వివరాలు సేకరిస్తున్న ఏసీబీ అధికారులు
శ్రీకాకుళం ,రాజాం సిటీ/రూరల్: రాజాం రెవెన్యూ కార్యాలయంలో అవినీతి ఊడలు పాతుకుపోతున్నాయి. రెండేళ్ల క్రితం ఈ శాఖకు చెందిన వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుపడగా.. తాజాగా ఇదే శాఖకు చెందిన వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. మ్యుటేషన్ నిమిత్తం ఆశపడిన ఓ వీఆర్వో ఏసీబీకి పట్టుపడ్డాడు. ఓ వైపు ఏసీబీ అధికారుల దాడులు జరుగుతున్నా అవినీతి అ«ధికారులు వెనక్కుతగ్గకపోవడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం నగరపంచాయతీ పరిధిలోని సారధి గ్రామానికి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న అలజంగి ఈశ్వరరావు, ఇదే మండలంలోని కంచరాం గ్రామానికి ఇన్‌చార్జి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. కంచరాం గ్రామానికి చెందిన కలిశెట్టి చిన్నంనాయుడుకు గ్రామంలో 1.81 ఎకరాల సాగుభూమి ఉంది. పంటరుణం నిమిత్తం ఆంధ్రాబ్యాంకును ఆశ్రయించగా పట్టాదారు పాసుపుస్తకంలో వివరాలు ఉన్నప్పటికీ వెబ్‌అడంగల్‌లో పూర్తి భూమి చూపించకపోవడంతో జూలై 24న మీ సేవా కేంద్రంలో మ్యుటేషన్ నిమిత్తం ఇతడు దరఖాస్తు చేసుకున్నాడు. అప్పట్లో ఆ దరఖాస్తు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వీఆర్వో వద్దకు చేరుకోగా అధికారులు పట్టించుకోలేదు.
మరోవైపు గడువు కూడా ముగిసింది. దీంతో విసుగుచెందిన రైతు అధికారులను సంప్రదించగా మరోదఫా మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాధిత రైతు నవంబర్ 28న మ్యుటేషన్ నిమిత్తం రెండోదఫా దరఖాస్తు చేసుకోగా నెలరోజులు కావస్తున్నా ఫలితం కనిపించలేదు. ఈ దఫా కూడా గడువు ముగుస్తుండడంతో రైతు రాజాం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఉన్నతాధికారులను సంప్రదించాడు. ఈ తంతు వీఆర్వో ఈశ్వరరావు వద్దకు చేరగా, వీఆర్వో బాధిత రైతుకు ఫోన్‌చేసి మ్యుటేషన్ కావాలంటే రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. అంత ఇచ్చుకోలేమని చెప్పినా వినిపించుకోకుండా ముందుగా రూ.6 వేలు చెల్లించాలని, పని పూర్తయ్యాక మిగతా రూ.4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భూ యజమాని కలిశెట్టి చిన్నంనాయుడు తన మనుమడు కలిశెట్టి మురళితో విషయం చెప్పడంతో ఈ నెల 26న మురళి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు సూచించిన విధంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం మురళి వీఆర్వో ఈశ్వరరావుకు రూ.5 వేలు అందించగా తీసుకున్న ఈశ్వరరావు వాటిని జేబులో పెట్టుకొని తన బండి వద్దకు వెళ్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం లోపలకు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. బాధితులు ఫిర్యాదు మేరకు నిందితుడిని విశాఖ ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర విలేకరులకు తెలిపారు.
విసిగిపోయి...
ఈ సందర్భంగా బాధిత రైతుకుటుంబానికి చెందిన మురళి విలేకరులతో మాట్లాడుతూ తన తాత సాగుభూమి మ్యుటేషన్ నిమిత్తం వీఆర్వో డబ్బులు డిమాండ్ చేశాడని తెలిపాడు. పేద కుటుంబానికి చెందినవారమని, తక్కువ ఇస్తామని చెప్పినా వినలేదని, ప్రతీ దఫా మీసేవా కేంద్రంలో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేయడం, సమయం గడిచిపోవడం జరిగిపోతుందని ఆవేదన వ్యక్తంచేశాడు. చేసేదిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించామన్నారు.
రెండేళ్ల క్రితం
సరిగ్గా రెండేళ్ల క్రితం 2016 ఆగస్టు 19న ఇదే రాజాం తహసీల్దార్ కార్యాలయానికి చెందిన కంచరాం వీఆర్వో కృష్ణ భూసంబంధిత విషయంలోనే ఏసీబీకి చిక్కాడు. అదే ఏడాదిలో సంతకవిటి మండలంలో మోదుగులపేట గ్రామానికి చెందిన అప్పట్టి పంచాయతీ కార్యదర్శి కూడా ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటనలు మరువకముందే మళ్లీ ఏసీబీ దాడులుకు వీఆర్వో చిక్కాడు. ఇప్పుడు కూడా రాజాం మండలంలో ఇదే కంచరాం గ్రామానికి చెందిన వీఆర్‌ఓ ఏసీబీకి చిక్కడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment