ఏపీలో ఊహించిందే జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను.. పవన కల్యాణ్ అభిమానులు టార్గెట్ చేశారు. చాలాకాలంగా పుష్ప-2 సినిమాను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి అల్లు అర్జున్ అభిమానులు అంతే ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు విడుదల ముందు.. ఈ వార్ తారాస్థాయికి చేరింది. ఏకంగా.. రాజకీయ మలుపులతో సినిమాను అడ్డుకుంటామనే స్థాయికి చేరింది.
అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసిన జనసేన నేతలు.. సినిమాను అడ్డుకుంటామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో.. పుష్ఫ-2 బెనిఫిట్ షో వేయడానికి వీల్లేదని గన్నవరం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు హెచ్చరించాడు. అలాకాని పక్షంలో.. గురువారం సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
‘‘అల్లు అర్జున్ అహంకారంతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. మెగాఫ్యామిలీలో ఎవరిని టచ్ చేసినా ఊరుకోం. వాళ్ల సంగతి చూస్తాం’’ అంటూ రమేష్ బాబు వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు రంగంలోకి దిగారు. రమేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఈలోపే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం అంతే ప్రతిఘటనకు దిగారు.
ఇక.. రాష్ట్రవ్యాప్తంగా జనసేన కవ్వింపు చర్యలకు దిగుతోంది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ను, పుష్ప 2 చిత్రాన్ని హేళన చేస్తూ ఎడిటింగ్ పోస్టర్లు, వీడియోలతో రెచ్చిపోతున్నారు. మరోవైపు.. పుష్ప 2 చిత్రానికి మద్దతుగా అభిమానులు భారీ కటౌట్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇంకోపక్క.. వైఎస్సార్‌సీపీ పేరిట పలుచోట్ల పోస్టర్లు వెలియడం గమనార్హం. అయితే..
వీటిని మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పుష్ప-2 పోస్టర్లను చించేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాలా చోట్ల ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. అనంతపురంలో జనసేన నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. గుత్తిలో కేపీఎస్ థియేటర్ వద్ద ఫ్లెక్సీలను చించేశారు. తిరుపతి పాకాలలో రామకృష్ణ థియేటర్ వద్ద ఫ్లెక్సీ వివాదం రేగింది. చూడాలి.. రేపు ఇది ఇంకా ఎటు పోతుందో!.
ఇక.. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్.. స్నేహధర్మంతో నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పకు మద్దతుగా నిలిచారు. ఇది మెగా ఫ్యామిలీలో కొందరికి సహించలేదని.. ఫలితంగానే మెగా అభిమానులకు అల్లు అర్జున్ టార్గెట్ అయ్యారన్నది ఓపెన్ సీక్రెట్.
Comments
Please login to add a commentAdd a comment