Yalamanchili Satyanarayana Chowdary
-
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సుజనా అడ్డగింత
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మాజీ నేత (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు), రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరిని (సుజనా చౌదరి) ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. గురువారం ఆయన అమెరికా వెళ్తుండగా... ఆయనపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయి ఉన్న కారణంగా అధికారులు నిలిపేసి... దేశం దాటి వెళ్లకూడదంటూ వెనక్కి పంపేశారు. నిజానికి బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ సంస్థకు సంబంధించి జరిగిన ఫ్రాడ్ వ్యవహారంలో 2016 ఏప్రిల్ 27న సుజనా చౌదరిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఆ తరవాత విచారణ జరుగుతూ వస్తోంది. ఇందులో భాగంగా ఆయన దేశం దాటి వెళ్లిపోకుండా గత ఏడాది జూన్ 18న సీబీఐ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. రకరకాల డొల్ల కంపెనీలను పెట్టి, లేని టర్నోవర్‌ను చూపించి... వాటి ఆధారంగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని, దాదాపు 10వేల కోట్లు ఎగ్గొట్టిన వ్యవహారంలోనూ సుజనా నిందితుడు. తమకు అప్పు ఎగవేశారంటూ గతంలో మారిషస్ బ్యాంకు ఏకంగా ఇండియాకు వచ్చి మరీ ఇక్కడ కేసు దాఖలు చేసింది. కోర్టులో పిటిషన్; అనుమతి మంజూరు ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న నేపథ్యంలో తనను అమెరికా వెళ్లేందుకు అనుమతించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సుజనా చౌదరికి అక్కడ ఊరట లభించింది. అమెరికా వెళ్లేందుకు అనుమతిస్తూనే... భారత్‌కు తిరిగి వచ్చే తేదీని సీబీఐకి ఇవ్వాలని, భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత సీబీఐకి సమాచారం అందించాలని షరతు విధించింది. న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలోని సుజనాచౌదరి బంధువు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆయన్ను చూసేందుకు వెళుతున్నారు కనుక అనుమతించాలంటూ సుజనా తరఫున సీనియర్ న్యాయవాది మాథూర్ హౌస్ మోషన్ దాఖలు చేసి వాదనలు వినిపించారు. గతేడాది జూన్ 18న సీబీఐ లుక్ఔట్ నోటీసులు జారీచేసిందని, దీని గడువు ఏడాది మాత్రమేనని మాథూర్ తెలిపారు. అయితే దీని గడువును మరో ఏడాది పొడిగించామని సీబీఐ స్పెషల్ పీపీ సురేందర్ చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్నాక న్యాయమూర్తి అనుమతి మంజూరు చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
దారి మళ్లించిన నిధులతో దర్జా!
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి, ఆయన సోదరుడు జతిన్‌కుమార్ ‘సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ విస్తరణకు తీసుకున్న రూ.322.03 కోట్ల రుణాన్ని దారి మళ్లించి సీఆర్డీఏ పరిధిలో కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్‌కు వినియోగించారని బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. రుణాన్ని తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకుండా మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. వడ్డీతో కలిపి రుణం రూ.400.84 కోట్లకు చేరుకుందని, దీన్ని రికవరీ చేసేందుకు తనఖా ఆస్తులను మార్చి 23న ఈ–ఆక్షన్ విధానంలో వేలం వేస్తున్నామని తెలిపింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణాన్ని దారి మళ్లించిన సుజనా చౌదరి, జతిన్‌కుమార్ తదితరులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గతంలోనే మరో బ్యాంకు ఫిర్యాదు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెండు నెలల క్రితం ఇదే తరహాలో సుజానా చౌదరిపై ఫిర్యాదు చేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజ్జెక్ట్ లిమిటెడ్ పేరుతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రూ.304 కోట్ల రుణం తీసుకుని మోసగించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ఫిర్యాదుపై సీబీఐ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేందుకు సీబీఐ సిద్ధమైంది. విచారణలో పలు కేసులు.. చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరి తప్పుడు పత్రాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు టోపీ పెట్టి రూ.8 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకున్నారు. ఇందులో అధిక శాతం నిధులను 2004 నుంచి 2014 వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబుకు అందజేసినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సుజనా ఆర్థిక నేరాలపై పలు కేసులు విచారణలో ఉన్నాయి. ఆర్థిక నేరగాడైన సుజనా చౌదరిని చంద్రబాబు రాజ్యసభకు పంపడంతోపాటు 2014లో కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కేలా చేశారు. బ్యాంకును బురిడీ కొట్టించిన నిధులతో.. రాజధాని ప్రాంతంపై చంద్రబాబు నుంచి ముందే సమాచారం అందుకున్న సుజానా చౌదరి తన కంపెనీలు, సోదరుడు జతిన్‌కుమార్, కుటుంబ సభ్యుల పేర్లతో చౌకగా వేలాది ఎకరాలను సొంతం చేసుకున్నారు. అధిక శాతం భూములకు అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు చేయించుకుని రాజధాని ప్రకటన వెలువడిన తర్వాత 2016, 2017, 2018లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తాను కేంద్ర సహాయ మంత్రిగా ఉండటంతో బ్యాంకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి షెల్ కంపెనీల పేర్లతో భారీగా రుణాలు తీసుకున్నారు. 13.95 శాతం వడ్డీపై అక్టోబర్ 26, 2018న బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.322.03 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ డబ్బులతో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను విస్తరిస్తానని బ్యాంక్‌కు హామీ ఇచ్చారు. రుణానికి జతిన్‌కుమార్, స్నేహితుడు గొట్టిముక్కుల శ్రీనివాసరాజు, షెల్ కంపెనీలతో గ్యారంటీ ఇప్పించారు. అయితే ఈ డబ్బులను కంపెనీ విస్తరణకు కాకుండా రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలుకు వినియోగించుకున్నారు. ఆధారాలతో సీబీఐకి బ్యాంకు ఫిర్యాదు.. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తీసుకున్న రుణాన్ని మళ్లించి 2018 నవంబర్ 13న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో 623.12 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా ఈ నిధులను మళ్లించినట్లు గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధారాలతో సీబీఐకి ఫిర్యాదు చేసింది. -
వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి...
టీడీపీ నాయకుడు సుజానా చౌదరి తొలిసారిగా కేంద్ర కేబినెట్ లో దక్కించుకున్నారు. కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం(నవంబర్ 9) ప్రమాణస్వీకారం చేశారు. పారిశ్రామికవేత్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన తర్వాత రాజకీయాలవైపు అడుగులు వేశారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటూ టీడీపీలో వడివడిగా ఎదిగారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగుపట్టిన ఆయన కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పటివరకు పత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కడం విశేషం. వ్యక్తిగత, కుటుంబ వివరాలు పూర్తిపేరు: యలమంచిలి సత్యనారాయణ చౌదరి జన్మదినం:1961 జూన్ 2 వయసు: 53 తల్లిదండ్రులు: జనార్దనరావు, సుశీల కుమారి భార్య: పద్మజ పిల్లలు: కుమార్తె, కుమారుడు విద్యార్హత: మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ పార్టీ: టీడీపీ రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్ నివాసం: హైదరాబాద్ రాజకీయ నేపథ్యం రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్తగా సుపరిచితుడు. సుజనా గ్రూప్ కంపెనీల వ్యవస్థాపకుడు తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేయలేదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు 2010 జూన్ 22న తొలిసారి రాజ్యసభకు ఎన్నిక 2014 నవంబర్ 9న కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం -
టీడీపీపీ నేతగా సుజనా
* కార్యదర్శిగా నిమ్మల * లోక్‌సభలో పార్టీ నేతగా తోట నరసింహం * రాజ్యసభలో పార్టీ నేతగా టి.దేవేందర్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ వీవీవీ చౌదరి బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం జరిగిన టీడీపీ ఎంపీల సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతను ఎంపిక చేసే అధికారాన్ని అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీపీ కార్యవర్గాన్ని నియమించారు. టీడీపీపీ కార్యదర్శిగా నిమ్మల కిష్టప్ప (హిందూపురం), కోశాధికారిగా తోట సీతారామలక్ష్మి (రాజ్యసభ, పశ్చిమ గోదావరి) నియమితులయ్యారు. లోక్‌సభలో పార్టీ నేతగా తోట నరసింహం (కాకినాడ), ఉప నాయకునిగా డాక్టర్ ఎన్. శివప్రసాద్ (చిత్తూరు), విప్‌గా కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం)లను నియమించారు. రాజ్యసభలో పార్టీ పక్ష నేతగా టి. దేవేందర్‌గౌడ్(రంగారెడ్డి) కొనసాగుతారు. ఉప నేతగా సీఎం రమేష్ (వైఎస్సార్ జిల్లా), విప్‌గా గుండు సుధారాణి(వరంగల్)ని నియమించారు. టీడీపీపీ జాతీయ అధికార ప్రతినిధులుగా గల్లా జయదేవ్(గుంటూరు), కింజారపు రామ్మోహన్నాయుడు (శ్రీకాకుళం), చామకూర మల్లారెడ్డి (మల్కాజ్గిరి) నియమితులయ్యారు.