బెజ్జూర్: మండలంలో ఇన్‌చార్జీల పాలన కొనసాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో సకాలంలో సేవలు అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఆయా శాఖల్లో ప్రభుత్వం నియమించిన ఇన్‌చార్జీలు పూర్తిస్థాయిలో ఇక్కడ పని చేయలేకపోతున్నారని దీంతో ప్రజలకు న్యాయం జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. మండలంలో తహసీల్దార్, పశువైద్యాధికారి, టీజీబీ మేనేజర్, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రెగ్యులర్ అధికారులు లేక ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు.
మండలానికి వచ్చేందుకు విముఖత..
మండలంలో రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో మండల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ శ్రీపాల్ రెడ్డి గత ఆగస్టు 8న బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నియమించిన అధికారి ఇక్కడికి రావడానికి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఆయా తహసీల్దార్లను బెజ్జూర్‌కు వెళ్లాలని ఉన్నతాధికారులు చెబుతున్నా వారు ససేమిరా అంటున్నట్లు సమాచారం. దీంతో నెలరోజుల నుంచి డెప్యూటీ తహసీల్దార్ బ్రహ్మేశ్వరరావు ఇన్‌చార్జి తహసీల్దార్‌గా వ్యవహరిస్తున్నారు.
పశు వైద్యాధికారి లేక ఇబ్బందులు..
మండల కేంద్రంలో పశు వైద్యాధికారి లేకపోవడంతో రైతులు, పాడి పోషకులు అనేక అవస్థలు పడుతున్నారు. గత రెండేళ్లుగా ఇక్కడ రెగ్యులర్ పశువైద్యాధికారి లేకపోవడంతో పెంచికల్‌పేట పశువైద్యాధికారి రాకేశ్‌ను ఇన్‌చార్జీగా నియమించారు. ఆయ న అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షాకాలంలో గాలికుంటు వ్యాధి, సీజనల్ వ్యాధులతో పశువులు అల్లాడిపోతున్నాయని పేర్కొంటున్నారు.
రైతులకు అందని బ్యాంక్ సేవలు
బెజ్జూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మూడు నెలల క్రితం అనారోగ్య కారణాలతో మెడికల్ లీవ్ తీసుకున్నారు. మేనేజర్‌ను ఉన్నతాధికారులు బదిలీ చేయగా.. పెంచికల్‌పేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ రవికుమార్‌ను ఇక్కడ ఇన్‌చార్జి మేనేజర్‌గా నియమించారు.
రెగ్యులర్ మేనేజర్ కావడంతో రైతులకు రుణాల రెన్యూవల్‌లో ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్‌చార్జి మేనేజర్ కావడంతో సకాలంలో సేవలు అందడం లేదని బ్యాంకు ఖాతాదారులు వాపోతున్నారు.
విద్యార్థులకు తప్పని తిప్పలు
మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఇటీవల పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. కుంటలమానేపల్లి ప్రధానోపాధ్యాయుడు ఇక్కడ ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు.
సదరు ఉపాధ్యాయుడు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటూ విద్యా బోధన చేయాల్సి ఉన్నా అలా జరగడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment