద్రబాబు రాజ్యసభకు పంపడంతోపాటు 2014లో కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కేలా చేశారు.  

బ్యాంకును బురిడీ కొట్టించిన నిధులతో.. 
రాజధాని ప్రాంతంపై చంద్రబాబు నుంచి ముందే సమాచారం అందుకున్న సుజానా చౌదరి తన కంపెనీలు, సోదరుడు జతిన్‌కుమార్, కుటుంబ సభ్యుల పేర్లతో చౌకగా వేలాది ఎకరాలను సొంతం చేసుకున్నారు. అధిక శాతం భూములకు అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు చేయించుకుని రాజధాని ప్రకటన వెలువడిన తర్వాత 2016, 2017, 2018లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. తాను కేంద్ర సహాయ మంత్రిగా ఉండటంతో బ్యాంకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి షెల్‌ కంపెనీల పేర్లతో భారీగా రుణాలు తీసుకున్నారు. 13.95 శాతం వడ్డీపై అక్టోబర్‌ 26, 2018న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.322.03 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ డబ్బులతో సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ను విస్తరిస్తానని బ్యాంక్‌కు హామీ ఇచ్చారు. రుణానికి జతిన్‌కుమార్, స్నేహితుడు గొట్టిముక్కుల శ్రీనివాసరాజు, షెల్‌ కంపెనీలతో గ్యారంటీ ఇప్పించారు. అయితే ఈ డబ్బులను కంపెనీ విస్తరణకు కాకుండా రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలుకు వినియోగించుకున్నారు. 

ఆధారాలతో సీబీఐకి బ్యాంకు ఫిర్యాదు..
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సర్వే నెంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొనుగోలు చేసి అగ్రిమెంట్‌ చేసుకున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద తీసుకున్న రుణాన్ని మళ్లించి 2018 నవంబర్‌ 13న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సీఆర్‌డీఏ పరిధిలో 623.12 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి కూడా ఈ నిధులను మళ్లించినట్లు గుర్తించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధారాలతో సీబీఐకి ఫిర్యాదు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement