సుజనాకు మరో భారీ షాక్‌ | Bank Of India Issue Action Notice To Sujana Chowdary | Sakshi
Sakshi News home page

సుజనా చౌదరికి మరో భారీ షాక్‌

Published Thu, Feb 20 2020 8:58 PM | Last Updated on Thu, Feb 20 2020 9:30 PM

Bank Of India Issue Action Notice To Sujana Chowdary - Sakshi

సాక్షి, అమరావతి : చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి మరోసారి భారీ షాక్ తగిలింది. ఆయన పవర్‌ ఆఫ్‌ అటార్నీగా ఉన్న పలు ఆస్తులను వేలం వేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మార్చి 23, 2020న ఈ వేలం పాట జరగనుంది. మార్చి 20న సుజనా ఆస్తులను తనిఖీ చేసుకోవచ్చన్న బ్యాంకు.. మొత్తం రూ.400 కోట్ల 84లక్షల 35వేల బకాయి ఉన్నట్టు తెలిపింది. తీసుకున్న రుణ బకాయిలు చెల్లించకపోవడంతో.. ఆ సంస్థ తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయనున్నట్లు బ్యాంక్ నోటీసుల్లో తెలిపింది. రుణం జమానతు ఇచ్చిన వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు బ్యాంక్ చెబుతోంది.

బ్యాంకు ఆఫ్ ఇండియాలో సుజనా యునివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరుతో 320 కోట్ల మొత్తం రుణం తీసుకున్నారు. రుణానికి గ్యారంటీ దారులుగా సుజనా చౌదరి, మరో 11మంది ఉన్నారు. సుజనా క్యాపిటల్ సర్వీసెస్, సుజనా పంప్స్&మోటార్స్, స్ల్పెండెడ్ మెటల్ ప్రొడక్ట్స్, న్యూకాన్ టవర్స్ తదితర కంపెనీలు గ్యారంటీగా ఉన్నాయి. 

బ్యాంకును మోసగించిన కేసులో 2018లో మూడు కేసులు నమోదు కాగా.. ఇప్పటికే నాగార్జునహిల్స్‌లోని సుజనా కార్యాలయాలపై సీబీఐ దాడులు జరిగాయి. సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉమ్మడి సోదాలు జరిగాయి. మొత్తమ్మీద రూ.5700 కోట్ల మేర బ్యాంకులకు సుజనా కంపెనీలు టోపీ పెట్టినట్టు గుర్తించాయి. ఆ సోదాల్లో ఏకంగా 126 షెల్ కంపెనీలు గుర్తించారు. ఫెరారీ, బెంజ్, రేంజ్ రోవర్ కార్లను కూడా అప్పట్లో అధికారులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

వేలం పాట కింద సుజనా ఆస్తుల విలువలను బ్యాంక్‌ పేర్కొంది. తమిళనాడులో వై.శివలింగప్రసాద్ పేరుతో 6300 చదరపు అడుగుల భూమి, శ్రీపెరంబూదూరులో ఎస్.టి.ప్రసాద్ పేరుతో 7560 చదరపు అడుగుల భూమి, శ్రీపెరంబూదూరులో శివరామకృష్ణ పేరుతో 7700 చదరపు అడుగుల భూమి, కొలుత్తువంచెర్రీ గ్రామంలో వైఎస్ చౌదరి పేరుతో 7700చదరపు అడుగుల భూములను వేలం వేస్తామని బ్యాంకు ప్రకటించింది.  అన్ని ఆస్తులకు పవర్ ఆఫ్ అటార్నీగా సుజనా చౌదరి ఒక్కరే ఉండడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement