ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కాళోజీ సెంటర్(వరంగల్) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం అమలులో కొందరు ఉద్యోగుల తీరు కారణంగా అప్రతిష్ట వస్తోంది. ఇప్పటికే రెవెన్యూ శాఖపై పుట్టెడు కోపంతో ఉన్న రైతులు.. ప్రస్తుతం వ్యవసాయ శాఖపై కూడా అదే భావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులకు బాసటగా నిలుస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలకు రైతుల్లో మంచి పేరు ఉన్నా... అధికారుల తీరు దీనిని పలుచన చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఏఈఓ ఒకరు రైతులకు చెల్లించాల్సిన రైతు బంధు పథకం డబ్బును సొంత ఖాతాలో జమ చేసుకుని సస్పెన్షన్‌కు గురైన విషయం విదితమే. ఇక రైతు బీమా విషయంలో వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఉద్యోగి.. తాను అడిగినంత డబ్బు ఇస్తేనే పరిహారం ఫైల్‌ను ఎల్‌ఐసీకి సమర్పిస్తానంటూ నాన్చుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై విచారణ జరపగా నిజమేనని తేలినా... చర్యలు తీసుకోకుండా అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది.
పరిహారం కోసం లంచం
అన్నదాతకు అండగా ఉండేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వమే బీమా ప్రీమియంను ఎల్‌ఐసీకి చెల్లించింది. ఏదేని జరగరాని సంఘటన జరిగి రైతు మృతి చెందితే ఆయన కుటుంబానికి బీమా సంస్థ ద్వారా రూ.5లక్షల పరిహారం అందుతుంది. అయితే, రైతు కుటుంబ సభ్యులు లంచం ఇవ్వనిదే ఉద్యోగులు జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) ఫైల్ పంపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) ఒకరు ఇదే తరహాలో పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయగా అధికారుల దృష్టికి వెళ్లింది. అయితే, సదరు ఉద్యోగిపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నట్లు తెలిసింది.
ఆ ఉద్యోగి మాకొద్దు...
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవసాయ విస్తరణ అధికారి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడని రైతులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా అనేక ఆరోపణలు ఉండడంతో అధికారులు చీవాట్లు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అయినా ఆయనలో మార్పు రాకపోవడంతో వేరో చేటకు బదిలీ చేయాలని స్థానికంగా ఉండే ఓ అధికారి.. జిల్లా ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు సమాచారం.
మా దృష్టికి వచ్చింది...
వ్యవసాయ విస్తరణాధికారి ఒకరు అవినీతికి పాల్పడుతున్నాడనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాము. ఆయన వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు తదుపరి చర్యల కోసం జిల్లా అధికారికి నివేదిక సమర్పించాం.
– దామోదర్ రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకుడు
Comments
Please login to add a commentAdd a comment