
అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చా?
గూడూరు : అధికారం ఉంటే ఎక్కడైనా, ఏదైనా ఏర్పాటు చేయెచ్చేమో మరి...అదెలా అనుకుంటున్నారా.. ఈ ఫ్లెక్సీలను చూస్తేనే ఆ అధికార దర్పమేమిటో తెలుస్తోంది. అవి రెండూ ప్రభుత్వ కార్యాలయాలు.. ఒకటి చిల్లకూరు పోలీస్‌స్టేషన్ కాగా, మరొకటి రెవెన్యూ కార్యాలయం. ఆ ప్రాంతంలో ఓ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా సామాన్య మానవుడు ఆయా కార్యాలయాల ముందు ఏదైనా అడ్డుగా పెడితే వారికి నరకం చూపిస్తారు.
అలాంటి ఆ కార్యాలయాల ముందే అడ్డంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై పలువురు ఔరా .. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ ఫ్లెక్సీల్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపినవారే ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారా.. లేక ఆయా శాఖలకు చెందిన అధికారులులే వాటిని ఏర్పాటు చేశారా.. అనే సందేహాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆ నాయకుడి జన్మదిన కార్యక్రమానికి కూడా ప్రజాప్రతినిధులకన్నా, అన్ని శాఖల అధికారులే ఎక్కువగా హాజరయ్యారు. దీన్ని బట్టే అధికార పార్టీకి ఏ స్థాయిలో అధికార యంత్రాంగం కొమ్ము కాస్తోందో తెలియకనే తెలుస్తుంది మరి.