టీడీపీపీ నేతగా సుజనా
* కార్యదర్శిగా నిమ్మల
* లోక్‌సభలో పార్టీ నేతగా తోట నరసింహం
* రాజ్యసభలో పార్టీ నేతగా టి.దేవేందర్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ వీవీవీ చౌదరి బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం జరిగిన టీడీపీ ఎంపీల సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతను ఎంపిక చేసే అధికారాన్ని అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీపీ కార్యవర్గాన్ని నియమించారు.
టీడీపీపీ కార్యదర్శిగా నిమ్మల కిష్టప్ప (హిందూపురం), కోశాధికారిగా తోట సీతారామలక్ష్మి (రాజ్యసభ, పశ్చిమ గోదావరి) నియమితులయ్యారు. లోక్‌సభలో పార్టీ నేతగా తోట నరసింహం (కాకినాడ), ఉప నాయకునిగా డాక్టర్ ఎన్. శివప్రసాద్ (చిత్తూరు), విప్‌గా కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం)లను నియమించారు. రాజ్యసభలో పార్టీ పక్ష నేతగా టి. దేవేందర్‌గౌడ్(రంగారెడ్డి) కొనసాగుతారు. ఉప నేతగా సీఎం రమేష్ (వైఎస్సార్ జిల్లా), విప్‌గా గుండు సుధారాణి(వరంగల్)ని నియమించారు. టీడీపీపీ జాతీయ అధికార ప్రతినిధులుగా గల్లా జయదేవ్(గుంటూరు), కింజారపు రామ్మోహన్‌నాయుడు (శ్రీకాకుళం), చామకూర మల్లారెడ్డి (మల్కాజ్‌గిరి) నియమితులయ్యారు.